ఎక్స్ వర్క్స్ కాంట్రాక్టుల్లో ఐటీసీ ఎప్పుడు తీసుకోవాలి ?
ABN , Publish Date - Jan 19 , 2025 | 01:47 AM
నిర్మాణ రంగంలో ఉన్న ఒక ప్రముఖ కంపెనీ తాను నిర్మించబోయే వాణిజ్య సముదాయానికి కావాల్సిన సిమెంట్, స్టీల్, ఇతర ఇన్‌పుట్స్‌ను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయాలని...

నిర్మాణ రంగంలో ఉన్న ఒక ప్రముఖ కంపెనీ తాను నిర్మించబోయే వాణిజ్య సముదాయానికి కావాల్సిన సిమెంట్, స్టీల్, ఇతర ఇన్‌పుట్స్‌ను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయాలని భావించింది. దీనివల్ల స్థానిక మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకే తనకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ను కొనవచ్చని భావించింది. అనుకున్న విధంగానే ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కావాల్సిన సరుకును ఆయా ఫ్యాక్టరీల నుంచి నేరుగా పొందేట్లుగా ఎక్స్ వర్క్స్ కాంట్రాక్టు రాసుకున్నారు. దీని ప్రకారం ఫ్యాక్టరీ నుంచి నిర్మాణ స్థలానికి మధ్య జరిగే రవాణా, బీమా ఇతరత్రా ఖర్చులను కొనుగోలుదారుడే భరించాలి.
ఎక్స్‌వర్క్స్ అంటే అమ్మకపుదారుడు తన ఉత్పత్తిని కొనుగోలుదారునికి తన ఫ్యాక్టరీ గేటు దగ్గరే అందిస్తున్నట్లు లెక్క. కాబట్టి తదుపరి ఖర్చు మొత్తం కొనుగోలుదారుడే భరించాలి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఎక్స్ వర్క్స్ అంటే కేవలం రవాణా లాంటి ఖర్చు మాత్రమే కాదు. ఆ సరుకుకు సంబంధించిన పూర్తి యాజమాన్య హక్కులు కూడా కొనుగోలుదారునికి ఫ్యాక్టరీ గేటు దగ్గరే బదిలీ అవుతాయి. అంటే, ఒకసారి ఆ సరుకు ఫ్యాక్టరీ గేటు దాటితే.. ఆ సరుకుకు సంబంధించిన పూర్తి బాధ్యత కొనుగోలుదారునిదే. అమ్మకందారునికి ఎలాంటి బాధ్యత ఉండదు.
పైన చెప్పిన ఉదాహరణలో ఆ నిర్మాణ సంస్థ తనకు కావాల్సిన ఉత్పత్తులు స్థానికంగా లభ్యమైనప్పటికీ తక్కువ ధరకు పొందాలనే ఉద్దేశంతో నేరుగా ఫ్యాక్టరీ నుంచి కాంట్రాక్టు కుదుర్చుకుంది. నిజానికి ఇక్కడ ఎక్స్ వర్క్స్ అనేది తప్పనిసరి కాదు. రవాణా, ఇతర ఖర్చులు కలిపినా తనకు స్థానిక ధరలతో పోలిస్తే తక్కువకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా కాంట్రాక్టు కుదుర్చుకుంది.
కొన్ని వ్యాపారాలకు తప్పనిసరి
అయితే, కొన్ని రకాల వ్యాపారాల్లో ఎక్స్ వర్క్స్ కాంట్రాక్ట్ అనేది తప్పనిసరి. ఉదాహరణకు ఆటోమొబైల్ రంగం. ఒక కారు డీలర్ తనకు కావాల్సిన కార్లను తప్పనిసరిగా ఎక్స్ వర్క్స్ ప్రాతిపదికనే కొనాలి. అంటే, కార్ల తయారీదారు, ఆ కారు డీలర్ కొనుగోలు చేసిన కార్లను ఎక్స్ వర్క్స్ ప్రాతిపదికన అంటే ఫ్యాక్టరీ గేటు దగ్గరే అందిస్తాడు. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేసిన కార్ల తాలూకు యాజమాన్య హక్కులు.. డీలర్ వేర్ హౌస్‌కో, షోరూమ్‌కో కార్లు చేరుకున్నప్పుడు కాకుండా కార్ల తయారీ స్థలంలోనే అంటే ఫ్యాక్టరీ గేటు దగ్గరే ఆ డీలర్ పొందుతాడు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న డీలర్ చెన్నైలోని ప్లాంట్‌లో కార్లు కొనుగోలు చేశాడు. రవాణాకు ఒక ఐదారు రోజుల సమయం పడుతుందని అనుకుందాం. అంటే జనవరి నెలాఖరులో కార్లు కొనుగోలు చేస్తే.. ఆ కార్లు డీలర్ దగ్గరకు చేరే సరికి జనవరి నెల పూర్తయి ఫిబ్రవరి మొదలవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జీఎ్‌సటీకి సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందటానికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఐటీసీ నిబంధనల ప్రకారం ఒక వస్తువు మీద క్రెడిట్ తీసుకోవాలంటే ఆ వస్తువును కొనుగోలుదారుడు కచ్చితంగా పొంది ఉండాలి. అంటే, రిసీవ్ చేసుకుని ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ కారు డీలర్ తాను కొనుగోలు చేసిన కార్లను ఎప్పుడు రిసీవ్ చేసుకున్నట్లు భావించాలి? వాటి మీద ఎప్పుడు క్రెడిట్ తీసుకోవాలి? కారు భౌతికంగా తన షోరూమ్‌లో పొందినది ఫిబ్రవరిలో కాబట్టి కార్లను అదే నెలలో పొందినట్లు భావించి ఫిబ్రవరి నెల రిటర్న్‌లో క్రెడిట్ తీసుకోవాలా? లేదా తనకు యాజమాన్య హక్కులు జనవరిలోనే బదిలీ అయ్యాయి కాబట్టి, జనవరిలోనే తాను కార్లు పొందినట్లు భావించి సంబంధిత ఐటీసీ జనవరి నెల రిటర్న్‌లో తీసుకోవాలా ? ఇలాంటి గందరగోళం ఎక్స్ వర్క్స్ లావాదేవీల్లో ఉండేది.
స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
ఈ గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం, వస్తువులను రిసీవ్ చేసుకోవటం అంటే భౌతికంగా వస్తువులను పొంది ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్ వర్క్స్ ప్రాతిపదికన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు.. ఆ వస్తువుల మీద సర్వ హక్కులు కొనుగోలుదారునికి ఫ్యాక్టరీ గేటు దగ్గరే సంక్రమిస్తాయి. కాబట్టి ఆ క్షణమే అతను ఆ వస్తువులను రిసీవ్ చేసుకున్నట్లు భావించాలి. ఐటీసీకి సంబంధించిన ఇతర నియమ నిబంధనలు సరిగ్గా ఉన్నట్లయితే, పైన చెప్పిన ఉదాహరణలో కారు డీలర్ తాను కొనుగోలు చేసిన కార్ల తాలూకు క్రెడిట్ జనవరి నెల రిటర్నులోనే తీసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణతో ఎక్స్ వర్క్స్ కాంట్రాక్టుల్లో ఐటీసీ తీసుకోవటానికి స్పష్టత లభించింది.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.