భోగిపండ్లు పోయరే ఓ రమణులారా...
ABN, Publish Date - Jan 12 , 2025 | 07:32 AM
భోగిపండ్లు పొయ్యటం సంక్రాంతి వేడుకల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు వచ్చేదే భోగి. ముఖ్యంగా ఈ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంబరాన్ని సంక్రాంతినాడు కూడా జరుపుకొంటారు.
భోగిపండ్లు పొయ్యటం సంక్రాంతి వేడుకల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు వచ్చేదే భోగి. ముఖ్యంగా ఈ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంబరాన్ని సంక్రాంతినాడు కూడా జరుపుకొంటారు.
భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడ ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. ఇందులో కొన్ని వస్తువులు ప్రాంతీయ ఆచార వ్యవహారాలను అనుసరించి కొద్దిపాటి మార్పుతో ఉంటాయి. కొందరు శనగలు, చిటికెడు పసుపు, బియ్యం కూడా కలుపుతారు. ఏ ప్రాంతమైనా రేగుపండ్లు మాత్రం తప్పని సరిగా ఉంటాయి. సాధారణంగా అయిదేళ్ల లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఆ రోజు పిల్లలకు హారతి ఇచ్చి, గుప్పిట నిండా భోగి పళ్లని తీసుకుని, మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. ముందుగా తల్లి, తరువాత ఇతర పెద్దలు ఇలాగే చేస్తారు. పిల్లలకి భోగి పండ్లు పొయ్యడం వలన నర దృష్టి, గ్రహపీడ తొలగుతాయి.
సూర్యభగవానుడి ఆశీస్సులు...
రేగుపండు చూడటానికి బాల సూర్య మండల ఆకారంలో ఎర్రగా ఉంటుంది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. జ్ఞానదాత. మానవుల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి ఆ బ్రహ్మ రంధ్రాన్ని ప్రేరేపితం చేేస్త, పిల్లల్లో సూర్య భగవానుడి అనుగ్రహంతో జ్ఞానం పెరుగు తుందని, సూర్యనారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని, పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని నమ్మకం. అలా సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే ఈ భోగిపండ్లను పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల చుట్టు పక్కల ఉండే క్రిములు నశిస్తాయి. చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం బంతిపూలకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా భోగిపండ్ల వెనుక ఎంతో సామాజిక ప్రయోజనం దాగి వుంది కనుకనే మన పెద్దలు తరతరాలుగా ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు.
రేగుపండు లేదా రేగి పండ్లను ‘బదరీఫలం’ అని సంస్కృతంలో అంటారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, అందుకే అది బదరికాశ్రమం అయిందంటారు. మరి కొందరు నరనారాయణులు శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి బదరికావనంలో తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీదబదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. అంతటి పవిత్రత రేగుపళ్లకు మన సంప్రదాయంలో ఉంది. దక్షిణ భారతదేశంలో సంక్రాంతినాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి.
రేగుపండే ఎందుకంటే...
ఎర్రగా సూర్యమండలాకారంలో ఉండే పండ్లు ఇంకా చాలా ఉన్నాయి కదా? భోగి స్నానానికి రేగుపండ్లే ఎందుకు వాడతారు? అంటే దానికి కారణం ఆ పండులో ఉండే పోషక విలువలే. ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరమని ఎప్పటికప్పుడు తెలియ చెప్పటమే ఈ పండును భోగిపండుగా వాడటం వెనుక ఉన్న అంతరార్థం. రేగు పండ్లలో పుష్కలమైన పోషకాలున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ పండ్లను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. రేగుపండ్లు తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లతో కలిసి అందుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో సహాయ పడతాయి. అలాగే విటమిన్ సి రోగ నిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో, మల బద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రేగిపండ్లు పేగు సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెరస్థాయి నియంత్రణకు రేగుపండ్లు ఉపకరిస్తాయి. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే, రక్తంలో చక్కెర స్థాయిలు సక్రమంగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ డి ఉన్నందున, చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద ముడతలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రేగుపండ్లలో క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలున్నాయి. దీనివల్ల వృద్ధాప్యంలో ఎముకల బలహీనత సమస్యలు తగ్గుతాయి. అలాగే మానసిక శక్తిని పెంచడంలో, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడే ఔషధ గుణాలున్నాయి. రక్తహీనత నివారణకు కూడా రేగుపండ్లు ఉపకరిస్తాయి. ఐరన్ అధికంగా కలిగి ఉండటమే దీనికి కారణం. శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. రేగుపండ్లను రోజుకొక పిడికెడు తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు న్నాయి కాబట్టే సంక్రాంతికి రేగుపండ్లను భోగిపండ్లుగా కీర్తిస్తూ పెద్దపీట వేస్తారు. భోగి స్నానం పిల్లలకు శుభప్రదం, ఆరోగ్యదాయకం.
- శ్రీమల్లి, 98485 43520
Updated Date - Jan 12 , 2025 | 07:32 AM