Ambedkar Jayanti 2025: అంబేడ్కర్ తాత్త్వికతకు ఆనాటి కవితాభాష్యం
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:19 AM
రావూరి ఏకాంబరం రచించిన "అంబేడ్కరో సమరసింహ" కావ్యం అంబేడ్కర్ తాత్వికతను ఆధారంగా చేసుకొని దళిత చైతన్యాన్ని అలవోకగా పద్యీకరించింది. ఆయన సాహిత్యం ద్వారా సామాజిక న్యాయానికి, ప్రజా చైతన్యానికి అక్షర రూపం ఇచ్చాడు

జాతీయోద్యమం, తదనంతర వామపక్ష, విప్లవోద్యమాల నేపథ్యంలో వెలువడిన కవిత్వంలో మహాత్మా గాంధీ, కారల్ మార్క్స్, లెనిన్, మావోల ప్రభావం ప్రగాఢంగా కనిపిస్తుంది. ఈ దిశగా కొంత పరిశోధన జరిగింది. ఆధునిక సాహిత్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రభావం గురించి సమగ్ర చర్చ జరగాల్సిన అవసరముంది. సమకాలీన సంక్లిష్ట సందర్భానికి ఈ చర్చ దారిదీపంలా వెలుగునిస్తుంది. రాజ్యాంగ నైతికత దిశగా సృజనకారులు దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆది ఆంధ్ర ఉద్యమం నుండి ఈనాటి దళిత ఉద్యమం వరకూ వెలువడిన వందేళ్ల సాహిత్యంలో అంబేడ్కర్ స్ఫూర్తిని విశ్లేషిస్తేనే తెలుగు విమర్శ పరిపుష్టమవుతుంది. కుసుమ ధర్మన్న నుండి ఈనాటి దళిత కవుల వరకూ ఎంతోమంది అంబేడ్కర్ ఆశయాలను సముచితంగా కవిత్వీకరించారు. అంబేద్కర్ తాత్త్వికతను శ్వాసగా ఏకైక ధ్యాసగా భావించి ప్రభావశీలమైన కవిత్వం, పాటలు రాసిన ప్రజాకవి రావూరి ఏకాంబరం. నిబద్ధుడైన ‘భీమ’ కావ్యకర్తగా కార్యకర్తగా అణగారిన వర్గాల్లో ఏకాంబరం అనంత చైతన్యాన్ని కలిగించాడు. అంబేడ్కర్ సిద్ధాంతాన్ని ‘సిరానిష్టం’ చేసుకొన్న ప్రజాకవి రావూరి ఏకాంబరం, కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని నల్లకుంట గ్రామంలో 1924 సెప్టెంబర్ 24న జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. మాల సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో పుట్టిన ఏకాంబరం ఎంతో కష్టపడి కాకినాడ పిఆర్ కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసించాడు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పౌర సంబంధాల అధికారిగా 20ఏళ్ళ సేవలందించాడు.
గన్నవరం శాసన సభ్యుడిగా షెడ్యూల్ కాస్ట్ పెడరేషన్ పార్టీ నుండి పుచ్చలపల్లి సుందరయ్యపై పోటీ చేసి ఓడిపోయాడు. అంబేడ్కర్ అడుగుజాడల్లో మడమ తిప్పకుండాసాగిపోయిన ఈ ధన్యజీవి 2001 ఏప్రిల్ 21న తుది శ్వాస విడిచాడు. విజయవాడ, గుడివాడ ప్రాంతాల్లో 1944లో జరిగిన బహిరంగ సభల్లో అంబేడ్కర్ ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేసిన ఏకాంబరం, ఆ మహా నాయకుని దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంలోనే ఏకాంబరం రాసిన ‘‘డాక్టరో అంబేడ్కరా! నీ నాయకత్వం లోకమెల్లను మేలు కొల్పెను’’ అనే పాట ఉభయ గోదావరి జిల్లాల్లో ‘భీమ’ మంత్రమై మారుమోగింది. ‘‘ఇంత పెద్ద విశాలదేశము/ సెంటు భూమి మాకు లేదు/ కసవు గుంటలే కాపురాలు/ జోరుగా పెనుగాలి వీచెను/ బోరుమని జడివాన కురిసెను/ కూలి నాలి జనాళి కొంపలు/ కూలిపోతే కష్టమెవరికి/ మాలవాడని మాదిగోడని మారు పేరు చండాలుడాయని/ మాల మాదిగ లేకమైతే మారిపోదా కాలచక్రం’’ అంటూ లయాన్వితంగా సాగే ఈ పాటకు నేటికీ ప్రాసంగికత ఉంది. చోడగిరి చంద్రరావు వందలాది సభల్లో ఈ పాటను ఆలపించి, ప్రజలను ఉర్రూతలూగించాడు. ఈ పాట విని అంబేడ్కర్ ఆనంద పరవశుడై కన్నీరు పెట్టుకున్నాడని పొనుగుమట్ల విష్ణుమూర్తి తన పరిశోధనా గ్రంథంలో రాశాడు.
రావూరి ఏకాంబరం ఆశు కవి. ప్రజాసమూహంలో పర్యటించే క్రమంలో సందర్భానుసారంగా ఆశువుగా, భావగర్భితంగా ఎన్నో పద్యాలు, పాటలు ఆలపించేవాడు. 1944 నుండి 1980 వరకూ ఏకాంబరం ఎన్నో పద్యాలు, పాటలు రాశాడు. వీటిలో చాలావరకు పత్రికల్లో ప్రచురితం కాకపోయినప్పటికీ పాత తరం అంబేడ్కరీయుల గుండె గొంతుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. 1984లో రావూరి ఏకాంబరం సాహితీ ప్రచురణ కమిటీ ఏర్పడి ఆయన పద్యాల్లో కొన్నింటిని సేకరించి ‘అంబేడ్కరో సమర సింహ’ పేరుతో పద్యకవితల సంకలనాన్ని ప్రచురించారు. 46 పద్య కవితలున్న ఈ సంకలనం ఎంతో విలువైనది. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య, బొజ్జతారకం విశ్లేషణాత్మకమైన ముందు మాటలు రాశారు. ఆంధ్ర ప్రాంతంలో అంబేడ్కర్ పర్యటించడానికి మూలకారకుడైన నందనార్ హరికి ఈ గ్రంథాన్ని అంకితం చేశాడు కవి. అంబేడ్కర్ ఔన్నత్యాన్ని, ఆయన బహుముఖీన ఉద్యమ కార్యాచరణ ఆవశ్యకతను, దేశ పునర్నిర్మాణానికి అవసరమైన సాంస్కృతిక విలువలను ఈ కావ్యం ద్వారా ఏకాంబరం చాటిచెప్పాడు. ‘‘నీ మహోజ్వల నిరుపమ నిర్విరామ/ సర్వతోముఖ విప్లవ సమర జ్వాల/ సమతకు పునాది వేసెను భీమ రాయ! భావ విప్లవ సామ్రాజ్య సార్వ భౌమ’’ అంటూ, నాలుగు దశాబ్దాల పాటు సాగిన అపూర్వమైన అంబేడ్కర్ పోరాటాన్ని నాలుగు పాదాల్లో ఏకాంబరం సముచితంగా పద్యీకరించాడు.
‘‘దేశభక్తుడెవడొ, దేశద్రోహియెవడొ/ గతచరిత్ర తవ్వి కథలు చెప్పి’’ పాలకులకు అంబేడ్కర్ దిక్సూచిగా నిలిచాడని ఈ కవి నిర్ధారించాడు. కులం, మతం, సంస్కృతి, భగవద్గీత, ప్రజాస్వామ్యం, బ్రాహ్మణవాదం, ప్రతిభ, గాంధీతత్త్వం, రిజర్వేషన్లు, కులాంతర వివాహాలు తదితర అంశాలను అంబేడ్కర్ ఆలోచనల వెలుగుల్లో ఈ కవి నిర్వచించాడు. వాటి చుట్టూ రాజకీయ రహస్యాలను బట్టబయలు చేశాడు. ఈ పద్య కవితా సంపుటి అంబేడ్కర్ తాత్త్వికతకు ఒక సాహిత్య మేనిఫెస్టోలాగా, రావూరి ఏకాంబరం నిశిత విమర్శనా శక్తికి అక్షర దర్పణంలా కనిపిస్తుంది. నిష్టూరమైన నిజాలను, కఠినమైన వాస్తవాలను, ఆచరణ యోగ్యమైన సామాజిక సత్యాలను తన పద్యాల ద్వారా కవి తేటతెల్లం చేశాడు. ‘‘బోధిసత్వుపైన పోటీగా బ్రాహ్మణుల్/ మాంస భక్షణమును మానివేసి/ మాంసభక్షకులని’’ (గో మాంస భక్షణ) అంటరాని ప్రజలను వెలివేశారని బౌద్ధానికి వ్యతి రేకంగా రగిలిన అలనాటి కుహనావ్యూహాలను కవి తెలియ పరిచాడు. ‘పీడిత జననేత భీమరాయ!’, ‘భీమరాయ అంబేడ్కరో సమరసింహ!’ లాంటి మకుటాలతో శతక శైలిలో ఏకాంబరం ఈ కావ్యాన్ని రచించాడు. ‘విశ్వకళ్యాణదాయక’, ‘విప్లవాలరేడ’, ‘దళిత సాహితీ విధాత’, ‘నవ్య బౌద్ధధర్మ కావ్యశిల్పి’ లాంటి ఔచితీమంతమైన విశేషణాలు అంబేడ్కర్ అసాధారణ మూర్తిమత్వానికి నిదర్శనంగా కనిపిస్తాయి. ప్రాచీన, ఆధునిక సాహిత్యధోరణులపై ఏకాంబరం కన్నెర్ర జేశాడు. బాస, కాళిదాస, వ్యాస, వాల్మీకులు వస్తుపరంగా ఒకే మూస పద్ధతిలో కావ్య రచన గావించారని, ‘‘బ్రాహ్మణాధిక్యమున్, బ్రాహ్మణోద్ధరణ మున్ బోధించు గ్రంథాలు’’ (వ్యాసాదులు) రాసారని తద్వారా ‘‘బ్రాహ్మణేతరులను మానసిక బానిసలుగా’’ మార్చి వేశారని ఏకాంబరం తీవ్రంగాఆరోపించాడు.
‘‘పాలు బోసి పెంచు పాడు సాహిత్యము/ మూఢ నమ్మకాలు ముదిరి పోవ’’ అంటూ అంధవిశ్వాసాలను పోషించేది పాడు సాహిత్యమని కవి త్రోసిపుచ్చాడు. సాహిత్యాన్ని మలుపు తిప్పిన అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం పరిమితులను సాహసోపేతంగా ప్రశ్నించాడు. సాహిత్యంతో సమరభేరి మోగించిన ప్రగతి శీల రచయితలకు ‘‘దండెత్త కులముపై దమ్ములు లేవని’’ వాదించాడు. ‘‘అడ్డుగోడ కులము, అడ్డమస్పృశ్యత/ వర్గదృష్టి జంపు, ప్రగతి జంపు/ అడ్డుగోడ మరిచి అరచెదరేలరా!’’ (అరసం, విరసం) అంటూ కుల మనే అడ్డు గోడలు కూల్చకుండా విప్లవం విజయవంతం కాదని చెప్పిన అంబేడ్కర్ దృష్టితో ఏకాంబరం రచయితలను నిరసించాడు. ‘‘మార్క్స్‌ను స్మరి యించు, మావోను స్మరియించు/ పిల్లి మొగ్గలేయు కుల మడ్డు పడగానే’’ అని మేధావుల వైఖరిని దుయ్యబట్టాడు. ‘‘పిట్సుబర్గులోన వెంకన్న ప్రతిమను/ దర్శనంబు చేసి పరవశించు/ శ్రీశ్రీయా మార్క్సిస్టు?’’ అని మహాకవిని కూడా నిలదీశాడు. దళితేతరులు అంబేడ్కర్ స్మారక సభలను, వైశ్యేతరులు గాంధీ సభలను, కమ్మజనేతరుల్ త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక సభలను నిర్వహించినపుడే విశ్వ సోదర భావము వెల్లివిరుస్తుందని ఈ కవి పిలుపునిచ్చాడు. దళిత విద్యావంతులు, మేధావులు తమ జాతి లోని నిరుపేదల, నిరక్షరాస్యుల ఉద్ధరణకు ఏమాత్రం పాటుపడటం లేదని చివరి దశలో అంబేడ్కర్ బాధపడ్డాడు.
‘‘దళిత మేధావులు దాసానుదాసులైరి/ దళిత మేధావులు దండగ సరుకైరి, దళితుల తెగనమ్ము త్రాష్టులైరి’’ అంటూ ఏకాంబరం విమర్శించాడు. దళిత ప్రతినిధులు పాలక ‘పార్టీల పాలేర్లు’గా మారిపోతున్నారని ఆవేదన చెందాడు. ఈ మేధావులు దండకమ్ములు మాని, దళితుల చరిత్రను వెలికి తీయాలని, దాస్యభాష్యాలు మాని సూటిగా సత్యాలు తెలియచెప్పాలని హితవు పలికాడు. ‘‘నీవు పెట్టిన భిక్షకు నిజము తండ్రి! కుక్క మూతి పిందెలు కాచెనకట! అని కవి వాపోయాడు.’’ ‘‘దాస్య జాడ్య జనిత దౌర్భాగ్య శేఖరుల్’’ అని తన జాతి జనులను ఆగ్రహంగా నిందించాడు. ‘‘సిద్ధాంతములు నాస్తి, రాద్ధాంతములు జాస్తి/ సిగపట్లు జాస్తయ్యె సిగ్గులేక/ స్వార్థ ప్రయోజనాల్, బహునాయకత్వాలతో’’ అంబేడ్కరీయులే అంబేడ్కరీయులకు ఆగర్భశత్రువులగా మారుతున్నారని ఆత్మ విమర్శ దృక్కోణంలో నుండి ఆరోపించాడు. బహుజనులకు మాల మాదిగలన్న చులకన అని, పై కులాలకు వీరు పచ్చి బానిసలని, కులపిశాచిని కూల్చంగా కలిసి రావాలని బహుజనులకు కవి పిలుపు చెప్పాడు. ‘‘మతకలహాలలో మృతి చెందు బహుజనుల్/ అగ్రకులోన్మాదులాదరికె రారు’’ అని మతకలహాల్లోని హింసను వ్యతిరేకించాడు. ప్రత్యేకంగా తెలుగు భాషా సాహిత్యాలను, వ్యాకరణాన్ని అధ్యయనం చేయనప్పటికీ ఏకాంబరం ప్రతిభావంతంగా పద్య రచన చేశాడు. పంచమాత్రా గణాల ప్రయోగంతో అలవోకగా సీస పద్యాలను పాఠకుల హృదయ క్షేత్రాల్లో కదం తొక్కించాడు. ప్రజాకవుల పాటల్లా వ్యవహారిక భాషలో ఆటవెలది, తేటగీతి పద్యాలను తీర్చిదిద్దాడు. కావ్య శిల్పానికి ప్రాధాన్యత నివ్వకుండా జనజాగృతియే ధ్యేయంగా, అంబేడ్కర్ ఆశ యాల ప్రచారానికి, దళిత చైతన్యానికి వాహికగా పద్యాన్ని మలుచుకున్నాడు. నిశిత భావ ప్రకటనకు యతి ప్రాసలు ప్రతిబంధకమైన సందర్భంలో ఛందో నియమాలను కూడా ధిక్కరించాడు. అర్ధశతాబ్దం క్రితమే స్పష్టమైన అంబేడ్కర్ దృక్పథంతో, ప్రగాఢమైన భావ సాంద్రతతో రావూరి ఏకాంబరం రాసిన ‘అంబేడ్కరో సమరసింహ’ కావ్యం సమకాలీన సాహిత్యానికి గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది.
(నేడు అంబేడ్కర్ జయంతి) కోయి కోటేశ్వరరావు 94404 80274