Share News

బాలార్కుడు

ABN , Publish Date - Jan 27 , 2025 | 01:14 AM

ఒక పున్నమి రాత్రి చందమామ మా ఇంటి మీదుగా వెళ్తుంటే జాబిల్లిలోని కుందేలు పిల్ల ఒక్క ఉదుటున పెరట్లోని జాం చెట్టు కొమ్మ పైకి దూకి చూస్తుండగానే మాయమై పోయింది....

బాలార్కుడు

ఒక పున్నమి రాత్రి చందమామ మా ఇంటి మీదుగా వెళ్తుంటే జాబిల్లిలోని కుందేలు పిల్ల ఒక్క ఉదుటున పెరట్లోని జాం చెట్టు కొమ్మ పైకి దూకి చూస్తుండగానే మాయమై పోయింది. లోపలి గది లోకెళ్లి చూడగా మా అమ్మాయి పొత్తిళ్లలో మా మనవడు.

నిన్నటి నుండీ ఆమే నేనూ పండిన పెసరచేను ఎండకు పగులు తున్నట్టు ఒకటే పగులుతున్నాం. చేను, చెక్కా లేని మాకు ఈ చిటపటలేంటి అని చూస్తే ఇల్లంతా పచ్చని పెసర చేనులా పరుచుకున్న మా మనవడు.


నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న కొలనులో నింగికి నమస్కరిస్తూ నిలుచున్న కలువ మొగ్గ గండుచేప తోక విసురుకు ఒక్కసారిగా చలించినట్టు దేహమంతా ఒకటే అనుకంప. చేపలు పట్టేవాడు వెదురు బద్దల బుట్టతో చెరువు అంతా గాలించి గాలించి చివరికి లోపలికి చేయి పెట్టి బయటికి తీసిన చేపలా మా మానస సరోవరంలో ఈదులాడే చేప మా మనవడు.

ఊరంతా సద్దుమణిగాక దూరం నుండి లీలగా గజ్జెలసవ్వడి... ఢంకా ధ్వానం.

ఎక్కడో శివారుపల్లెలో జాతర జరుగుతుందేమో అనుకున్నాను. లోపలికి వెళ్లి చూస్తే వెల్లకిలా పడుకొని కాళ్లు చేతులతో గాలి సైకిల్ తొక్కుతూ మా మనవడు.


దుర్గమారణ్యాల ఇరుకు దారులగుండా గులకరాళ్ళను వొరుసుకుంటూ దిగువకు దొర్లుకుంటూ వస్తున్న సన్నటి సెలయేటి గల గల.. ఎక్కడెక్కన్నుంచీ అని తరచి చూస్తే నా మనసు చేదబావిలో గిలకలు వేస్తూ తరంగిస్తున్న మనవడు తాబేలు.

నడి రాత్రి గాఢ సుషుప్తిలో దూరపు వనాల నుండి ఒక్కటే కేకుల క్రేంకారావాలు. వనాలకోసం ఊరంతా కలయ చూస్తుంటే మా లోపలే మా మనసు మోడు చెట్లకు చిగురుటాకుల పసరిక ను అద్దుతూ కొమ్మ కొమ్మకు గెంతుతూ మా మనవడు నెమలి.

ప్రాచీ దిశ దిగంతరేఖ మీద కొండంత ప్రభాత సంధ్య. ఇంటికొచ్చి చూస్తే ఇంట్లో జ్వలించే శత సహస్ర అంచుల గొప్ప కాంతిపుంజం.

కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని పరికేస్తే అనంత కోటి నవ్వుల కిరణాల బాలార్కుడు మా మనవడు.

శిఖామణి

98482 02526


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 27 , 2025 | 01:14 AM