Share News

గోల్వాల్కర్ ఆశయం నెరవేరేనా?

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:07 AM

‘గురూజీ గోల్వాల్కర్ భారతదేశం ఏకీకృత వ్యవస్థ కావాలని ఆకాంక్షించారు. సమాఖ్య రాజకీయ వ్యవస్థ వల్ల బారతదేశం విచ్ఛిన్నం కావచ్చని ఆయన నిజంగానే భయపడ్డారు. అంతర్గత విభేదాలు..

గోల్వాల్కర్ ఆశయం నెరవేరేనా?

‘గురూజీ గోల్వాల్కర్ భారతదేశం ఏకీకృత వ్యవస్థ కావాలని ఆకాంక్షించారు. సమాఖ్య రాజకీయ వ్యవస్థ వల్ల బారతదేశం విచ్ఛిన్నం కావచ్చని ఆయన నిజంగానే భయపడ్డారు. అంతర్గత విభేదాలు, చిన్నచిన్న తగాదాల మూలంగా ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప దేశం వేలాది ఏళ్లపాటు బాహ్య దురాక్రమణలను ఎదుర్కోలేకపోయింది. ఈ కాలంలో దేశ ఐక్యత ప్రమాదంలో పడింది. భాష అనేది ఒక బలమైన భావోద్వేగమైన అంశం. స్వాతంత్ర్యం తర్వాత తమిళ ప్రాంతాల్లో ప్రత్యేక ద్రవిడస్థాన్ కోసం ఉద్యమాలు జరిగాయి. భాషా రాష్ట్రాలు ప్రాంతీయ దురభిమానాలకు దారితీస్తాయని, దాని వల్ల జాతీయ ఐక్యత, సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందని గోల్వాల్కర్ భావించారు. అయితే హిందీ అనేది ఒక అనుసంధాన భాషయే కాని జాతీయ భాష కాదని, బెంగాలీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళీ మొదలైనవన్నీ జాతీయ భాషలేనని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం ఒక దేశం కాదని, వివిధ భాషల ఆధారంగా ఉన్న జాతీయతల సమ్మేళనం అనే హానికరమైన సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. స్టాలిన్ మొదట ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం భారత జాతీయతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నది.’ అని ఆర్‌ఎస్ఎస్ మేధావి ఎస్‌వి శేషగిరిరావు ‘ఒక సిద్ధాంతంతో నా ప్రయాణం’ (మై జర్నీ విత్ ఆన్ ఐడియాలజీ) అన్న పుస్తకంలో రాశారు. శేషగిరిరావు చెప్పిన విషయాలు భారతీయ జనతా పార్టీ ఆలోచనా విధానాన్ని ప్రతిఫలింపచేస్తాయి.


గత శతాబ్దపు తొలి దశాబ్దంలోనే హిందూ జాతీయవాదానికి బీజాలు పడ్డాయనడంలో సందేహం లేదు. వినాయక్ దామోదర్ సావర్కార్ (1883–1966), కేశవ్‌ బలిరాం హెగ్డేవార్ (1889–1940), మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ (1906–1973) అనే ముగ్గురు సిద్ధాంతకర్తల ఆలోచనా విధానమే బీజేపీకి పునాది అని వేరే చెప్పనక్కర్లేదు. సావర్కార్ రచించిన ఎసెంషియల్స్ ఆఫ్ హిందూత్వ, గోల్వాల్కర్ రచించిన వి ఆర్ అవర్ నేషన్ హుడ్, బంచ్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాల్లో చెప్పిన విషయాలే బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు చెందిన లక్షలాది కార్యకర్తలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేశాయి. కులాల ప్రాతిపదికన విడిపోయిన హిందువులు కలిసికట్టుగా ఒకే జాతిగా ముందుకు రావాలని తమ ప్రాచీన జన్మభూమిని బయటివారి కబంధ హస్తాలనుంచి విముక్తం చేయాలని సావర్కర్ తన రచనలో పేర్కొన్నారు. మరోవైపు ఒకేరకమైన సంప్రదాయాలు, ఉమ్మడి భాష, దేశ పూర్వ వైభవం, చరిత్రకు సంబంధించి ఒకేరకమైన స్మృతుల గురించి గోల్వాల్కర్ తన రచనల్లో ఉల్లేఖించారు. ఒకే మూలానికి చెందిన ఒకే సంస్కృతి క్రింద మనుగడ సాధించే జనాభా గురించి ఆయన మాట్లాడారు. ఇటాలియన్ జాతీయవాదనాయకుడు గియుసెప్పె మజిని ఆయనను ప్రభావితం చేశారు. మరాఠీలో మజిని జీవిత చరిత్రను కూడా గోల్వాల్కర్ రచించారు. గత పది సంవత్సరాలుగా నరేంద్రమోదీ ప్రభుత్వం మాట్లాడుతున్న ఒకే దేశం–ఒకే ఎన్నికలు, ఒకే దేశం–ఒకే గుర్తింపు కార్డు, ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒకే పౌరస్మృతి లాంటి పదాల వెనుక ఒక ఆలోచనాధార ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయాలని చెప్పినా, మోదీయే అంతటా సర్వాంతర్యామిగా కనపడ్డా, కులగణనను వ్యతిరేకించినా, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కూటమిలో కలుపుకున్నా ఈ ఆలోచనా విధానంలో భాగమే. రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకుంటూ చట్టాలు చేయడం వెనుక ఉద్దేశం కూడా అదే.


అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించినా, ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించినా, కాశీ–తమిళ సంగమం అంటూ కార్యక్రమాలను ఏర్పాటు చేసినా ఒకే ఒక సంస్కృతీ ప్రవాహంలో భారతీయులను ఏకం చేయాలనే ఆలోచన తప్ప మరేమీ లేదు. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో ప్రకటన చేస్తూ మహకుంభ్ కేవలం మతపరమైన సమ్మేళనమే కాదని, సమైక్యత, అభివృద్ధి, ఆధ్యాత్మిక జాగృతి దిశగా భారతదేశ ప్రయాణం అన్నారు. మహాకుంభ్ మన జాతీయ చేతన ఎంత గొప్పగా జాగృతం అయిందో స్పష్టం అయిందని ఆయన అన్నారు. అయితే చర్చనీయాంశమైన విషయం ఏమంటే దాదాపు వంద సంవత్సరాల సైద్ధాంతిక భూమిక ఉన్నా, పది సంవత్సరాలకు పైగా మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా దేశాన్నంతటినీ ఒకే గొడుగు క్రిందకు తీసుకురావడంలోను, ప్రజలందర్నీ ఒకే ఆలోచనా విధానంలో భాగస్వాములను చేయడంలోను బీజేపీ, దాని అనుబంధ సంస్థలు విజయవంతమయ్యాయా అన్న విషయం చర్చించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే కొన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి వస్తున్న ప్రతిఘటనలను చూడాల్సి ఉన్నది. హిందీ భాష , నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపులో అన్యాయం లాంటి అంశాలను ఈ రాష్ట్రాలు లేవనెత్తుతున్నాయంటే దానికీ ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి కాంగ్రెస్ కూడా తొలుత దేశ వ్యాప్తంగా హిందీని అమలు చేసేందుకు ప్రయత్నించింది. గాంధీ హిందీ భాషా వ్యాప్తి ద్వారా దేశాన్ని స్వాతంత్ర్య సమరం దిశగా నడిపేందుకు ప్రయత్నించారు. తమిళనాడులో స్వాతంత్ర్యానికి పూర్వమే హిందీ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. హిందీని ఇంగ్లీషు స్థానంలో దేశ జాతీయ భాషగా నిర్ణయిస్తూ హోంమంత్రి హోదాలో గుల్జారీలాల్ నందా సర్క్యులర్ జారీ చేసినప్పుడే హిందీ మాట్లాడని రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత హోంమంత్రి గోవింద వల్లభ్ పంత్ నేతృత్వంలో ఉభయ సభలకు చెందిన 35 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ కూడా హిందీని ప్రధాన భాషగా నిర్ణయించినప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత బయలుదేరింది.


హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం వల్ల హిందీకే నష్టమని రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడైన కెఎం మున్షీ లాంటి వారు కూడా అభిప్రాయపడ్డారు. 1965లో హిందీ వ్యతిరేక ఆందోళనలో తమిళనాడులో దాదాపు 70 మందికి పైగా మరణించారు. హిందీయేతర రాష్ట్రాలు కోరుకున్నంతవరకూ ఇంగ్లీషు అధికార భాషగా కొనసాగుతుందని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హామీ ఇవ్వాల్సి వచ్చింది. భాషపై జరిపిన ఆందోళన మూలంగానే డిఎంకె తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. ఈ రాజకీయ నేపథ్యం తెలుసు కనుకే డిఎంకె అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది ఉండగానే జాతీయ విద్యవిధానం ద్వారా హిందీని దొడ్డిదారిన ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళన మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్ హిందీని బలవంతంగా అమలు చేసే విధానాన్ని వెనక్కు తీసుకున్నా, బీజేపీ తాను హిందీని బలవంతంగా రుద్దడం లేదని చెబుతున్నా హిందీ భాష క్రమంగా అంతటా వ్యాపిస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా హిందీ ఆమోదయోగ్యత పెంచేందుకు నిరంతరం విస్తృత ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి హిందీ సినిమాలు, పాటలు, మహాభారత్, రామాయణ్‌తో పాటు హిందీ సీరియళ్లు హిందీకి ఆమోదయోగ్యత పెంచాయి. అనేకమంది దక్షిణాది ప్రజలు ఢిల్లీకి వచ్చి హిందీ రానందుకు తొలుత బాధపడినప్పటికీ వారు క్రమంగా హిందీలో పట్టు సంపాదించిన సందర్భాలున్నాయి. తనకు హిందీ, ఇంగ్లీషు రానందువల్లే ప్రధానమంత్రి కాలేదని ఒకప్పుడు కామరాజ్ వాపోయారు. కాని దక్షిణాదినేతయినా పివి నరసింహారావు చక్కటి హిందీలో ప్రసంగించేవారు. హిందీ రాకపోయినప్పటికీ ప్రధాని దేవెగౌడ కన్నడంలో హిందీ పదాలు రాసుకుని మాట్లాడేవారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వచ్ఛమైన హిందీలో తప్ప మరో భాషలో మాట్లాడలేకపోవడం పట్ల ఇబ్బందిపడినప్పటికీ ఎంపీలకు ఆయన భాష అలవాటైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఇంగ్లీషులో మాట్లాడే అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ బీజేపీలో అలాంటి అధికార ప్రతినిధులు పెద్దగా లేకపోయినా దక్షిణాది విలేఖరులు సర్దుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీని వ్యతిరేకించడం, 1968లో అన్నాదురై ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్విభాషా విధానానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటానని చెప్పడం, కేవలం తమిళ, ఇంగ్లీషు భాషలు తప్ప హిందీ అక్కర్లేదని ప్రకటించడం వల్ల రాజకీయంగా ఎంత మేరకు ప్రయోజనం సాధించగలరా అన్న చర్చ జరుగుతోంది.


తమిళనాడులో అన్నాడిఎంకె కూడా స్టాలిన్‌ను సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని ఇది కేవలం భాష పట్ల వ్యతిరేకత కాదని, బీజేపీ భావజాలం విస్తరణ పట్ల వ్యతిరేకత అన్న విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. అందుకే భాషతో పాటు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను కూడా కొన్ని దక్షిణాది పార్టీలు లేవనెత్తుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోందని, నిధులు, పన్నుల పంపిణీలోనూ, ప్రాజెక్టుల కేటాయింపులోనూ దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఈ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందించారని తమిళనాడు, తెలంగాణ, కేరళతో పాటు పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌కు నిధులు లభించిన విషయాన్ని వారు ఎత్తిచూపుతున్నారు.


ఈ నేపథ్యంలో బీజేపీ రాజకీయంగా విస్తరించాలంటే కేవలం కుంభమేళా, రామమందిరం వంటి భావోద్వేగాలు సరిపోవు. హోలీ నాడు ముస్లింలు ఇళ్లకే పరిమితం కావాలని బిహార్‌లో ఒక బీజేపీ ఎమ్మెల్యే పిలుపిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం ఎమ్మెల్యేలనందర్నీ బయటకు గెంటేస్తామని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. అస్సాంలో పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉన్నా ముఖ్యమంత్రి హేమంత బిశ్వాస్ శర్మ మదర్సాల మూసివేత వంటి ముస్లిం వ్యతిరేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారంలో ఉంటున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించి గోల్వాల్కర్ ఆశించిన లక్ష్యం నెరవేరాలంటే ఇలాంటి ప్రచారాలు సరిపోవు. నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపు విషయంలో రేగుతున్న ఆందోళనలకు కూడా జవాబివ్వాల్సి ఉంటుంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి:

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Updated Date - Mar 19 , 2025 | 01:07 AM