నాటి నల్ల చట్టాల బదులు నేటి మార్కెటింగ్ చట్టం!
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:53 AM
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జూన్ 25, 2024న వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ వ్యవసాయ మార్కెట్ పాలసీ ముసాయిదాను రూపొందించడానికి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి...

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జూన్ 25, 2024న వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ వ్యవసాయ మార్కెట్ పాలసీ ముసాయిదాను రూపొందించడానికి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా కేంద్ర వ్యవసాయ అదనపు కార్యదర్శి పైజ్ అహ్మద్ కిద్వాయిని నియమించింది. మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ ముసాయిదా మార్కెటింగ్ ఫ్రేమ్ వర్క్‌ను ప్రతిపాదించినట్లు నవంబర్ 25, 2024న మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రజల అభిప్రాయాలు, సూచనల కోసం మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాను బహిరంగంగా విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులపై సార్వత్రిక పన్ను రైతులకు అధిక ఆదాయాన్ని పొందటానికి తోడ్పడుతుందని కమిటీ చెప్తుంది. ప్రస్తుత ప్రభుత్వ మార్కెట్ యార్డ్ స్థానంలో వ్యవసాయ మార్కెటింగ్ మెకానిజం కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను కమిటీ సూచించింది. పెద్ద మొత్తంలో నిల్వ చేయడం, పెద్ద ప్రైవేట్ పార్టీల ద్వారా నేరుగా కొనుగోలు చేయడంపై చట్టాలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నేరుగా పన్నులు వసూలు చేసేందుకు జీఎస్టీ కమిటీ తరహాలో రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ప్రతిపాదనలు ప్రస్తుతం ఉన్న పబ్లిక్ మార్కెట్ యార్డులను రద్దు చేసే ప్రయత్నంగా కనపడుతున్నది. చారిత్రాత్మకమైన ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతుల ఆందోళన ఫలితంగా మూడు సంవత్సరాల క్రితం మూడు వ్యవసాయ నల్లచట్టాలు రద్దు చేయబడ్డాయి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని తీసుకురావడం అంటే రద్దు చేసిన మూడు నల్ల చట్టాలను తిరిగి దొడ్డిదారిన తీసుకువచ్చే ప్రయత్నంగానే చూడాలి. 2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసిన 12 మార్కెట్ సంస్కరణల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ చట్టాన్ని రూపొందించింది. ఆ 12 సంస్కరణల ప్రకారం: ప్రైవేట్ హోల్‌సేల్ మార్కెట్ ఏర్పాటుకు అనుమతి లభిస్తుంది. టోకు వ్యాపారులు, వ్యవసాయ ఆహార శుద్ధి పరిశ్రమ ఎగుమతికారులు, సూపర్ మార్కెట్లు, బడా కార్పొరేషన్లు, రైతుల పొలం వద్దనే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆస్కారం కలుగుతుంది. మార్కెట్ యార్డుల స్థానంలో శీతల గిడ్డంగులకు అనుమతి లభించింది. ఈ చట్టం ప్రకారం వ్యవసాయోత్పత్తుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ ప్యానల్ మాదిరిగానే రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో కూడిన అధికార వ్యవసాయ మార్కెటింగ్ పునర్వ్యవస్థీకరణ కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే పెద్ద సంఖ్యలో రైతులకు తోడ్పడుతున్న నిలవ గిడ్డంగులు/ కోల్ స్టోరేజీలను మార్కెట్ యార్డుల నుండి ప్రైవేట్ కార్పొరేషన్లకు ఇవ్వటం, ఎలక్ట్రానిక్ మార్కెట్లను ఏకీకృతం చేయటం లాంటి ముఖ్య మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు రైతులకు లభించే మద్దతు ధరలను నిరాకరించటానికి, మార్కెట్ యార్డులను నాశనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి.
ఇవి రైతుల చుట్టూ ప్రైవేట్ వ్యాపారుల సిండికేట్ ధరల మాయాజాలాన్ని తెచ్చిపెడతాయి. ఐటిసి, ఆదానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులు మార్కెట్‌లో ఆధిపత్యం సంపాదించడానికి గేట్లు బార్లా తెరుస్తాయి. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజి యూనిట్లను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరల నియంత్రణ వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధానం ఫలితంగా రైతుల దగ్గర తక్కువ ధరకు కొని మార్కెట్‌లో ఎక్కువ ధరలకు అమ్ముకుని పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించటానికి ఈ చట్టం వారికి ఆయుధంగా ఉపయోగపడుతుంది. బల్క్ కొనుగోళ్ళ వల్ల నిత్యావసర వస్తువుల చట్టంతో సంబంధం లేకుండా బడా కార్పొరేట్ వర్గాలు ఉత్పత్తులను నిలవ చేసుకోగలుగుతాయి. ఇప్పటికే రిలయన్స్, అదాని వంటి కార్పొరేట్ దిగ్గజాలు భారీ గిడ్డంగులను, ప్రైవేట్ రైలు మార్గాలను కూడా నిర్మించుకున్నారు. ఈ చట్టంలోని నిబంధనలు సూపర్ మార్కెట్లు, బిగ్ బాస్కెట్ లేదా అమెజాన్ వంటి బడా కార్పొరేట్ వ్యాపారులు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తాయి. ఈ విధానం రైతులకు పంట ఉత్పత్తులపై ఎంఎస్‌పిలను ఎగవేయటానికి, ఆచరణలో రైతులు దివాలా తీయటానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ మద్దతు ఉన్న మార్కెట్ యార్డుల పాత్ర తగ్గిపోవడంతో ఇతర డిజిటల్ ఎలక్ట్రానిక్ మార్కెట్ల ద్వారా జీఎస్టీ పన్ను సేకరణ మాదిరిగానే సెంట్రల్ పూల్‌కు నేరుగా పన్నులను వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు కలుగుతుంది. జీఎస్టీని ప్రవేశపెట్టడంతో రాష్ట్రాలు అధిక ఆదాయ వనరులను ఎలా కోల్పోయాయో, ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడేటట్లు ఎలా చేశాయో, ఈ వ్యవసాయ మార్కెట్ చట్టం కూడా అంతకు పదింతలు ఆధారపడేటట్టు చేస్తుంది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా బలహీనపరిచి, సమాఖ్య వ్యవస్థ స్పష్టమైన ఉల్లంఘనకు దారితీస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీలను రద్దుచేసి, ఈ చర్యతో వాటిని కేంద్రం తమ చేతుల్లోకి తీసుకొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నది. ఈ చట్టం గతంలో తెచ్చిన మూడు నల్లచట్టాల కన్నా దారుణమైనది. ఆనాడు మోదీ ప్రభుత్వం రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలలో మద్దతు ధర, రుణమాఫీ, విద్యుత్ బిల్లు ఉపసంహరణ ఉన్నాయి. మూడు సంవత్సరాలు దాటినా అవి అమలుకు నోచుకోకపోగా ఇప్పుడు మళ్లీ గోరుచుట్టుపై రోకలి పోటులా నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది. రైతుల పాలిట శాపంగా మారబోతున్న నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టం ఉపసంహరణ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపును అందుకుని రైతు సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. వ్యవసాయరంగాన్ని బడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పెట్టే ప్రమాదకరమైన నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించుకునేంత వరకు దేశవ్యాప్తంగా పోరాటాన్ని సాగించటానికి రైతు సంఘాల నాయకత్వాన రైతాంగం సమాయత్తం కావాలి!
ముప్పాళ్ళ భార్గవశ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు
ఇవి కూడా చదవండి:
BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..