జానపదుల రారాజు రామరాజు
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:49 AM
దక్షిణ భారతదేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలోను తొలుదొలుత శాస్త్రీయంగా, పండితులకు అంటరానిదైన జానపద సాహిత్యంపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది డా.బిరుదురాజు రామరాజు. ‘జానపద గేయసాహిత్యం’ అనే....

దక్షిణ భారతదేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలోను తొలుదొలుత శాస్త్రీయంగా, పండితులకు అంటరానిదైన జానపద సాహిత్యంపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది డా.బిరుదురాజు రామరాజు. ‘జానపద గేయసాహిత్యం’ అనే అంశంపై 1952లో రిజిస్టర్ చేసి పరిశోధన ప్రారంభించి రవాణా సౌకర్యాలు లేని, రికార్డు చేసుకునే వసతులు లేని ఆ గడ్డు కాలంలో, క్షేత్రస్థాయిలో కాలికి బలపం కట్టుకొని తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలు తిరిగారు. గ్రామీణుల చేత వేలాది పాటలు పాడించుకొని వాటిని శ్రద్ధగా రాసుకొని, తెలంగాణేతర తెలుగు ప్రాంతాలలో, ఆనాటి మద్రాసు ప్రాంతంలోని గ్రంథాలయాలలో విషయ సేకరణ చేసి, తాను రాసే సిద్ధాంత వ్యాసానికి, తానే స్వయంగా ఒక పద్ధతి ఏర్పాటు చేసుకొని దాన్ని రచించారు. ఆ సిద్ధాంత వ్యాసానికి 1955లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ నుండి మొట్టమొదట పిహెచ్.డి పట్టాపొందిన మహా పరిశోధకుడు, పథనిర్దేశకుడు బిరుదురాజు రామరాజు. ఈవేళ విశ్వవిద్యాలయాలన్నింటిలోను జానపద సాహిత్యానికి సముచితస్థానం లభించి వందలాదిమంది జానపద రంగంలోని పలు అంశాలు తీసుకొని పిహెచ్.డి సిద్ధాంత వ్యాసాలు రాసారంటే చాలావరకు అవి రామరాజు సిద్ధాంత వ్యాసాన్ని మూలంగా తీసుకొని రాసినవే.
డా. రామరాజు కేవలం జానపద సాహిత్యరంగానికే పరిమితమైన పండితుడు కాడు, ప్రాచీన తెలుగు సాహిత్యమంతా వారికి కరతలామలకం. తాను సేకరించిన వందలాది ప్రాచీన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలలో 15 గ్రంథాలను పరిష్కరించి వారు వెలుగులోకి తెచ్చారు. శ్రీనాథ మహాకవి అసమగ్ర కావ్యం ‘శివరాత్రి మహత్త్యం’ను పూర్తిగా సేకరించి సంపూర్ణ గ్రంథాన్ని వెలువరించారు. డా. రామరాజు తెలుగు భాషలో ఎంత గొప్ప పరిశోధకుడో, పండితుడో సంస్కృత భాషలోనూ అదేస్థాయిలో పరిశోధన చేసారు, గ్రంథాలు ప్రచురించారు. ఇంగ్లీషు భాషలోను సమాన ప్రతిభగల డా. రామరాజు జాతీయ, అంతర్జాతీయ పరిశోధకుల కోసం, పాఠకుల నిమిత్తం ఇంగ్లీషులోను పలురచనలు చేసి పలు అంతర్జాతీయ విజ్ఞాన సర్వస్వాలకు తన రచనలు అందించి ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పత్రాలు సమర్పించి – జానపద సాహిత్యాన్ని జగమంతా మెచ్చేలా సహజంగా, సశాస్త్రీయంగా ప్రచారం చేసారు.
డా. బి. రామరాజు అనగానే జానపద సాహిత్యం, ప్రాచీన సంస్కృతాంధ్ర సాహిత్యాలు, గ్రంథపరిష్కరణలు, తాళపత్ర గ్రంథాలు, తెలుగునేలలో ‘మరుగుపడిన మాణిక్యాలు’, ‘చరిత్ర కెక్కని చరితార్థులు’, ‘సాహిత్యోద్ధారకులు’, ‘సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ’ ఇత్యాది అంశాలలో – విశేషమైన, విశిష్టమైన సేవ చేసిన ఒక మహాపరిశోధకుడు కళ్ళముందు కనబడతాడు. ఇంతటి మహామహోపాధ్యాయుడి, జాతీయ ఆచార్యుడి శతజయంతి నేడు. ఈ మహానుభావుడు పదిహేనేళ్ళ క్రితం వరకు మనమధ్యలోనే ఉండి, ‘ఆంధ్రయోగులు’పై ఇంతవరకు జరగని పరిశోధనలు చేసి, 317మంది యోగుల విశేష జీవిత వివరాలు సేకరించి, ఏడు గొలుసు గ్రంథాలు వెలువరించిన పట్టువిడువని పండిత శ్రేష్ఠుడు. 2011 ఫిబ్రవరి 8న తన 85వ ఏట కన్నుమూసే దాకా నిరంతరం కృషిచేసారు.
కొందరేమో శిష్యవర్గం ప్రచారంతో, మరికొందరేమో అభిమానుల ఆదరంతో, ఇంకా కొందరేమో అధికార ప్రాభవంతో గొప్పవారు అవుతున్న రోజులలో కేవలం తన పరిశోధనల వలన, వాటి ఫలితమైన రచనల వల్లనే గుర్తింపు పొందారు ఆయన. తెలుగు ప్రొఫెసర్‌గా పదవీవిరమణ చేసిన పుష్కర కాలానికి గాని, డా. రామరాజు లాగా జాతీయ ఆచార్యుడిగా అవకాశం రాదు. తనకు గాడ్‌ఫాదర్ లేడు కాబట్టే, కేవలం గాడ్ మీదనే ఆధారపడినందున అంత ఆలస్యం జరిగిందేమో అనేవారు రామరాజు మాస్టారు.
రామరాజు తొలినాళ్ళలో చక్కని కవి. వీరిలోని పరిశోధన పాటవాన్ని గమనించిన సుప్రసిద్ధ సంపాదకులు ప్రతాపరెడ్డి సలహా మేరకు కవిత్వం రాయడం మానివేసి జీవితం సమస్తం పరిశోధనా రంగానికే అంకితం చేసిన నిత్యకృషీవలుడు. యం.ఏ.లో ఉన్నప్పుడు, అప్పుడు బి.ఏ. చదువుతున్న సి.నారాయణరెడ్డితో కలిసి ‘రామనారాయణకవులు’గా రామరాజు జంటకవిత్వం రాసారు. సినారె స్థాయిలో కవిత్వం చెప్పగలిగిన రామరాజు కవిత్వం జోలికి పోకుండా తన జీవితాన్ని పరిశోధనకు, విమర్శకు అంకితం చేయడం వెనుక ఎంత పట్టుదల, పరిశ్రమ ఉందో వేరుగా చెప్పనవసరంలేదు.
రామరాజు దాదాపు మూడున్నర దశాబ్దాల కాలం విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడుగా సేవలందించి ఎంతోమందిని ఉత్తమ ఆచార్యులుగా తీర్చిదిద్దారు. పేర్వారం జగన్నాథం, రవ్వా శ్రీహరి లాంటి వీరి శిష్యులు వైస్ ఛాన్సలర్లు అయ్యారు. ఆచార్య రామకోటి శాస్త్రి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య యం. వీరభద్రశాస్త్రి, వై. రఘుమన్న లాంటి ఎందరో వారి శిష్యులు, ప్రశిష్యులు వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగుశాఖలో కీలకస్థానాల్లో ఉన్నా ఎందుచేతనోగానీ ఒకే ఒక్క విదుషీమణి శ్రీమతి కంచి విజయలక్ష్మి మాత్రమే ‘డా.రామరాజు జీవితం – రచనలు’ అంశంపై రెండున్నర దశాబ్దాల క్రితం పరిశోధన చేసారు.
ఊరూ పేరూ తెలియని ఎందరో అనామకులపై పరిశోధనలు చేయించే విశ్వవిద్యాలయ ఆచార్యులకు డా. రామరాజు పరిశీలించి, పరిష్కరించి వెలుగులోకి తెచ్చిన సంస్కృతాంధ్ర గ్రంథాలయాలపై వేరుగా పరిశోధనలు చేయించవచ్చునని, తాళపత్ర గ్రంథాలను ప్రపంచానికి తెలియజేసిన వారి వ్యాసావళిపైనే ప్రత్యేక పరిశోధన చేయించవచ్చని తెలియకపోదు. సంస్కృత భాషాసాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవల గురించి, ఇంకా వీరు ఇంగ్లీషులో రచించిన పలు పరిశోధన వ్యాసాలపైన పరిశోధన చేయించవచ్చు. అంత దాకా ఎందుకు ‘ఆంధ్రయోగులు’ గొలుసు గ్రంథాలపై పరిశోధన చేయించవచ్చు. జరిగిన ఆలస్యం ఏలాగు జరిగిపోయింది. బిరుదురాజు రామరాజు శతజయంతి జరుగుతున్న ఈ సందర్భంలోనైన ఈ అంశాలలో కొన్నింటిపైనైనా పరిశోధనకు తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు శ్రీకారం చుడితే సంతోషం.
టి. ఉడయవర్లు
(నేడు బిరుదురాజు రామరాజు శతజయంతి. కేంద్ర సాహిత్య అకాడమీ– శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో శతజయంతి సభ)
ఈ వార్తలు కూడా చదవండి:
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..
MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..