అదనపు కణజాలం
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:28 AM
ఆయుధం కావలసిన అక్షరం ఆముదం రాసుకొని తిరుగుతుంది పట్టుకుంటే జారిపోతుంది ముట్టుకుంటే కారిపోతుంది ఆకుకు అందకుండా ...

ఆయుధం కావలసిన అక్షరం
ఆముదం రాసుకొని తిరుగుతుంది
పట్టుకుంటే జారిపోతుంది
ముట్టుకుంటే కారిపోతుంది
ఆకుకు అందకుండా
పోకకు పొందకుండా
కాన్పు నొప్పులు తీస్తుంది
కదిలించినా... కదిలించకున్నా...
సాలు ఇరువాలు దున్నుతుంది
పరీవ్యాప్తమైన ప్రపంచాన్ని
కన్నెత్తి చూడక
ఇసుకలో మూతి కుచ్చిన
ఉష్ట్ర పక్షి అయింది
ఇవతలి గట్టు నుండి
అవతలి గట్టుకు
అవతలి గట్టు నుండి
ఇవతలి గట్టుకు ఇరాం లేకుండా
ఆసుపోస్తుంది
కాంతి పాదాలు
కదన నాదాలు కావలసిన చోట
కాసుల పేరు కోసమో!
కీర్తి కిరీటం కోసమో!
కంటికి కునుకును కరువు చేసిన
అదనపు కణజాలమై పెరుగుతుంది.
n కందుకూరి అంజయ్య
& 94902 22201