Journey Through Wounds: ఒక గాయం రంగులేసుకునే కల
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:35 AM
గాయం, ప్రేమ, నిస్సహాయత, ఒంటరితనం వంటి అనుభూతులను అన్వేషిస్తూ, చీకటిలో హాయిని వెతికే కవిత్వమిది. పాయల మురళీకృష్ణ రచించిన ఈ పద్యం ఆత్మవిమర్శ, ఓదార్పు, సున్నితమైన భావోద్వేగాల గాఢతతో అలరిస్తుంది

వ్యక్తిగతం కావచ్చు, సమాజగతం కావచ్చు, నైరాశ్యం నుండి ఆశవైపు తీసుకెళ్ళడమే ఏ కవితకైనా తొలి విజయం. ప్రేమలో ఒకటవడం, కారణాలేవైనా విడిపోతూ గాయపడటం వీటిని డీల్ చేసిన కవితను చదివి ప్రియమైనదిగా అనుకున్నామంటే ఆ కవిత నిర్మాణంలో కొత్తదనం మనల్ని వెంటాడుండవచ్చు. ఎత్తుగడలోనే– గాయాల మీద నడవడం ఇప్పుడు జీవితానికి పెద్ద పరీక్ష అంటాడు కవి. ఆ సమయంలో ఎదురయ్యే హాయిగొలిపే గాలికి ప్రతిగా ఆనందం వ్యక్తం చేయలేని స్థితిని గుర్తుచేస్తూనే, ఇది పరామర్శలనో సానుభూతులనో వెతికి పెట్టే గీతం కాదు... కన్నీళ్ళకు మలుపులే తప్ప మజీలీలు ఉండవు అంటూ కొత్త ఆలోచనల పేటిక తెరుస్తాడు. ఏ విషయం పదేపదే కల్లోల పరుస్తుందో ఎంతకీ బోధపడక ఏ నిర్ధారణకూ రాలేని స్థితిలో ఉన్న మనిషిని బహుసున్నితమైనది కూడా బాధపెడుతుంది. ఎవరినైనా ప్రేమించడం, తనలోకి ఆహ్వానించడం, హృదయానికున్న జబ్బుగా ప్రకటించి, ప్రేమ పొందిన వాళ్లే చివరికి గాయపరిచినపుడు భరించలేనివారిగా తయారయ్యాక, గుండెని ఓదార్చేవాళ్ళెవరూ ఉండని నిస్సహాయతను చెబుతూ వెంటనే ఆ హృదయం చీకట్లో కిచకిచమని వెర్రి పాట పాడుకుంటుందంటాడు. గాయపడినవాడిగా నీకు నీవే తోడు అంటూ తనకు తానే దిశానిర్దేశం చేసుకుంటాడు. చిట్టిపిల్లలాంటి తన హృదయాన్ని తానే ముద్దులాడుకోవాలంటాడు. చీకట్లో ప్రయాణం చేసే కళ్ళు తప్పనిసరిగా హాయిని ప్రసాదిస్తాయన్న నిర్ధారణకొస్తాడు. గుండెల్ని తవ్వుకున్న గాయాల దేహంలోనే అలసట దాహం తీర్చే నదులున్నాయని గుర్తుచేసుకుంటాడు. కన్నీళ్ళను కూడా తీయగా అనుభవించడమనేది రాబోయే జీవితాన్ని అందంగా మలచుకోగలిగే ఆలోచన. చివరిగా రాత్రి పూసే నక్షత్రాలను చూస్తూ గడపడం ఊరటగా వాటిని తెంపు కుంటే అవి ఉదయానికి పరిమళించే పూవులవుతాయనడమే గొప్ప ఊహ. దానికి కొనసాగింపుగా పువ్వులు మనుషుల్లా గాయపరచవు, సువాసన కొడతాయి అంటూ ముగిస్తాడు. ఈ కవితలో గాయం దుఃఖాన్ని ప్రేరేపిస్తుందన్న సామాన్య భావనను దాటి చూడగల అనుభూతిని అందుకోగలిగితే ఇది నాకే కాదు అందరికీ ప్రియ పద్యమే అవుతుంది.
ఇది కొంత రాసుకునే పూట ఏవేవో రంగులేసుకునే కల
గాయాల మీద నడుస్తూ పోతే ఏ ఊరొస్తుంది. తీపిసలిపే గాలికి ఏం చెప్పాలి. ఇదేమీ వెతుకులాటల గీతం కాదు. పరామర్శల పాచికలాడేందుకు తెగిన హృదయాలకు చేతులుండవు. కన్నీళ్లకు మలుపులే కానీ మజిలీల ఊసుండదు.
ఏ గాలిపొర సర్రున కోసిపోతుందో అర్థం కాదు. తల తెగిపడేవరకూ కత్తి పట్టుకుందెవరో బోధపడదు. ముద్దుచేసి తలుపులు తీయడమే హృదయాలకున్న జబ్బు. గుండెల్లో కూర్చోపెట్టుకున్న తర్వాత మనుషులు బరువు పెరుగుతారు.
లోపలి సావాసగాడా విను... హృదయాలు మనుషుల్లో ఎగిరే చిట్టిపిల్లలు. వాటికేడుపొస్తే అమ్మలుండరు. చీకటిగట్టు మీద కిచకిచమంటమే తెల్సు. అదో వెర్రి పాట. కన్నీళ్ల ఊట.
గాయాల వాడా... నీ లోపలకి దర్జాగా నడువు. హృదయానికో ముద్దుపెట్టు. చీకటిముసురు మీద పాకుతున్న కళ్ళల్లోనే హాయిని పాడే పావురాలుంటాయి. గుండెల్ని తవ్వి దారిచ్చిన వాళ్ల దేహాల్లోనే దాహాలని తీర్చే నదులుంటాయి. కన్నీళ్లకూ నవ్వు తెప్పించే మార్మికతల యేరులుంటాయి.
పిచ్చివాడా... వెళ్తూవెళ్తూ నాలుగు నక్షత్రాలు తెంపుకుపో. తెల్లారికి మల్లెపూలవతాయి. దిగులు పడకు. పూలు మనుషులు కాదు. పొద్దుటకు సువాసన కొడతాయి.
-పాయల మురళీకృష్ణ సిద్దార్ధ కట్టా
83094 68318