జీవనానందమైన కవిత్వం
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:35 AM
కవిత్వమే ఒక జ్వరమై నిలువెల్లా కుదిపేసిన రోజులు, మళ్ళీ ఆ కవిత్వమే మందై ఊరడించిన రోజులు కవిత్వ ప్రేమికు లందరి జీవితాల్లోనూ ఉంటాయి. అట్లాంటి అనుభవాలే ఇంకా ఇంకా ఆకలిగా కొత్త...

కవిత్వమే ఒక జ్వరమై నిలువెల్లా కుదిపేసిన రోజులు, మళ్ళీ ఆ కవిత్వమే మందై ఊరడించిన రోజులు కవిత్వ ప్రేమికు లందరి జీవితాల్లోనూ ఉంటాయి. అట్లాంటి అనుభవాలే ఇంకా ఇంకా ఆకలిగా కొత్త కవిత్వాలను వెదుక్కునేలా చేస్తాయి. రాసేలా చేస్తాయి. ‘‘నీకై బ్రదుకే ఒక తపమై వెదుకాడా’’నంటాడు శ్రీశ్రీ అట్లాంటి పలవరింత లోనే. కానీ ఏమిటా కవిత్వం, ఎప్పటిది? పసివయసు సంభ్రమపు కళ్ళను కట్టి కూర్చోబెట్టిన అక్షరాలెవరివి? యవ్వనోద్రేకాల హృద యాన్ని ప్రేమ మంత్రాలై శాంతింపజేసిన పాదాలెవరివి? అక్షరాల పొత్తిళ్ళలోనే జీవితం మళ్ళీ దొరకనుందని నమ్మకం కలిగించిన క్షణాలను, తీర్పరితనాలు ఎరుగని తోడై అక్షర మొక్కటే సేదతీర్చిన క్షణాలను కానుకిచ్చిన కవులు ఎవరు? ‘మాటలనియెడి మంత్ర మహిమ’ తెలియకుండానే ఉద్వేగా లను కాగితం పైకి నెట్టుకుని కవిత్వంగా మలచుకున్న సందర్భాల సౌందర్యం ఎట్లాంటిది?
ఒక్కొక్క పుటా తిరగేస్తుంటే కాలాలు మెలిపడిపోయి, ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క జ్ఞాపకం తగిలి పాఠకులను మంత్రముగ్ధుల్ని చేసే పుస్తకం ఎన్. వేణుగోపాల్ గారి ‘కవిత్వంతో ములాఖాత్’. రాజకీయార్థ విశ్లేషకుడిగా పిలిపిం చుకోవడం తనకిష్టమని చెప్పుకునే వేణుని ఈ పుస్తకం కవి గానూ, కవిత్వ ప్రియుడిగానూ సరికొత్తగా పరిచయం చేస్తుంది. ఊహ తెలిసిన నాడే చెవిన పడ్డ భక్తి కవిత్వాలు మొదలు విద్యార్థి దశలో ప్రభావితం చేసిన రాజకీయ కవిత్వం దాకా; ప్రాచీన కవిత్వం నుండి పాశ్చాత్య దేశాల కవిత్వం దాకా; ప్రభావాల నుండి పశ్చాత్తాపాల దాకా; రాయకుండా ఉండలేకపోయిన క్షణాల నుండి రాయని కవితల దాకా; కోపాల నుండి కన్నీళ్ళ దాకా... ఈ పుస్తకం ఒక ఉద్వేగాల పుట్ట.
ఒక గొప్ప కవిత తన మనసులో ఎలా అంకురించిందో కవి చెప్పలేకపోవచ్చునేమో కానీ, తనకు రససిద్ధి కలిగించిన కవితను తొలిసారి చదివిన క్షణాలను పాఠకుడు అంత త్వరగా మర్చిపోడు. ఆ ఉద్వేగభరితమైన క్షణాలను ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఆ కవిత లోని బలమేమిటో స్పష్టమవడం ఒక్కటే కాకుండా, ఆ కాసిన్ని అక్షరాలతో ఒక మనిషి మరొక మనిషి మీద నెరపిన ప్రభావం కూడా అర్థమై, రాత అన్న ప్రక్రియ మీద గౌరవమూ ప్రేమా పెరుగుతాయి. ఈ సంపుటిలో వేణు ప్రస్తావించిన కవితలన్నిటి వెనుకా బలమైన జీవన నేపథ్యముంది. ఆయా కవితల నుండి విడదీసి చూడలేని సామాజిక రాజకీయ లేదా వ్యక్తిగత సందర్భముంది. రహస్యంగా తన జీవితం మొత్తాన్నీ పెనవేసుకున్న కవిత్వోద్వేగాన్ని ఒక మనిషి పున శ్చరణ చేసుకోవడముంది. ఎన్ని సందర్భాలు వేణుకి కవిత్వమూ జీవితమూ వేరు కాదని చెప్పాయో, అంతకన్నీ నిరూపించాయి కూడా.
పుస్తకంలో పంజాబీ కవి అవతార్ సింగ్ పాష్ గురించి రాసిన వ్యాసంలో– న్యూయార్క్ వీధుల్లో, ఒక టాక్సీలో డ్రైవర్‌తో మొదలైన మామూలు సంభాషణ కవిత్వంలోకెలా మళ్ళిందో, వాళ్ళు ఇద్దరూ కలిసి తమకు ఇష్టమైన కవిని ఎలా స్మరించుకున్నారో, ఎంత ఉద్వేగానికి లోనయ్యారో, ఒళ్ళు గగుర్పొడిచే కథనంతో రాసుకొస్తారు వేణు. ‘‘సబ్ సే కతర్నాక్ హోతా హై హమారే సప్నోన్ కా మర్నా’’ (మన కలలు చనిపోవడం అన్నిటి కన్నా ప్రమాదకరం) అని ఒక కవి రాసిన గీతాన్ని ఇట్లా అపరిచితులు గొంతు కలుపుకుంటూ పరాయి దేశంలో పాడుకోవడం కవికీ కవిత్వానికీ ఎట్లాంటి గౌరవం!
కైఫీ ఆజ్మీ కవిత్వం గురించి రాసిన వ్యాసం కూడా అట్లాంటిదే. కవిత్వమొక్కటే కాదు, దాని చుట్టూ ఉన్న జీవితం కూడా ఈ వ్యాసాల్లో కుదురుకున్నందుకేమో, ఈ పుస్తకం మామూలు కవిత్వ పుస్తకాల్లా అంతా ఒకేసారి చదవలేమనే ఇబ్బంది కలిగించదు. విప్లవం కూడా సరిగ్గా ప్రేమలానే ఒక కవితాత్మక భావన అన్న వాక్యానికి ఈ పుస్తకంలో దొరికిన వివరణ, తొలియవ్వన కాలాల్లోని విలువలను, ఆదర్శాలనూ మళ్ళీ కళ్ళ ముందుకు తెచ్చి హృదయాన్ని బరువెక్కిస్తుంది. అట్లానే వ్యాసాల్లో ఎక్కడికక్కడ కూర్చిన కవితల ఎంపిక, ఆ కవితల్లోని అందం రీడబిలిటీకి అదనపు బలం. కైఫీదే ‘ముద్దు’ అన్న కవిత:
‘‘ఈ సౌందర్యభరితమైన కళ్ళను ముద్దాడినప్పుడల్లా
కటికచీకటిలో వందల దీపకళికలు వెలుగుతాయి
పూలూ, మొగ్గలూ, జాబిల్లీ, నక్షత్రాలూ మాత్రమే కాదు
ప్రత్యర్థి కూడా ఆమె పాదాల ముందు మోకరిల్లుతాడు.’’
ఒక నచ్చిన కవిత కోసం వెదుక్కోవడం, ప్రత్యేకించి అది వేరే దేశానిదైతే ఈ వెబ్ సెర్చ్ కాలాలకు ముందు ఆ వెదుకులాటలో ఉన్న తపన, ఆ వెదికింది దొరికితే అందే మహదానందం, నెరుడా మీద రాసిన వ్యాసంలో కనపడుతుంది. నెరుడా ‘పోస్ట్‌మాన్’ కథ కూడా వేణు అనువాదం చేశారు. అది నవలికే కానీ ఆ చిన్నపుస్తకం నిండా పరుచుకున్న కవిత్వ సౌందర్యానికి, శక్తికీ ఇది కూడా ఈ సంపుటిలో చేర్చవలసిన విషయమే.
గంభీరంగా చెప్పాలన్న ఆకాంక్ష వల్లో ఏమో తెలుగు సాహిత్యంలో కవిత్వ విమర్శ, పరామర్శ కూడా చాలాసార్లు రసహీనంగా ఉంటాయి. రచనకు ఎడంగా నిలబడి పరామ ర్శించడం లోని నిష్పాక్షికత కన్నా, రచనతో మమేకమై పొందే అను భవాన్ని పంచుకునే నిజాయితీ ఏ రకంగానూ తక్కువ కాదని ఈ పుస్తకం చదివితే నాకు అనిపించింది. అనువాదాలేమిటీ, వార్షిక కవిత్వ సంకలనాలేమిటీ, ‘పోయమ్స్ దట్ మేక్ గ్రోన్ మెన్ క్రై’ లాంటి పుస్తకాల హృదయమేమిటీ – ఈ ‘కవిత్వంతో ములాఖాత్’ ఎన్నెన్ని విశేషాలను సహృదయస్పందన అన్న దారానికి కట్టిచూపిందో లెక్కే లేదు. ‘సృజన’ పత్రిక, బెజవాడ రోజులు ఒక తరం సాహిత్య చరిత్రను చెప్పినట్టే ఉన్నాయి. ఒక మాట నుండి ఇంకో మాటకి, ఒక కవిత నుండి ఇంకో కవితకి, ఇంకో పుస్తకానికి, అలవోకగా పాఠకుడిని లాక్కెళ్ళింది ఈ పుస్తకం. ఊరికే తీసుకువెళ్ళడమే కాదు, పాఠకుడు తాను స్వయంగా ఇవన్నీ వెదుక్కుని చదివేందుకు సమాయత్తపరచింది.
ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాలి, నచ్చిన కవితలను ఎందుకు మననం చేసుకోవాలి? ప్రభావాలను గమనించుకోవడం, వాటిని వేణూలా హృదయం పరిచి పంచుకోవడం సృజనాత్మకతను తట్టి లేపడానికి అతి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. రాసుకో వడానికి జీవితం ప్రసాదించే వేల సందర్భాలను ఉదహ రిస్తూ, ‘‘రాయాలి’’ అన్న ఊహనివ్వడం, ‘‘రాయగలను’’ అన్న నమ్మకాన్నివ్వడం మామూలు విషయాలు కావు. కవితలను జ్ఞాపకాల దీపకాంతిలో ఎత్తి చూపిస్తూ, ఏ వ్యక్తీకరణల్లో ఏ కొత్తదనం గల్లంతు చేసిందో గమనించుకోవడం రాసేవాళ్ళకు మరీ ఉపయోగకరం. ఆ రకంగా, ఈ పుస్తకం ఒక అధ్యయన గ్రంథం. కవిత్వం రాయడానికి పాఠాలు, ప్రత్యేకంగా క్లాసులు ఉండవు. ఉన్నా అవేం పని చేస్తాయన్న ఆశ నాకైతే లేదు. కవిత్వంతో ఈ తరహాలో మమేకమవ్వడం ఒక్కటే దానికి మార్గం.
తెలుగులో ప్రస్తుతం, స్నేహితులైనందుకు తప్పక వెల్లడయ్యే పొగడ్తలున్నాయి. భావజాలానికి భిన్నంగా ఉన్నందుకు వచ్చిపడే విమర్శలున్నాయి. కానీ, సాహిత్య సందర్భాన్ని పంచుకుంటూ సాహిత్యం మీద ప్రేమ పెంచే పుస్తకాలు ఇప్పటి అసలు సిసలు అవసరం. కవిత్వం అర్థం కాని పదార్థమై జనాలకు ఎడమై పోకుండా ఉండాలంటే, కవిత్వంతో ముడిపడ్డ జీవితం మొత్తాన్నీ అక్షరబద్ధం చేసి ఉత్సవం చేసుకున్న ఇలాంటి పుస్తకాలు రావాలి. దేశాలకూ భాషలకూ అతీతంగా మనుషులను ఏకం చేసే కళను, పొంగిపోయే హృదయంతో ఇట్లా స్మరించుకోవడం తెలియాలి. సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అన్న మాటలను నోరు విప్పి నిజం చేయడం కావాలి. మన మన ఏకాంత మందిరాల్లో, నవ్వుల్లో, నిస్సత్తువగా సోలిపోయిన నీరసపు క్షణాల్లో, నిరసనల్లో, స్నేహాల్లో, ప్రేమల్లో – అమాంతం వచ్చి హత్తుకునే కవిత్వ పాదాలకు మొక్కి ఇట్లా, గుండెల మీదే ఉండనివ్వాలి.
మానస చామర్తి
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..