Share News

ఆదివాసీల ఆత్మబంధువుకు ఓ నూలుపోగు

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:59 AM

ఏడు పదుల జీవితం. 50 సంవత్సరాల రాజకీయ జీవితం. అయితేనేం ఉండేందుకు ఇల్లు లేని సగటు మనిషి ఆయన. తన- ప్రజలున్న ఇల్లెందే ఆయన ఇల్లు. ఐదుసార్లు అసెంబ్లీ సభ్యత్వం, అవినీతి మకిలీ అంటని అరుదైన వ్యక్తిత్వం..

ఆదివాసీల ఆత్మబంధువుకు ఓ నూలుపోగు

ఏడు పదుల జీవితం. 50 సంవత్సరాల రాజకీయ జీవితం. అయితేనేం ఉండేందుకు ఇల్లు లేని సగటు మనిషి ఆయన. తన- ప్రజలున్న ఇల్లెందే ఆయన ఇల్లు. ఐదుసార్లు అసెంబ్లీ సభ్యత్వం, అవినీతి మకిలీ అంటని అరుదైన వ్యక్తిత్వం... వెరసి ఆయన పేరు గుమ్మడి నరసయ్య.

70 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా ఇల్లెందు తాలూకా టేకులగూడెంలోని పేద ఆదివాసీ (కోయ) కుటుంబంలో చుక్కమ్మ–లక్ష్మయ్య దంపతులకు నరసయ్య జన్మించారు. ఐదవ తరగతిలోనే ఆయన చదువు ఆగిపోయింది. తర్వాత తల్లిదండ్రుల వెంట కొంతకాలం వ్యవసాయం చేసిన ఆయన 1973లో వామపక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆదివాసీల సమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పట్ల ప్రభావితులై, ఆ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. ఆదివాసీల హక్కులు, పంటలకు గిట్టుబాటు ధరలు, తునికాకు రేట్లు, కూలి రేట్లు, జీతగాండ్ల జీతాలు పెంపుదలకై పోరాడి, సాధించారు. అటవీ భూములను సాగు చేయడానికి ప్రజలందరినీ సమాయత్తం చేసి ముందుకు కదిలారు. రైతు సమస్యలపై పోరాటాలు చేశారు.

1981లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఉసిరికాయలపల్లి నుంచి గుమ్మడి నరసయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ తరపున ఇల్లెందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1985 ఆగస్టు సంక్షోభం తర్వాత, 1989లో జరిగిన ఎన్నికలలో గెలిచి, హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. సైకిల్ పైనే తిరుగుతూ ఆయన ప్రజలను ఓట్లు అడుగుతారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీ కాదు. కనుక ఆయన ప్రతిసారి స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల బరిలో దిగేవారు. అంటే ప్రతిసారి ఆయన ఎన్నికల గుర్తు మారుతూ ఉండేది. గుమ్మడి నరసయ్య ప్రజలకు అభ్యర్థిగా కంటే ఆదివాసీగా గుర్తుంటాడు. అందుకే ఆయన ప్రతిసారి గెలుస్తూనే ఉంటాడు.


ఖమ్మం జిల్లాలో ఇల్లెందు మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీలకు గట్టి పట్టున్న ప్రాంతం. సమస్యల పరిష్కారంతో ప్రజలకు చేరువై సీపీఐ, సీపీఎంల ఆధిపత్యానికి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ గండి కొట్టింది. దాని ఫలితమే గుమ్మడి నరసయ్య వరుస విజయాలు. 1994 అసెంబ్లీ ఎన్నికలలో కొద్దిపాటి తేడాతో సీపీఐ అభ్యర్థి ఊకే అబ్బయ్య చేతిలో ఓడిపోయిన నరసయ్య, తిరిగి 1999 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఆ తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డును సొంతం చేసుకున్నారు.

గడచిన 50 ఏళ్లలో తెలంగాణను ప్రభావితం చేసిన కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా గుమ్మడి నరసయ్య ఇల్లెందులో ఒక ఆదివాసీ నాయకుడుగా, ప్రజానాయకుడిగా, ప్రజల మనిషిగా నిలదొక్కుకున్నారు. అందుకు కారణం నీతి–నిజాయితీలతో అవినీతికి అందనంత దూరంలో ఆయన నడుచుకోవడమే. అయితే 2009 నుంచి ఆయనకు ఎన్నికల రాజకీయాల్లో ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఇందుకు వ్యాపార రాజకీయాల పార్టీల కుట్రలే కారణం అంటారాయన. వరుస గెలుపులతో సాగిపోతున్న గుమ్మడి నరసయ్యను నిలువరించడానికి బూర్జువా రాజకీయ పార్టీలు ఇల్లెందు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కుట్ర పన్నారంటారు. ఇల్లెందులోని సీపీఐ(ఎంఎల్) పార్టీకి పట్టున్న రెండు మండలాలను వైరా, పెనుబాక నియోజకవర్గాలకు మార్చి ఆ పార్టీని బలహీనపరిచారు. ఇందుకు బూర్జువా పార్టీలతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా చేతులు కలిపాయి. దీంతో గుమ్మడి నరసయ్య 2009, 2014, 2018 ఎన్నికలలో వరుసగా ఓటమిని చవిచూశారు. అయితే ఆయన ప్రజా జీవితానికి మాత్రం దూరం కాలేదు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఏడు పదుల వయసులో కూడా ఎదురునిలిచి పోరాటాలు చేస్తున్నారు.


సింగరేణి బొగ్గు గనుల భూ నిర్వాసితుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం, తెందు ఆకు సేకరించే వారికి మద్దతుగా ఆయన చేసిన కృషి ఎనలేనిది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన తనదైన పాత్ర పోషించారు. నిరంతరం ఇల్లెందు ప్రజల గొంతుకగా నిస్వార్థ సేవ చేస్తూ గుమ్మడి నరసయ్య విస్తృతమైన ఖ్యాతి పొందారు. హైదరాబాద్ మహానగరంలో ఎమ్మెల్యే కోటా కింద తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. తన కోసం నివసించడానికి నీడైనా లేకుండా అతి సాధారణంగా జీవిస్తున్నారు గుమ్మడి నరసయ్య.

గుమ్మడి నరసయ్య జీవితంపై పరమేశ్వర్ హివ్రాలే అనే దర్శకుడు బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఆదివాసీల ఆత్మబంధువు, నిరంతరం ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిరాడంబరుడు నరసయ్య. వర్తమాన కాలంలో ఆదర్శాలను ఆచరణలో చూపిన నిక్కమైన మనిషి. సమకాలీన రాజకీయ నాయకులకే కాదు రేపటి తరాలకు కూడా ఆయన ఆదర్శప్రాయుడు.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన సి.భాస్కర్ రావు ప్రతి ఏటా ఇచ్చే చింతలపల్లి నిర్మలాదేవి–చింతలపల్లి నారాయణరావుల 2025 సంవత్సరపు జీవనసాఫల్య పురస్కారాన్ని గుమ్మడి నరసయ్యకి ఈ నెల ఐదున నాగర్‌కర్నూల్‌లో ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద వారికి 25 వేల రూపాయల నగదుతో శాలువా, జ్ఞాపికను అందజేస్తారు.

హెచ్. రమేష్‌బాబు

స్వతంత్ర పాత్రికేయుడు

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 01:59 AM