Share News

Telugu Language Controversy: తెలుగును బొందపెట్టి సంస్కృతానికి ఎరువేసి...

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:29 AM

తెలుగును తప్పించి జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ప్రవేశపెట్టడంపై ప్రభుత్వ నిర్ణయం, తెలుగు భాషాభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వడం కాకుండా, ఇతర భాషలతో పోలిస్తే సంస్కృతాన్ని మార్కుల కోసం బలవంతంగా విద్యార్థులపై అమలు చేయడం.

Telugu Language Controversy: తెలుగును బొందపెట్టి సంస్కృతానికి ఎరువేసి...

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరం నుంచి ద్వితీయ భాషగా తెలుగు స్థానే సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఆలోచన తెలుగు భాషాభిమానుల హృదయాల్లో శతఘ్నుల్ని పేల్చింది. ఇప్పటిదాకా ఈ సంస్కృత భాషా దారిద్ర్యం కేవలం ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలకే పరిమితమైంది. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు తాజా ప్రతిపాదనతో ఇది ప్రభుత్వ కళాశాలలకు కూడా వ్యాపించబోతోంది. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం తప్ప ఇతర భాషను ఎంచుకునే అవకాశం కూడా లేదు. అందులో చేరిన ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా సంస్కృతమే తీసుకొని తీరాలి. మార్కుల యావలో పడి తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి తిలోదకాలిస్తున్న ప్రైవేటు కళాశాలల ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి విషపూరిత ఆలోచన చేయడం నిజంగానే కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవడమే. ఒక వైపు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మాతృభాషలకు, ప్రాంతీయ భాషలకు ఎంతో గౌరవమిచ్చి వాటి అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయిస్తుంటే, జాతీయ విద్యా విధానం–2020 కూడా ప్రాంతీయ భాషలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు ఇలాంటి గడ్డు నిర్ణయం తీసుకోవడం తెలుగువారిని అవమానించడమే. గత రెండున్నర దశాబ్దాలుగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్య నిర్లక్ష్యానికి గురై యాభై శాతం మంది విద్యార్థులు తప్పులు లేకుండా తెలుగు అక్షరమాల, గుణింతాలు, ఒత్తులు రాయలేని వారే ఉన్నారు. ఇంటర్మీడియేట్, డిగ్రీ విద్యార్థులకు కూడా దోషాలు లేకుండా ఒక ప్రామాణిక లేఖ రాయరాదు.


ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసన మండలిలో చేసిన ఆవేదనపూరిత ప్రసంగంలో తెలిపినట్లు అయిదవ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో నలభై శాతం మంది విద్యార్థులకు మూడవ తరగతి తెలుగు వాచకం చదవరాదు. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండవ తరగతి తెలుగు వాచకం చదవరాదు. తెలుగు పరిస్థితే ఇలా ఉంటే సంస్కృతం పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. తెలుగు నేర్చుకోవడం కంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా కష్టం. సంస్కృతంలో కనీస భాషణ, పఠన, లేఖన సామర్థ్యాలు సాధించాలంటే సుమారు మూడు వేల శబ్దాలు నోటికి రావాలి. (రామః–రామౌ–రామాః) కొన్ని వేల క్రియాపదాలు, ధాతువులు, విభక్తులు, అవ్యయములు, సమాసాలు, వృత్తులు, సర్వనామ శబ్దాలు (సర్వ, విశ్వ... యుష్మద్, అస్మద్, కిం, ఇదమ్, అదస్ మొదలైనవి) ఇలా చాలా పద సామాగ్రి నేర్చుకోవాలి. ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ళ పాటు సంస్కృతం చదివిన తొంభై శాతం మంది విద్యార్థులకు సంస్కృతంలో కనీసం ఐదు వాక్యాలు తప్పులు లేకుండా మాట్లాడరాదు. రెండు వాక్యాలు వ్యాకరణ దోషాలు లేకుండా రాయరాదు. అలాంటి సంస్కృతాన్ని కేవలం మార్కుల కోసం, స్కోరు కోసం అమాయక విద్యార్థుల మీద రుద్దడం ఎందుకు? భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలులో లేని, మాట్లాడని భాషను బలవంతంగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాల మాయలో పడి విద్యార్థుల మీద రుద్దడం ఎంత వరకు సమంజసం? రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు వెంటనే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలి.


సంస్కృత భాష ఇంత ఆకర్షణీయ భాషగా, స్కోరింగ్ సబ్జెక్ట్‌గా మారడానికి ప్రధాన కారణం సంస్కృత అధ్యాపకులు అడ్డగోలుగా మూల్యాంకనం చేసి నూటికి నూరు, తొంభై తొమ్మిది మార్కులు వేయడమే. ప్రశ్నలు కూడా బట్టీయం పట్టి రాసేవి ఎక్కువ. సంస్కృతాన్ని అమితంగా ప్రేమించి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు దాన్ని ఇంతగా దత్తత తీసుకోవడానికి కారణం సంస్కృతాన్ని ఉద్ధరించడమో, సంస్కృత వాఙ్మయాన్ని రక్షించాలనే దీక్షతోనో ఏమీ కాదు. మిగతా గణిత శాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్ర అధ్యాపకులను నియమించుకున్నట్లుగా సంస్కృతం అధ్యాపకుడిని సంవత్సరం పాటు నియమించుకొని జీతాలు ఇవ్వక్కరలేదు. చివరి నెల అంటే ఫిబ్రవరి నెలలో మాత్రమే సంస్కృత అధ్యాపకుడిని నియమించుకొని ఒక్క నెలలోనే సిలబస్ అంతా చెప్పించి లేదా అయిందనిపిస్తారు. దాని వల్ల సో కాల్డ్ కళాశాలలకు స్కోరుకు స్కోరు, డబ్బు ఆదాకు ఆదా. నిజంగానే ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కూడా చేపట్టని సంస్కృత భాష ఉద్ధరణను తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్మీడియెట్ బోర్డు భుజాన వేసుకున్న మాట వాస్తవమే అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్‌లో సంస్కృతం ద్వితీయ భాషగా తీసుకున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సంస్కృతాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కాకుండా దేవనాగరి లిపిలోనే రాయాలనే నిబంధన పెట్టాలి. అప్పుడు సంస్కృతానికి నిజమైన న్యాయం చేసినట్టు. అంతేగాని మార్కుల కోసం ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదం. మార్కుల కోసం చదువా? మానసిక, సాంస్కృతిక వికాసం, విజ్ఞానం, తార్కిక ఆలోచన కోసం చదువా అనేది ముందు తేల్చుకోవాలి. పోనీ ఆంగ్ల భాష నేర్చుకోవడం ద్వారా కలిగే ఉపాధి అవకాశాలు కూడా సంస్కృత భాష అధ్యయనం ద్వారా ఏమైనా కలిగే అవకాశాలు ఉన్నాయా? అనేది కూడా తల్లిదండ్రులకు వివరించాలి.


అంతేకాని కేవలం ప్రైవేటు కళాశాలల మోజులో పడి విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు ఆడటం సమంజసం కాదు. ఇంటర్మీడియేట్ విద్యార్థులకు దాదాపుగా తెలుగును పూర్తిగా తొలగించి సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోలాగా అన్ని ప్రైవేటు, కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి దాకా ప్రతి విద్యార్థి తెలుగు మాధ్యమంలోనే చదివేలా నిబంధన విధించాలి. అలాగే ఎనిమిదవ తరగతి నుంచి డిగ్రీ దాకా తెలుగును ద్వితీయ భాషగా కాదు, ప్రథమ భాషగా చదవాలనే నిర్బంధం రావాలి. ఇంగ్లీష్‌ను ద్వితీయ భాషగా చదవాలి. హిందీ, ఫ్రెంచ్, అరబ్బీ, ఉర్దూ, సంస్కృతం తదితర భాషల్ని తృతీయ భాషగా, లేదా ఐచ్ఛిక భాషగా చదివే వసతి కల్పించాలి. అంతేగాని తెలుగు రాష్ట్రంలో తెలుగును తొలగించడమంటే మన తలను మనం నరుక్కోవడమే. కొన్నేళ్ళ పోరాటం తర్వాత 2021 నుండి డిగ్రీ ఫైనలీయర్‌లో కూడా తెలుగును ప్రవేశపెట్టి బోధిస్తున్నాం. దీన్ని కూడా తొలగించి తెలుగుకు క్రెడిట్స్ తగ్గించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా ప్రమాద హేతువే. ఇప్పుడిప్పుడే డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు కొంత మందైనా రచయితలుగా మారుతున్నారు.


రచనా ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. మరికొంత మంది ఎం.ఏ తెలుగు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు తెలుగు తీసివేస్తే వారి రచనాసక్తిపైన, సృజనశక్తిపైన నీళ్ళు చల్లినట్టే. తెలుగు భాషా పునాదులు విద్యార్థుల్లో బలంగా పడాలంటే ప్రాథమిక పాఠశాలల్లోనే తెలుగు భాషోపాధ్యాయులను నియమించాలి. తెలుగు భాష అభివృద్ధికి, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు భవిష్యత్‌లో తీసుకోకుండా తెలుగును రక్షించడానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. దానికి తగిన నిధులు కేటాయించాలి. ఇప్పటికీ అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌ను, తెలుగు అకాడమి డైరెక్టర్‌ను నియమించుకోలేకపోయాం. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు భాషపట్లగల చిత్తశుద్ధిని వ్యక్తీకరిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు చేస్తోన్న దోపిడీకి అడ్డుకట్ట వేసి రాష్ట్రంలోని మొత్తం ఇంటర్మీడియేట్ విద్యా వ్యవస్థను, ఆయా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలను జాతీయం చేసి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంటర్మీడియేట్ విద్యను హస్తగతం చేసుకోసుకోవాలి. లేదంటే ‘‘తెలుగెక్క డుందిరా తెలుగోడా...? నీ తెలుగు తెల్లారె తెలుగోడా..’’ అని శోకంపెట్టి ఏడవాల్సి వస్తుంది. తెలుగును రక్షించుకోవాలన్నా బొందపెట్టి సంస్కృతానికి ఎరువుగా మారాలన్నా అది ప్రజల చేతుల్లో ఉంది.

డా. వెల్దండి శ్రీధర్

Updated Date - Apr 15 , 2025 | 05:33 AM