Share News

ఆ ‘నల్లదనం’లో విశ్వ సౌందర్యం

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:10 AM

‘నాకు నాలుగేళ్ల వయసులో, నన్ను మళ్లీ గర్భంలోకి పంపించి, నలుపు రంగు తీసేసి తెల్లగా, అందంగా మార్చగలవా అని మా అమ్మను అడిగాను. నల్ల రంగులో పుట్టకపోవడమే మంచిది అన్న అభిప్రాయాలను వింటూనే నా జీవితంలో...

ఆ ‘నల్లదనం’లో విశ్వ సౌందర్యం

‘నాకు నాలుగేళ్ల వయసులో, నన్ను మళ్లీ గర్భంలోకి పంపించి, నలుపు రంగు తీసేసి తెల్లగా, అందంగా మార్చగలవా అని మా అమ్మను అడిగాను. నల్ల రంగులో పుట్టకపోవడమే మంచిది అన్న అభిప్రాయాలను వింటూనే నా జీవితంలో యాభై సంవత్సరాలు గడిపేశాను’– తన శరీర ఛాయపై ఒక అవమానకరమైన వ్యాఖ్యకు ప్రతిస్పందనగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శారదా మురళీధరన్‌ ఒక సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్‌లోని వ్యాఖ్య అది. ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆ విద్యావతి వ్యాఖ్య మన ప్రజాసంస్కృతిలో ఒక ప్రాముఖ్యం గల సందర్భం. కోట్లాది భారతీయ మహిళల (చాలా మంది పురుషుల) మనసులోని మూగవేదన, నిత్య జీవితంలో అనుభవిస్తున్న బాధలు, యాతనలను గుండె లోతుల్లోంచి వచ్చిన మాటల్లో శారద వ్యక్తం చేశారు. ఇటువంటి బాధాకర విషయాన్ని అంగీకరించేందుకు మీకు మనోబలం ఉండాలి. ఆ సత్యాన్ని బహిరంగంగా చెప్పేందుకు మీకు ధైర్యముండాలి. అందుకు మీకు విశేష అధికారం, మాట్లాడగల శక్తి, చెప్పిన దాన్ని వింటారనే భరోసా మీకు ఎంతైనా అవసరం. అటువంటి మానసిక క్లేశానికి గురయినవారు ఆ వ్యాకులత నుంచి విముక్తి పొందగలరనడానికి శారద వ్యాఖ్యలే తార్కాణం.


కచ్చితంగా 65 సంవత్సరాల క్రితం (మార్చి 1960లో) రామ్‌ మనోహర్‌ లోహియా ‘స్కిన్‌ కలర్‌ అండ్‌ బ్యూటీ’ (చర్మం రంగు, అందం) అన్న ఒక అసాధారణ వ్యాసాన్ని రాశారు. ‘రంగు నిరంకుశత్వం’పై విమర్శకు పథనిర్దేశం చేసిన రచన అది. స్త్రీ అందాన్ని శ్వేత వర్ణంతో ముడిపెట్టే ఆలోచనా ధోరణులను బద్దలు చేసేందుకు లోహియా ఆ వ్యాసం ద్వారా ప్రయత్నించారు: ప్రేమించే మహిళ, ప్రేమించబడే మహిళ నల్లగా ఉన్నా లేదా తెల్లగా ఉన్నా నక్షత్రకాంతిమయమైన ఆకాశం సౌందర్యంతో ప్రకాశిస్తుంది’ అని ఆయన అన్నారు. సోషల్‌ మీడియాలో శారద పోస్ట్‌ను, లోహియా వ్యాసంతో కలిపి చదివినప్పుడు తెల్ల చర్మం కోసం వెర్రి ఆరాటం అంత తేలికైన వ్యవహారం కాదని నాకు అర్థమయింది. చర్మం రంగు నల్లగా ఉన్నవారిపై దురభిప్రాయాలు మనకాలంలో ఇంకా ప్రబలంగా ఉన్న సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడుతాయి. శరీర ఛాయపై ఈ చర్చలోని చాలా అంశాలను ఇటీవల ఒక విద్వత్‌ గ్రంథం ‘The Routledge Companion to Beauty Politics’ ప్రస్తావించింది. Maxine Leeds Craig ఆ గ్రంథం ప్రారంభ వాక్యాలలోనే ఆ అంశాలను ఇలా సంక్షేపించారు: ‘అందం రాజకీయ సంబంధమైన వ్యవహారమే. విజేతలు కోరుకునే బహుమానమది. కురూపితనం అనేది సామాజికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారు తమ ఆధిక్యతను, తమకంటే తక్కువ వారు అని భావిస్తున్న వర్గాలపై ప్రయోగించే ఆయుధం’. సౌందర్యాత్మక తీర్పుపై ఇటువంటి రాజకీయ అభిప్రాయాన్నే లోహియా వ్యక్తం చేశారు: రాజకీయాలు సౌందర్యాత్మకతను ప్రభావితం చేస్తాయి; అధికారం సైతం, ముఖ్యంగా పోటీలేని అధికారం చాలా అందంగా కనిపిస్తుంది’.


‘నల్లదనంపై దరభిప్రాయాలు’ అని శషబిషలు లేకుండా తాను పేర్కొన్న దృగ్విషయంపై శారద వ్యాఖ్యలు స్పష్టంగా ఎత్తి చూపాయి. ‘పక్షపాతం కేవలం నలుపునకు వ్యతిరేకంగా మాత్రమే కాదు... చర్మం నల్లగా ఉండడం గురించి, అదేదో సిగ్గు పడాల్సిన విషయంలా.. నలుపు కేవలం ఒక రంగు కాదు, నలుపు అనేది మంచిది కాదు, నలుపు చల్లని నిరంకుశత్వం, ఒక గాఢాంధకారం’ అని ఆమె అన్నారు. ఎటువంటి రూపకాలంకారాలకు పోకుండా శుద్ధ నల్లదనాన్ని ఆమె అంగీకరించారు. సొంతం చేసుకున్నారు. ‘నేను నల్లదనాన్ని తవ్వుతున్నాను’ (ఐ డిగ్‌ బ్లాక్‌) అని ఆమె వ్యాఖ్యానించారు. ఇది అమెరికన్‌ నల్లజాతి ప్రజల పోరాట సంస్కృతి స్ఫూర్తితో చేసిన వ్యాఖ్య. అమానుష అణచివేతకు వ్యతిరేకంగా నిరసనలు ఎల్లప్పుడూ బాహ్య సమాజాల నుంచి ఉత్తేజం పొందడం కద్దు. అమెరికా నల్లజాతి ప్రజల నిరసనోద్యమాలను లోహియా పూర్తిగా సమర్థించారు. ఆ ఉద్యమకారులకు ఆయన స్నేహితుడు. అమెరికాలో జాతిపరమైన చీలికలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని ఆయన అరెస్ట్ అయ్యారు. ఒక విరుద్ధ వాస్తవాన్ని వెల్లడించేందుకు ఆయన నేరుగా నీగ్రో (అప్పటికి ఇంకా వాడుకలో ఉన్న మాట)ను ప్రస్తావించారు: ఆఫ్రికా నీగ్రోలు యూరోపియన్‌ శ్వేతజాతీయులవలే ప్రపంచాన్ని పరిపాలించినట్టయితే స్త్రీ అందచందాలకు సంబంధించిన ప్రమాణాలు నిస్సందేహంగా భిన్నంగా ఉండేవి’. కవులు, వ్యాసకర్తలు నీగ్రో మృదువైన చర్మం గురించి సౌందర్యాత్మక పెదవులు, ముక్కు గురించి మాట్లాడేవారు’.

‘నల్ల రంగులో పుట్టకపోవడమే మంచిది అన్న అభిప్రాయాలను వింటూనే నా జీవితంలో యాభై సంవత్సరాలు గడిపేశాను’ అని శారద వ్యాఖ్యానించారు. ‘నల్ల రంగులో ఉండే స్త్రీలు ఎలా వ్యాకులత, ఆత్మన్యూనతా భావంతో పెరుగుతారో’ లోహియా మనకు గుర్తుచేశారు. ఒక సర్వవ్యాపక వాస్తవాన్ని గుర్తించేందుకు వారు చెప్పిన విషయాలు మనకు తోడ్పడుతాయి. సమాజంలో ప్రబలంగా ఉన్న అభిరుచులకు మార్కెట్‌లే మంచి కొలమానాలు. ముఖ్యంగా వివాహ వేడుకలకు సంబంధించిన వస్త్రాలు, ఆభరణాలు; అందాన్ని ఇనుమడించే ఉత్పత్తుల మార్కెట్లు అందుకు నిదర్శనాలు. భారతదేశ చర్మ సౌందర్య ఉత్పత్తులలో సగం స్కిన్‌ –వైట్నెర్సే కావడం గమనార్హం. వీటి విలువ వార్షికంగా 35 నుంచి 40 వేల కోట్ల రూపాయల మేరకు ఉంటుంది. ఇది ఏటా 6శాతం చొప్పున పెరుగుతుంది. అందంగా ఉన్నది ఏదైనా ఒక సానుకూలతను సంతరించుకుంటున్నది. నల్లదనానికి అన్నీ విరుద్ధాలే. నలుపుపై దురభిప్రాయాలు మన ప్రజాసంస్కృతిలో పూర్తిగా ఇంకిపోయి ఉన్నాయి. బ్లాక్‌ డేస్‌, బ్లాక్‌ బ్యాడ్జెస్‌... చివరకు రైతులు వ్యతిరేకించిన చట్టాలను నల్ల చట్టాలుగా పేరు పొందాయి. రంగు ప్రాతిపదిక అణచివేత సమగ్ర స్వభావాన్ని గుర్తించడం మనం వేయవలసిన తదుపరి అడుగు. నలుపుపై దురభిప్రాయాలు అధికారంలో వేళ్లూనుకున్న సాంస్కృతిక, సామాజిక వ్యవస్థలు, సంప్రదాయాలలో ఉన్నాయని లోహియా గుర్తించారు.


భారతీయ సమాజంలో ఈ వివక్ష మరో రెండు విధాలుగా కూడా వ్యక్తమవుతోంది: కుల అసమానతలు, దక్షిణ భారతావనిపై ఉత్తర భారతదేశ ఆధిపత్యం. అలా రంగు నిరంకుశత్వానికి ప్రతి ఘటన వలసవాద, జాత్యహంకార, జెండర్‌, కుల ప్రాతిపదిక, ప్రాంతీయ పెత్తనం... మొదలైన రూపాలలోని అన్యాయాన్ని ప్రశ్నించేందుకు దారి తీస్తుంది. రంగుపరమైన వివక్షను ధైర్యంగా ఎదుర్కోవడం విముక్తి రాజకీయాలకు అత్యావశ్యకం. నలుపులోని స్వాభావిక అందం, విభిన్న లక్షణాలను గుర్తించి, అభినందించడం, ప్రోత్సహించడం ద్వారా ఆ విమోచన పోరాటం ప్రారంభమవ్వాలి. ఒక దశాబ్దం క్రితం నటి నందితాదాస్‌ ‘బ్లాక్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనే ఉద్యమాన్ని నిర్వహించారు. నలుపు రంగుపై ప్రజల చైతన్యశీలతను మార్చివేసేందుకు ఉద్దేశించిన ఆ సాహసోపేత ప్రయత్నం స్వల్పకాలం మాత్రమే కొనసాగింది.

తన నల్ల వారసత్వాన్ని ఘనంగా చెప్పుకునేందుకు శారద చాలా సంతోషిస్తున్నారు. ‘నలుపు అనేది దేనినైనా గ్రహించగల రంగు. అది మానవ నాగరికతకు తెలిసిన అత్యున్నత శక్తి ప్రవాహం. ఇది అన్ని చోట్లా ఉంటుంది. అది కాటుక విశిష్టత, వానజల్లు వాగ్దానం’. ఈ నలుపు వేడుకలో లోహియా కూడా శారదతో పాటు తప్పక పాల్గొనేవారు: ‘జీవితం, సృష్టి మార్మికత, మత్స్య నయనాల సొగసు, గజ గమనం, సంధ్యాసమయంలోని సౌందర్యం మొదలైనవి నల్ల చర్మపు మరింత శోభాయమానమైన అంశాలు’ అని ఆయన అన్నారు. అటువంటి ఉత్సవం ఒక రాజకీయ ప్రతిఘటనా చర్య.


మరి ఈ ప్రతిఘటనా రాజకీయాల భవిష్యత్ ఏమిటి? లోహియా తన వ్యాసాన్ని రాసి ఆరున్నర దశాబ్దాలు గడచిపోయాయి; నటి నందితాదాస్‌ ‘డార్క్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఉద్యమాన్ని నిర్వహించి దశాబ్దంకు పైగా గడచిపోయింది. ఏమైనా మార్పు సంభవించిందా? లేదు. వాటి ప్రభావమేమీ లేదు. అయినప్పటికీ శారద తన బిడ్డల గురించి చేసిన ప్రస్తావనలో ఒక ఆశాభావం ఉన్నది: వారు తమ నల్ల వారసత్వాన్ని గొప్పగా భావించారు, చెప్పుకున్నారు. నేను అందాన్ని చూడని ప్రదేశాలలో వారు సౌందార్యాన్ని కనుగొన్నారు. నలుపు మహత్తర రంగు అని వారు భావించారు. దాని శోభకు వారు ఆనందపడ్డారు. ఆ రంగులో నేను సౌందర్యాన్ని చూసేందుకు నాకు తోడ్పడ్డారు. ఆ నలుపు అందమైనది. ఆ నలుపు ప్రకాశవంతమైనది. నేను ఆ నలుపును తవ్వుతున్నాను’. ఈ వ్యాఖ్యల ద్వారా ఆమె రంగుల ప్రమాణాలను సవాల్‌ చేశారు. అందాన్ని మూల్యాంకనం చేయడంలో ఒక ‘సౌందర్యాత్మక విప్లవం’ రావాలని లోహియా ఆకాంక్షించారు. అటువంటి విప్లవంతో ‘రాజకీయ, ఆర్థిక విప్లవాల మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా పవనాలు వీస్తాయని, మనుషులలో అంతరంగిక శాంతి ఏర్పడుతుందని’ ఆయన విశ్వసించారు.


అటువంటి విప్లవానికి మార్గమేమిటి అన్నది స్పష్టంగా తెలియదు. అది కచ్చితంగా సంకుచిత పార్టీ ఆధారిత సంకుచిత రాజకీయ మార్గం కాదని మనకు తెలుసు. అటువంటి విప్లవాత్మక రాజకీయాలు సాంస్కృతిక రాజకీయాలు అవుతాయి. జన మాధ్యమాలు పోత్సహిస్తున్న ‘అందం’ సంస్కృతిని సవాల్‌ చేస్తాయి. బహుశా విదేశాలలో విద్యాభ్యాసం చేస్తూ జాతి వివక్షను, రంగు వివక్షను అనుభవించి, తిరిగివచ్చిన యువజనులు అటువంటి ప్రతిఘటనకు నాంది పలకవచ్చు. ఒక శతాబ్దం క్రితం నాటి విదేశీ విద్యావంతులైన యవజనులు జాతీయోద్యమాన్ని బహుముఖంగా అభివృద్ధిపరిచి బలోపేతం చేసిన విధంగా నేటి విద్యాధిక యువత అటువంటి విప్లవాత్మక రాజకీయాలకు మార్గదర్శకులు కావచ్చు. అప్పటివరకు ‘అందం రాజకీయాల’ పట్ల ప్రతి ఘటన కోసం, సర్వజన హితకరమైన శోభస్కరమైన రాజకీయాలను పునరుద్ధరించుకోవడానికి మనం నిరీక్షిస్తూ ఉండాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 02:10 AM