Share News

ఊరి పద్యం

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:28 AM

మా ఊరిప్పుడు మహా రాకాసిలా సాగే బాట పక్కన ముడుచుకు పడుకున్న కుక్క పిల్ల మా ఊరిప్పుడు మూడు కాళ్ళతో నడయాడే ముదివగ్గుల వృద్ధాశ్రమం మా ఊరిప్పుడు...

ఊరి పద్యం

మా ఊరిప్పుడు

మహా రాకాసిలా సాగే బాట పక్కన

ముడుచుకు పడుకున్న కుక్క పిల్ల

మా ఊరిప్పుడు

మూడు కాళ్ళతో నడయాడే

ముదివగ్గుల వృద్ధాశ్రమం

మా ఊరిప్పుడు

దేశాల బాట పట్టిన బిడ్డల కోసం

ఎదురు చూసే చకోరం

మా ఊరిప్పుడు

పలకరింపును ఫోన్లలో

వెతుక్కునే యశోధర

మా ఊరిప్పుడు

సీరియళ్ళ ద్వేషాన్ని కప్పుకున్న

టీవీల జిలుగు తెర

మా ఊరిప్పుడు

భరోసా కోసం అంగలార్చే రైతుల

నాగేటి సాలు

మా ఊరిప్పుడు

కడుపు కోసం కైకిలయ్యే

కూలీల అన్నం ముద్ద

మా ఊరిప్పుడు

పింఛన్లు, రేషన్ కార్డుల మధ్య

నలుగుతున్న ఓట్ల పెట్టె

మా ఊరిప్పుడు

పాడె మోసే నలుగురి కోసం

వెతుక్కుంటున్న వల్లకాడు

వి.ఆర్. తూములూరి

97052 07945

Updated Date - Jan 20 , 2025 | 12:28 AM