Share News

World health day: ఆందోళనకరంగా భారతీయుల ఆరోగ్యం.. బీపీ, షుగర్ బాధితుల పెరుగుదల

ABN , Publish Date - Apr 07 , 2025 | 10:34 PM

హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 పేరిట అపోలో హాస్పిటల్స్ 5వ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఇందులో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు ఇందులో వెల్లడయ్యాయి.

World health day: ఆందోళనకరంగా భారతీయుల ఆరోగ్యం.. బీపీ, షుగర్ బాధితుల పెరుగుదల

హైదరాబాద్: హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 పేరిట అపోలో హాస్పిటల్స్ 5వ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఇందులో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు ఇందులో వెల్లడయ్యాయి. "లక్షణాల కోసం ఎదురుచూడకండి - నివారణ ఆరోగ్యాన్ని మీ ప్రాధాన్యతగా చేసుకోండి" అనే సందేశంతో ఈ నివేదికను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మందినీ పరీక్షించి దీన్ని రూపొందించారు. ఈ నివేదిక ఒక నిశ్శబ్ద మహమ్మారి గురించి తెలియజేసింది. లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది గుర్తించని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారట. 26% మంది రక్తపోటు సమస్యతో, 23% మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. అయినప్పటికీ వారికి ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. 2019లో 10 లక్షల మంది ఆరోగ్య పరీక్షలు చేసుకోగా 2024లో 25 లక్షల మంది హెల్త్ టెస్టులు జరుపుకున్నారు. అలా వీరి సంఖ్య ఐదేళ్లలో దాదాపు 150% వృద్ధి చెందిదన్నమాట.


ఇది ప్రజల్లో నివారణ ఆరోగ్యం పట్ల అవగాహన, ఆసక్తి పెంచుతోందని తెలియజేస్తోంది. ఈ నివేదిక మూడు అత్యవసర ఆరోగ్య సవాళ్లపై దృష్టి సారించింది. కొవ్వు కాలేయ వ్యాధి, ఋతుస్రావం ఆగిన తర్వాత ఆరోగ్య క్షీణత, చిన్నారుల స్థూలకాయం రిపోర్ట్ అనే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా అపోలో చైర్మన్ ప్రతాప రెడ్డి మాట్లాడుతూ.. "ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాలను సృష్టించేందుకు భారత్ ముందుకు రావాలి. ప్రతి ఇల్లు ఆరోగ్య కేంద్రంగా మారాలి. నివారణ ఆరోగ్య సంరక్షణ ఇకపై భవిష్యత్ ఆకాంక్ష కాదు. ఈ నివేదిక మన బాధ్యతను తెలియజేస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేసే అంశాలను విద్యార్థులకు పాఠాలుగా చెప్పాలి. ఆరోగ్యాన్ని కూడా కుటుంబ దినచర్యల్లో భాగం చేయాలి. అప్పుడే వ్యాధుల చికిత్స నుండి ఆరోగ్య సంరక్షణకు మారగలం, రాబోయే తరాలకు దృఢమైన, ఆరోగ్యవంతమైన దేశాన్ని అందించగలం" అన్నారు.


కాలేయ సమస్యలు..

ఎండీ సునీతా రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య పరీక్షలు జరిపిన వారిలో 66% మందికి కొవ్వు కాలేయం సమస్యలు ఉండగా.. వారిలో 85% మంది మద్యానికి దూరంగా ఉన్నారు" అని పేర్కొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 10:34 PM