ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిరుధాన్యాల స్నాక్స్‌ మంచివేనా..

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:10 PM

నూనెలో వేయించి తయారు చేసే స్నాక్స్‌ బియ్యప్పిండి, మైదా పిండి, సెనగపిండి వంటి వాటితో కాకుండా చిరుధాన్యాల పిండితో చేసినా వాటిలో కొవ్వు పదార్ధాలు అధికంగానే ఉంటాయి.

ఈ మధ్య మార్కెట్లో కొత్తగా స్నాక్స్‌, బిస్కెట్స్‌, నూడుల్స్‌ వంటివి మిల్లెట్స్‌ (చిరుధాన్యాలు)తో తయారు చేసినవి లభిస్తున్నాయి. ఇవి తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

- చైతన్య, సికింద్రాబాద్‌

నూనెలో వేయించి తయారు చేసే స్నాక్స్‌ బియ్యప్పిండి, మైదా పిండి, సెనగపిండి వంటి వాటితో కాకుండా చిరుధాన్యాల పిండితో చేసినా వాటిలో కొవ్వు పదార్ధాలు అధికంగానే ఉంటాయి. ఇక బిస్కెట్స్‌ విషయానికొస్తే మైదా బదులు చిరుధాన్యాలతో చేసినా, వాటిలో తీపికొరకు చక్కెర బదులుగా బెల్లం, ఖర్జూరాల పొడి, తేనె మొదలైనవి వాడినా క్యాలరీలు మాత్రం అంతే ఉంటాయి. మైదాతో చేసిన చిరుతిళ్లతో పోలిస్తే ఇవి కొంత మెరుగైనప్పటికీ తరచూ తీసుకోవడం వలన ఆరోగ్యానికేమీ ఉపయోగముండదు. పైగా అవసరానికి మించి తీసుకొనే క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు అనారోగ్యానికి కారణమవుతాయి. ఇక నూడుల్స్‌, సేమియా, అటుకుల వంటి వాటిని చిరుధాన్యాలతో చేసినప్పుడు మాత్రం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. చిరుధాన్యాలలో మైదా పిండి కంటే పోషకాలు మెరుగ్గా ఉండడం వలన... చిరుధాన్యాలతో చేసిన నూడుల్స్‌, పాస్తా, సేమియా వంటి వాటిని మరిన్ని పోషకాలున్న కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి వండేటప్పుడు నూనె, ఉప్పు వంటివి మోతాదు మించకుండా చూసుకోవాలి. ఎంత ఆరోగ్యకరమైనవైనా ఏ ఆహారాన్నీ మోతాదు మించి తీసుకోకపోవడమే ఉత్తమం.


ఇస్నోఫీలియా, ఆస్తమా ఉన్నవారు చలికాలంలో ఎటువంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవాలి?

- రామయ్య, నర్సరావుపేట

ఇస్నోఫీలియా, ఆస్తమా ఉన్నవారు చలికాలంలో మరింత ఎక్కువ ఇబ్బందిపడే అవకాశం ఉంది. చక్కటి పోషకాహారం తీసుకోవడం... జీవన శైలికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమా లక్షణాలు రాకుండా చూసుకోవచ్చు. దైనందిన ఆహారంలో అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు అధికంగా చేర్చుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిస్తాయి.

మంచి కొవ్వును అందించే బాదం, వేరుశెనగ, పిస్తా, ఆక్రోట్‌ వంటి గింజలను ప్రతిరోజూ గుప్పెడు తీసుకోవాలి. ప్రొటీన్‌ తగినంత తీసుకొంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ప్రొటీన్‌ కొరకు గుడ్లు, వివిధ రకాల గింజలు (ఉలవలు, సోయాచిక్కుడు, రాజ్మా, సెనగలు, అలసందలు మొదలైనవి), చికెన్‌, చేప, సోయా పనీర్‌ వంటివి తీసుకోవచ్చు. చల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌, ఫ్రిడ్జ్‌లో ఉన్న పెరుగు, మజ్జిగ, కూల్‌డ్రింక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. అన్నిరకాల పండ్లు తీసుకోవచ్చు కానీ అలర్జీ లక్షణాలు కనిపించిన పండ్లను మాత్రం మానేయాలి. బరువు నియంత్రణలో ఉండడం కూడా ఆస్తమా లక్షణాలను నియంత్రణలో ఉంచేందుకు అవసరం. ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండేలా తగినంత ఆహారం తీసుకొంటూ వ్యాయామాలు కూడా చేయాలి.


దగ్గు, జలుబు ఉన్నవారు నిమ్మకాయ, కమలా పండు, ఉసిరి వంటివి తింటే జలుబు ఎక్కువవుతుంది అంటారు కదా, ఇది నిజమా లేక అపోహా?

- జానకి, మాచర్ల

దగ్గు, జలుబు ఉన్నప్పుడు నిమ్మ జాతికి చెందిన (సిట్రస్‌ ఫ్యామిలీ) నారింజ, బత్తాయి, కమలా వంటి పండ్లను చాలా మంది దూరం పెడుతుంటారు. ఈ పండ్లు, ఉసిరి, జామ వంటి పండ్లు తింటే జలుబు మరింత పెరుగుతుందని కూడా నమ్ముతారు. అయితే అవన్నీ అపోహలే. చాలాసార్లు పుల్లటి ఆహారం ఏది తీసుకొన్నా కొద్దిసేపు ముక్కు నుంచి నీరు వచ్చినప్పటికీ ఇది జలుబు కాదు. దగ్గు, జ్వరంతో కూడుకున్న జలుబు సాధారణంగా వైరస్‌ మూలాన వస్తుందే తప్ప ఆహారం వలన కాదు. కానీ కొంతమందికి కొన్ని రకాల ఆహారం సరిపడకపోవడం (అలర్జీ లేదా ఇంటాలరెన్స్‌) వల్ల కళ్ళు ఎర్రబారడం, ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు తాత్కాలికంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు ప్రతిసారీ జలుబుకు సంకేతం కాదు. ఈ పండ్లు పడని వారు వీటిని పరిమితుల్లో తీసుకోవచ్చు కానీ ఎటువంటి ఇబ్బంది లేనివారు వేరే వారికి వచ్చే లక్షణాలను బట్టి జలుబు చేస్తే ఈ పండ్లు మానెయ్యాల్సిన అవసరం లేదు. వీటిలోనూ విటమిన్‌ సి, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంచేందుకు ఉపయోగపడి తద్వారా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి కూడా.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Jan 12 , 2025 | 12:10 PM