Smart Phone: పదే పదే సెల్ ఫోన్ చెక్ చేసుకుంటున్నారా.. మీకు ఈ రోగం ఉన్నట్లే..
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:33 PM
స్మార్ట్‌ఫోన్ అనేది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. దీనిని అధికంగా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి జీవించడం కష్టంగా మారింది. ఎందుకంటే మనిషి జీవితంలో అది ఓ భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు దీనిని వాడుతునే ఉంటారు. ఒక్క నిమిషం కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. మనుషులతో కంటే కూడా సెల్ ఫోన్లతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. సెల్ ఫోన్ లేకుండా ఇంట్లో నుండి కాలు కూడా బయటకు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. బోజనం చేస్తున్నా, వాష్ రూంకు వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా ఫోన్ కంపల్సరిగా ఉండాల్సిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అధికంగా ఉపయోగిస్తే అన్ని నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
షాకింగ్ సర్వే:
అమెరికాలో ఇటీవల జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అమెరికన్ వాసులు స్మార్ట్ ఫోన్ ను రోజుకు సగటున 344 సార్లు చూస్తున్నారని తేలింది. అంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి సెల్ ఫోన్ చూస్తున్నారు. నోటిఫికేషన్ రాకున్నా కూడా ఊరికే మొబైల్ ఫోన్ తీసి చూడటం అలవాటుగా మారింది. అయితే, పదే పదే ఇలా సెల్ ఫోన్ చెక్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మైండ్ కేవలం సెల్ ఫోన్ మీద తప్ప మరే ఇతర పని మీద పూర్తి స్థాయిలో నిమగ్నం కావటం లేదని గుర్తించారు.
మెదడుపై ఎఫెక్ట్:
స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వల్ల కొత్త రకం ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టుగా సర్వేలో కనుగొన్నారు. మెదడులో చురుకుతనం తగ్గిపోతుందని వారు గుర్తించారు. ప్రతి ఒక్క విషయానికి స్మార్ట్ ఫోన్లపై ఆధారపడడం వల్ల మనిషిలో జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని సర్వేలో బయటపడింది. స్మార్ట్ ఫోన్ వినియోగించాలనుకునేవారు అవసరం మేరకు మాత్రమే దానిని వినియోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. అలా కాకుండా గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తే మతిమరుపు రోగం వస్తుందని హెచ్చరిస్తున్నారు. రోజులో ఎంత వీలైతే అంత తక్కువగా స్మార్ ఫోన్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Updated Date - Jan 08 , 2025 | 05:34 PM