చరిత్ర తిరగరాయాల్సిన సమయం వచ్చింది.. ఇదే పురాతన కట్టడం..
ABN , Publish Date - Apr 09 , 2025 | 08:54 AM
Mysterious Underwater Pyramid: ఈజిప్టులో ఉన్న పిరమిడ్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, జపాన్ సముద్ర గర్భంలో బయటపడ్డ ఓ పిరమిడ్‌కు దాదాపు 12 వేల ఏళ్ల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడి రాళ్లను పరీక్షించగా ఆ విషయం బయటపడింది.

పిరమిడ్స్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఈజిప్ట్. అక్కడ ఉన్న వేల ఏళ్లనాటి పిరమిడ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచం నలుమూలలా చాలా రకాల పిరమిడ్లు ఉన్నా.. ఈజిప్ట్ పిరమిడ్లకు మాత్రమే పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది. ఈజిప్ట్ పిరమిడ్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, ఈ చరిత్రను తిరగరాయడానికి జపాన్‌లోని ఓ పిరమిడ్ సిద్దమైంది. సముద్ర గర్భంలో ఉన్న ఆ పిరమిడ్‌కు ఈజిప్ట్ పిరమిడ్లను మించిన చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. జపాన్, ర్యూక్యూ ఐలాండ్ దగ్గరలో ఉన్న సముద్రంలో ఓ పిరమిడ్ బయటపడింది. 1986లో ఆ పిరమిడ్‌ను కనుగొన్నారు. సముద్రంలో 82 అడుగుల లోపల ఆ పిరమిడ్ ఉంది. ఆ మిస్టరీ పిరమిడ్ ఆకారాన్ని ‘మోనగుని మోనుమెంట్’ అని పిలుస్తున్నారు.
ఆ పిరమిడ్‌పై గత కొన్నేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్లతో 90 అడుగుల ఎత్తుతో ఉన్న ఆ పిరమిడ్ 10 వేల ఏళ్లకంటే పురాతనమైనదని తేలింది. దాన్ని మనుషులు స్వయంగా తమ చేతులతో నిర్మించారని వెల్లడైంది. ఆ పిరమిడ్ నిజంగా 10 వేల ఏళ్ల పురాతనమైనది నిర్ధారణ అయితే.. చరిత్ర పుస్తకాలను తిరగరాయల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పిరమిడ్ ఉన్న ప్రదేశంలో నగరం ఉండి ఉండే అవకాశం కూడా ఉందన్నారు. సముద్ర గర్భంలో ఉందని చెబుతున్న అట్లాంటిస్ లాగే.. ఈ పిరమిడ్ దగ్గర కూడా అంతరించినపోయిన ఓ జాతి నివసించి ఉండొచ్చని స్పష్టం చేశారు. అయితే, అంత పెద్ద కట్టడాన్ని 10 వేల సంవత్సరాల క్రితం నిర్మించటం అన్నది అసాధ్యం అని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు.
మిస్టరీ ప్రపంచం అట్లాంటిస్
అట్లాంటిస్ నగరం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అట్లాంటిస్ అనే నగరం అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిందని, సముద్ర గర్భంలో ఇంకా దాని ఆనవాళ్లు ఉన్నాయని వందల ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ప్లాటో తన రచనల్లో కూడా అట్లాంటిస్ ప్రస్తావన తెచ్చాడు. చాలా మంది రచయితలు కూడా అట్లాంటిస్ గురించి, దాని పతనం గురించి రాసుకొచ్చారు. నవలల్లో, పుస్తకాల్లో తప్పితే అలాంటి ఓ నగరం ఉనికి ఎక్కడా కనిపించటం లేదు. చరిత్రకారులు కూడా అట్లాంటిస్ నగరం ఉందన్న వాదనలను కొట్టిపారేస్తున్నారు. అది కేవలం కల్పితం మాత్రమే అంటున్నారు. అట్లాంటిస్ నగరాన్ని కనిపెట్టడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా ఎలాంటి లాభం లేకుండా పోయింది.
ఇవి కూడా చదవండి:
ఎంత మంచి మనసో.. పుట్టిన రోజు నాడు లక్షల రూపాయలు దానం
Viral Video: మహా దారుణం ఈ దారుణం.. డ్రెస్ కోసం మహిళ యుద్ధం..