Russia: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యాలో మరో కొత్త పథకం! విద్యార్థినులకు మాత్రమే!
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:44 PM
రష్యాలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. 25 ఏళ్ల లోపు విద్యార్థినుల పిల్లల్ని కంటే రూ.81 వేలు ఇస్తామంటూ కరేలియా ప్రాంత అధికారులు తాజాగా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: సంతానోత్పత్తి రేటు పడిపోతుండటంతో చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాలు సతమతమవుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో యువతులను పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు రష్యాలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. కాలేజీల్లో చదువుకునే 25 లోపు విద్యార్థినులను సంతానం కనే దిశగా ప్రోత్సహించేందుకు రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియాలో అధికారులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు (Population Decline).
మాస్కో టైమ్స్ కథనం ప్రకారం, ఆ ప్రాంతాల్లో 25 ఏళ్లులోపున్న కాలేజీ లేదా యూనివర్సిటీ విద్యార్థినులు ఈ పథకం కింద సాయం పొందేందుకు అర్హులు. అయితే, మృతశిశువులకు జన్మనిచ్చిన విద్యార్థినులకు ఈ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
Population Decline: ఒకసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని అడ్డుకోవడం కష్టం.. జోహో సీఈఓ హెచ్చరిక
అయితే, పుట్టిన కొన్ని రోజులకు శిశువు మరణిస్తే తల్లులకు పరిహారం ఇస్తారా లేదా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇక అంగవైకల్యంతో పుట్టిన పిల్లల విషయంలో ప్రభుత్వం విధానంపై కూడా క్లారిటీ లేదు. పురిట్లోనే బిడ్డ మరణిస్తే తల్లిని ఆదుకునేందుకు ప్రభుత్వం సాయంపై కూడా ఎటువంటి నిబంధనలు రూపొందించలేదు. దీంతో, ఈ పథకం పురోగతిపై అప్పుడే సందేహాలు మొదలయ్యాయి.
Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన
ఇక రష్యాలోని ఇతర ప్రాంతాలు కూడా సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రకరకాల పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. విద్యార్థినులను పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు మొత్తం 11 ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. ఇక రష్యా కేంద్ర ప్రభుత్వం కూడా బాలింతలకు ఇచ్చే ఆర్థికసాయాన్ని పెంచింది. తొలిసారి గర్భం దాల్చే మహిళలకు ఈ ఏడాది నుంచి 6150 డాలర్లు ప్రోత్సాహకంగా ఇవ్వడం ప్రారంభించింది. ఇక రెండోబిడ్డను కన్న మహిళలకు 8130 డాలర్ల నజరానాను ప్రకటించింది.
రష్యాలో పెరుగుతున్న మరణాలు, ఇతర దేశాలకు వలసపోతున్న పౌరులు, ఉక్రెయిన్‌తో యుద్ధం తదితరాల కారణంగా జనాభా తగ్గుతోంది. ఇక 2024 ప్రథమార్థంలో కేవలం ఆరు లక్షల మంది శిశువులే జన్మించారు. గత 25 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయిలో జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిపై రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు.
Read Latest and International News
Updated Date - Jan 09 , 2025 | 06:00 PM