No Return: స్వదేశానికి వెళ్లొద్దు
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:08 AM
ట్రంప్ విధించిన వలస ఆంక్షల నేపథ్యంలో భారతీయ టెకీ ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్వదేశ ప్రయాణం మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. వీసా పొడిగింపుపై అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, వెళ్ళిన వారికీ తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సూచిస్తున్నారు

వెళ్తే తిరిగి వచ్చే చాన్స్ ఉండదు
భారతీయ ఉద్యోగులకు అమెరికా కంపెనీల హెచ్చరిక
ట్రంప్ ఆంక్షలపై ఆందోళనలో భారత టెకీలు
డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి
వాషింగ్టన్, ఏప్రిల్ 3: వీసాలు, వలసలపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికా టెక్ కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు పలు జాగ్రత్తలు చెబుతున్నాయి. స్వదేశానికి వెళ్లి వచ్చే ప్రయాణాలను మానుకోవాలని, ఒకసారి వెళ్తే అమెరికాకు మళ్లీ వచ్చే అవకాశాలు ఉండబోవని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అమెరికా టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో అత్యధికులు భారతీయులే. ఏటా దాదాపు 65 వేల వీసాలను అమెరికా హెచ్1బీ ప్రోగ్రామ్ కింద లాటరీ పద్ధతిన మంజూరు చేస్తుంది. వీటిలో మెజారిటీ భారత్‌కు లభిస్తుండగా.. తర్వాత స్థానాల్లో చైనా, కెనడా ఉన్నాయి. వీసా ఉద్యోగులు ఎక్కువగా అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఆపిల్ సంస్థల్లో పనిచేస్తున్నారు. ట్రంప్ ఆంక్షలతో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ కొందరు హెచ్1బీ ఉద్యోగులను ఇంటర్వ్యూ చేసింది. వీరిలో ఇద్దరు భారతీయులు.. తాము భారత్‌కు వెళ్లిరావాలన్న ప్రయాణ ఆలోచనను మానుకున్నామని, వెళ్తే తిరిగి రానిస్తారో లేదోనన్న ఆందోళనే దీనికి కారణమని తెలిపారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. పుట్టుక ఆధారంగా ఇచ్చే పౌరసత్వానికి సంబంధించి ప్రభుత్వం పలు సవరణలు చేయనుందన్న వార్తలపై వీరు ఆందోళన వెలిబుచ్చారు. తమ పిల్లలు అటు అమెరికా, ఇటు భారత్.. పౌరులూ కాకుండా పోతారేమోనని పేర్కొన్నారు. అమెరికా పౌరులు కానివాళ్లందరినీ చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిగానే పరిగణిస్తారన్న హెచ్చరికల దృష్ట్యా ఇళ్ల నుంచి ఎప్పుడు బయటకొచ్చినా అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్తున్నామని కొందరు తెలిపారు. కాగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల వీసా పొడిగింపు ప్రక్రియను వేగవంతం చేసే చర్యలు చేపట్టాయి.
గ్రీన్‌కార్డ్‌కు అసాధారణ జాప్యం
అమెరికా పౌరసత్వం (గ్రీన్‌కార్డ్) దక్కితే ఇలాంటి సమస్యలు దూరమవుతాయి. కానీ గ్రీన్‌కార్డ్ మంజూరుకు అసాధారణ జాప్యం నెలకొంటోంది. అనేక మంది భారతీయులకు గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా వేచిచూస్తున్నారు. మార్కె ట్లో 900కోట్ల డాలర్ల విలువైన కంపెనీగా ఇటీవలే వార్తల్లోకెక్కిన ఏఐ కంపెనీ ‘పర్‌ప్లెక్సిటీ’ సీఈఓ అరవింద్ శ్రీనివాసన్.. గ్రీన్‌కార్డు కోసం తాను మూడేళ్లుగా వేచి చూస్తున్నానని తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ట్రంప్ తొలి దఫా పాలనలో వీసా తిరస్కరణలు 15 శాతం పెరిగాయి. ప్రస్తుత హయాంలోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
రెండున్నరేళ్లలో 150 నుంచి 75 కేజీలకు
ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..