Blair House: అమెరికాలో ప్రధాని మోదీ విడిది చేసిన ఈ 200 ఏళ్ల నాటి గెస్ట్ హౌస్ గురించి తెలిస్తే..

ABN, Publish Date - Feb 14 , 2025 | 09:39 PM

ప్రభుత్వ అతిథిగా అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ట్రంప్ సర్కార్‌ బ్లెయిర్ హౌస్‌లో విడిది ఏర్పాటు చేసింది. 200 ఏళ్ల నాటి ఈ గెస్ట్ హౌస్ విశిష్ఠతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Blair House: అమెరికాలో ప్రధాని మోదీ విడిది చేసిన ఈ 200 ఏళ్ల నాటి గెస్ట్ హౌస్ గురించి తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: విశిష్ఠ అతిథిగా అమెరికాకు విచ్చేసిన ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం గొప్ప ఆతిథ్యం ఇచ్చింది. దేశాధినేతలకు మాత్రమే కేటాయించే బ్రెయర్ హౌస్‌ అనే అతిథి గృహంలో ప్రధాని మోదీకి అమెరికా ప్రభుత్వం విడిది ఏర్పాటు చేసింది.

200 ఏళ్ల నాటి గెస్ట్ హౌస్

ప్రభుత్వ అతిథులు, దేశాధినేతలకు మాత్రమే కేటాయించే బ్లెయిర్ హౌస్‌ను 200 ఏళ్ల క్రితం నిర్మించారు. 1824లో దీన్ని నిర్మించగా ఆ తరువాత 1837లో బ్లెయిర్ కుటుంబం చేతుల్లోకి వెళ్లింది. నాటి నుంచి రాజకీయాలకు కేంద్రంగా మారిన దీనికి బ్లెయిర్ హౌస్ పేరు స్థిరపడింది.


Donald Trump: ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన.. పాక్‌కు షాక్!

ఎంతో చరిత్ర ఉన్న బ్లెయిర్ హౌస్‌ను స్థానికులు ప్రత్యేకమైన హోటల్‌గా పిలుస్తారు. వివిధ దేశాల రాజకుంటుంబాల సభ్యులు, ప్రభుత్వ అతిథులు, దేశాధినేతలకు మాత్రమే అమెరికా ప్రభుత్వం ఇందులో విడిది ఏర్పాటు చేస్తుందట. శ్వేత సౌధానికి కూతవేటు దూరంలో ఈ గెస్ట్ హౌస్ ఉంది. అమెరికా ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచే ఈ భవనంలో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. నాలుగు టౌన్ హౌస్‌ల కలయికగా ఉన్న ఈ గెస్ట్ హౌస్‌లో 119 గదులు, 14 గెస్ట్ బాత్రూమ్‌లు, విడిది చేసేవారి కోసమే ఉద్దేశించిన మరో 35 బాత్‌రూంలు, మూడు భారీ డైనింగ్ గదులు, సకల సదుపాయాలు ఉన్న బ్యూటీ సెలూన్ కూడా ఉంటుంది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ.. కారణం ఇదే

ఇక భవనంలోపలి అలంకరణను అమెరికా చరిత్రను ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. ఒకప్పటి ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా ఉన్న ఫర్నీచర్, పెయింటింగ్‌లు, ఇతర కళాఖండాలు ఎన్నో ఈ భవనంలో ఏర్పాటు చేశారు. అతిథులకు ఏ లోటూ రాకుండా ఉండేందుకు అత్యంత విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక భారత ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని బ్లెయిర్ హౌస్‌పై త్రివర్ణపతాకం రెపరెపలాడింది. ప్రధాని మోదీ దౌత్య పర్యటనకు సూచనగా త్రివర్ణపతాకాన్ని ఏర్పాటు చేశారు.


డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు, దౌత్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఖరారైంది. ఇక ట్రంప్‌తో సమావేశమైన ప్రధాని మోదీ టెక్నాలజీ, వాణిజ్యం, రక్షణ రంగం, ఇంధనం వంటి రంగాలపై చర్చించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 14 , 2025 | 09:39 PM