Share News

Myanmar Quake Chaos: మయన్మార్‌లో హాహాకారాలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:04 AM

మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన శక్తిమంతమైన భూకంపంలో 1,664 మంది మరణించగా, 3,408 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది.

Myanmar Quake Chaos: మయన్మార్‌లో హాహాకారాలు

1,664కు చేరిన భూకంప మృతుల సంఖ్య ‘రెబల్స్‌’ ప్రాంతాల్లో కానరాని సహాయక చర్యలు

ఆ ప్రాంతాల్ని పరిగణనలోకి తీసుకుంటే మరణాలు 10 వేలు దాటి ఉంటాయన్న యూఎ్‌సజీఎస్‌

40కి పైగా వారసత్వ కట్టడాలు నేలమట్టం కూలిన మండలే జైలు.. తెలియని ఖైదీల ఆచూకీ

నగరాల్లో విద్యుత్తు కట్‌.. నీటికి కటకట 40 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్‌

ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో ‘ఆపరేషన్‌ బ్రహ్మ’ ప్రారంభం అసలే అంతర్యుద్ధం ఆపై ప్రకృతి ప్రకోపం సాయం చేసే వారున్నా అందుకోలేని పరిస్థితి

నేపిదా(మయన్మార్‌), మార్చి 29: మయన్మార్‌లో సంభవించిన శక్తిమంతమైన భూకంపం.. తదనంతర ప్రకంపనలతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం రాత్రి కడపటి వార్తలందేసరికి 1,664 మంది మృతిచెందారని.. 3,408 మంది గాయపడ్డారని, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే.. కొండ ప్రాంతాలు, రెబల్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే(యూఎ్‌సజీఎస్‌) మృతుల సంఖ్య ఏకంగా 10 వేలకు పైనే ఉంటుందని అంచనా వేసింది. మయన్మార్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రతకు నేపిదాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) టవర్‌ కుప్పకూలి, అందులో ఉన్న సిబ్బంది అంతా చనిపోయారు. సహాయక చర్యలకు ఆటంకాలేర్పడి ఆలస్యం అవుతుండటంతో మరణాల సంఖ్య బాగా పెరిగే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మయన్మార్‌కు భారత్‌ సహా.. పలు దేశాలు సహాయక సామగ్రిని తరలించాయి. సహాయక చర్యలకు భారత్‌ 80 మంది ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం, 118 మందితో వైద్య బృందాన్ని పంపింది.


sgzfgh.jpg

అంతటా హాహాకారాలు

భూకంపంతో ఒక్క మండలే నగరంలోనే 700 మందికి పైగా మృతిచెందారని, ఇతర నగరాల్లో కలుపుకొని ఆ సంఖ్య 1,002గా ఉందని మయన్మార్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. కొండప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో మరణాలను ఇంకా అంచనా వేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడంతో బాధితుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. ఒక్క సికాయ్‌ పట్టణంలోనే 200 మందికిపైగా మృతదేహాలను కనుగొన్నామని, పర్వత ప్రాంతం కావడంతో ఇంకా సహాయకచర్యలు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారని పేర్కొన్నారు. భూకంపం సంభవించినప్పుడు ప్రీస్కూళ్లు, కాన్వెంట్లు, మఠాలు, శరణార్థి శిబిరాల్లో వందల మంది ఉన్నట్లు చెప్పారు. ఇక్కడికి సమీపంలో రెబల్స్‌ ఆధీనంలో ఉన్న గ్రామంలోనూ 18 మరణాలు సంభవించాయి. వంతిన్‌ ప్రాంతంలో ఓ బౌద్ధారామం కుప్పకూలడంతో ఇద్దరు బౌద్ధ సన్యాసులు సహా.. 36 మంది మృతిచెందారు. టౌంగూ వెహ్లువన్‌లోనూ బౌద్ధమఠం కుప్పకూలడంతో ఐదుగురు చిన్నారులు(శరణార్థుల పిల్లలు), ఒక బౌద్ధ భిక్షువు మృతిచెందారు. ఇక్కడ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. శిథిలాల కింద నుంచి మరో ముగ్గురిని కాపాడి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. టోంగ్యు టౌన్‌షిప్‌లో ఓ మసీదు కూలడంతో ఐదుగురు చిన్నారులు మృతిచెందారని స్థానికులు తెలిపారు. సిచువాన్‌, మాంటలే, మాగుయి, షెండాంగ్‌, పెయిచు, యాంగూన్‌లలో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది.


adg.jpg

30 గంటలకు పైగా పోరాటం

మాండలేలోని న్యూమార్కెట్‌ వద్ద ఓ ఏడంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఏడో అంతస్తులోని వసతిగృహంలో ఉన్న విద్యార్థులు 30 గంటల పాటు మృత్యువుతో పోరాటం చేశారు. ఇక్కడ ఓ ఉపాధ్యాయుడు సమా.. ఐదుగురు మృతిచెందగా.. మిగతావారిని సురక్షితంగా కాపాడినట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. కచ్చిన్‌లోని మరో ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పాఠశాల భవనం కూలడంతో 24 మంది మరణించగా.. 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సాయం కోసం హాహాకారాలు చేశారు. శనివారం సాయంత్రం వీరిని సురక్షితంగా వెలికి తీశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు భూకంప బాధితులతో నిండిపోతున్నాయి. వేల మంది క్షతగాత్రులకు రక్తం అవసరమవుతోందని మయన్మార్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. రక్తదాతలు వెంటనే ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ రక్తం కొరత ఉన్నట్లు పేర్కొంది. భూకంపం ధాటికి దేశంలోని పలు జైళ్లు దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న మాండలే జైలు, ఓబో జైలులో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. అక్కడి ఖైదీల పరిస్థితి ఏమిటనేదానిపై సమాచారం లేదు.


fdhfg.jpg

40కి పైగా వారసత్వ కట్టడాలు ధ్వంసం

తాజా భూకంపం, తదనంతర ప్రకంపనల కారణంగా మయన్మార్‌లోని 40కి పైగా వారసత్వ కట్టడాలు పాక్షికంగా/పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిల్లో.. 2019లో యునెస్కో గుర్తించిన బగాన్‌, 2014లో గుర్తించిన ‘ప్యూ’ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు.. మాండలే, ఉంగ్వా, అమర్పురా, పగోడా, షామ్‌ ప్రావిన్సుల్లోని వారసత్వ కట్టడాలు, శతాబ్దాల క్రితం నాటి బౌద్ధారామాలు, మసీదులు దెబ్బతిన్నట్లు సెంటర్‌ ఫర్‌ హెరిటేజ్‌ తన మధ్యంతర నివేదికలో ప్రకటించింది. భూకంపంతో మయన్మార్‌లో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. కరెంటు కొరత నేపథ్యంలో కొవ్వొత్తులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో.. రూ.250గా ఉండాల్సిన 10 కొవ్వొత్తుల ప్యాకెట్‌ ధర రూ.450కి పెరిగింది. ఆహార పదార్థాల ధరలు కూడా రెట్టింపయ్యాయి. విద్యుత్తు కొరత కారణంగా.. రోజుకు నాలుగు గంటలు మాత్రమే సరఫరా చేయనున్నట్లు యాంగూన్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ ప్రకటించింది.


ప్రధాని మోదీ సంతాపం..

మయన్మార్‌ విపత్తుపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం తెలిపారు. భూకంప బాధిత దేశాలు మయన్మార్‌, థాయ్‌లాండ్‌కు 5 మిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించారు. సహాయక చర్యలకు అనుభవజ్ఞులైన ఎమర్జెన్సీ రిలీఫ్‌ అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. కాగా, మానవతాసాయాన్ని అందించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో రెబల్స్‌(పీపుల్స్‌ డిఫెన్స్‌ ఆర్మీ) స్థావరాలపై కాల్పులకు విరామం ఇస్తున్నట్లు మయన్మార్‌ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.


అసలే అంతర్యుద్ధం.. ఆపై ప్రకృతి ప్రకోపం

మయన్మార్‌.. భూకంపాలు అధికంగా సంభవించే దేశం. ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కోవడం ఆ దేశ ప్రజలకు కొత్తేమీ కాదు. కానీ, శుక్రవారం సంభవించిన భూకంపం మాత్రం ఆ దేశాన్ని, ఆ దేశ ప్రజలను మరింత దీనస్థితికి చేర్చింది. మానవతా హృదయంతో ఆ దేశానికి సాయం చేసే వారున్నా.. ఆ సాయాన్ని అందుకోలేని దుస్థితి మయన్మార్‌ ప్రజలది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సైనిక పాలన, అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న మయన్మార్‌ పరిస్థితిని 2021 నుంచి జరుగుతోన్న అంతర్యుద్ధం మరింత దిగజార్చేసింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పాలన కోసం ప్రజలు సాయుధ పోరాటానికి దిగడంతో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగేళ్లుగా సైన్యానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న భీకర పోరు వల్ల మయన్మార్‌ తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్న మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన భూకంపం ఆ దేశాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో నిలిచిన మయన్మార్‌ పాలకులు గతంలో ఎప్పడూ లేని విధంగా తమకు సాయం చేయాలని తొలిసారి ప్రపంచాన్ని కోరారు.


భారత్‌ సాయం

భూప్రకోపంతో విలవిలలాడిన మయన్మార్‌, థాయ్‌లాండ్‌కు సాయమందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్‌ ఏకంగా ‘ఆపరేషన్‌ బ్రహ్మ’ పేరుతో ఆపన్నహస్తం అందిస్తోంది. 40 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపింది. ఇందులో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్‌ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పటికే వైమానిక దళం తరలించిన 15 టన్నుల మానవతాసాయం మయన్మార్‌కు చేరిందని, నౌకాదళాన్ని కూడా రంగంలోకి దింపామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మృతుల్లో భారతీయులెవరూ లేరని తెలిపింది. సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి 80 మంది, 118 మంది వైద్య సిబ్బందిని పంపినట్లు వివరించింది. వీరితోపాటు.. నాలుగు రెస్క్యూ డాగ్‌స్వాడ్‌లు ఉంటాయని తెలిపింది.


Read Also: Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా

Ugadi Special: ఉగాది పచ్చడి వెనుక రహస్యం తెలిస్తే తినకుండా వదిలిపెట్టరు

Pooja Timings: మీ పూజలకు ప్రతిఫలం దక్కాలంటే.. ఇవి తప్పక తెలుసుకొండి

Updated Date - Mar 30 , 2025 | 04:06 AM