Trump Tariffs: ఈ దేశంపై ట్రంప్ సుంకాల రేటు 145 శాతం..మరో వైపు ఆ దేశం తగ్గేదేలే అంటూ
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:13 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఈ క్రమంలో చైనా దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా ముందు అనే నినాదంతో ఆయన తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు వాణిజ్య ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలను పెంచడం ద్వారా ట్రంప్ మరోసారి తన హక్కుల కోసం గట్టిగా నిలబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా విధించిన మొత్త సుంకం 145 శాతానికి చేరుకుంది. ఇది గత పరిపాలనల సమయంలో ఉన్న సుంకాలకు అదనంగా ఉండటం విశేషం.
సుంకాల పెంపు వెనుక అసలు ఉద్దేశం ఏంటి
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి చైనా ద్వారా అమెరికాకు సరఫరా అవుతున్న ఫెంటానిల్ అనే మత్తుపదార్థం. దీని వల్ల అమెరికాలో మానవిక సంక్షోభం ఏర్పడుతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఫెంటానిల్ సరఫరాలో చైనా ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 125% సుంకం ప్రకటించారు. ఇది మునుపటి 20% సుంకానికి కలిపితే మొత్తం 145% అయ్యింది.
వ్యూహాత్మకంగా చైనా అడుగులు
ఈ క్రమంలో చైనా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ చర్యలకు ప్రతీకారంగా, చైనా కూడా అమెరికా దిగుమతులపై 84% వరకు సుంకాలు విధించింది. దీనివల్ల ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు చేరుకున్నాయి. వాణిజ్య ఒత్తిడుల మధ్య, చైనా తన వ్యూహాన్ని మారుస్తూ యూరోప్, ఆసియా దేశాలతో బంధాలను పెంచుకునే పనిలో పడింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో చైనా ప్రీమియర్ లీ క్వియాంగ్ సమావేశమై చర్చలు జరిపారు. ఈ క్రమంలో చైనా, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య వాణిజ్యం, పెట్టుబడి, పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంచేందుకు చైనా సిద్ధంగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.
మూడో స్థానంలో
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాల వెనుక మరొక ముఖ్యమైన అంశం చైనా దిగుమతులపై అమెరికా అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశం కూడా ఉంది. 2024లో చైనా.. అమెరికాకు $463 బిలియన్ల విలువైన వస్తువులు, సేవలు ఎగుమతి చేసింది. ఈ సంఖ్యతో చైనా, మెక్సికో, కెనడాలకు తరువాత మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఇదే సమయంలో అమెరికా నుంచి చైనాకు ఎగుమతులు $199 బిలియన్లు మాత్రమే ఉన్నాయి.
ప్రధాన ఎగుమతి-దిగుమతి ఉత్పత్తులు:
అమెరికా నుంచి చైనా కు: సోయాబీన్స్, విమానాలు, ఔషధాలు, సెమీకండక్టర్లు
చైనా నుంచి అమెరికా కు: మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బొమ్మలు, దుస్తులు
ట్రంప్ నిర్ణయం మార్కెట్లపై ప్రభావం ఎలా
ట్రంప్ వాణిజ్య విధానాలు మార్కెట్లలో అస్థిరతను పెంచుతున్నాయి. చైనా మీద సుంకాలు పెంచిన వెంటనే, ట్రంప్ అనూహ్యంగా ఇతర దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. దీని వల్ల పెట్టుబడిదారుల్లో సంకేతాలు గందరగోళంగా మారాయి. ట్రంప్ "పాజ్" ప్రకటన తర్వాత అమెరికా S&P 500 సూచిక ఒక్క రోజులోనే 9.5 శాతం పెరిగింది. ఇది 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అతిపెద్ద రోజు లాభంగా నమోదైంది. యూరప్ లో కూడా STOXX సూచిక అత్యంత వేగంగా పెరిగింది.
ఇవి కూడా చదవండి:
Helicopter Crash: నదిలో కూలిన హెలికాప్టర్..సీఈఓ ఫ్యామిలీ సహా ఆరుగురు మృతి ..
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి
Read More Business News and Latest Telugu News