Keir Starmer: ప్రపంచీకరణ శకం ముగిసినట్టేనని ప్రకటించనున్న యూకే ప్రధాని
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:27 PM
ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో సోమవారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక ప్రకటన చేయనున్నారు. ప్రపంచీకరణ ముగిసినట్టేనని ఆయన ప్రకటిస్తారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య సుంకాల విధింపు నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం కీలక ప్రకటన చేయనున్నారు. గ్లోబలైజేషన్ యుగం ముగిసినట్టు ఆయన తన ప్రసంగంలో పేర్కొంటారని అక్కడి మీడియా చెబుతోంది. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాపాడేందుకు ట్రంప్ ఇతర దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధించిన విషయం తెలిసిందే. తమ దేశ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ ఇతర దేశాలు లాభపడుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంలో కొత్త శకం ఆరంభమైందని యూకే ప్రభుత్వం భావిస్తున్నదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్టు అక్కడి మీడియా పేర్కొంది. అయితే, ట్రంప్ తీవ్ర చర్యలతో మాత్రం బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అంగీకరించట్లేదని పేర్కొన్నారు.
‘‘గ్లోబలైజేషన్ వల్ల సాధారణ ఉద్యోగులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, దీనికి వాణిజ్య యుద్ధాలు పరిష్కారం కాదు. మరో మార్గం ఉందన్న విషయం అర్థం చేసుకోవాలి’’ అని బ్రిటన్ ప్రధాని అన్నట్టు తెలిసింది. ట్రంప్ సుంకాలతో వివిధ దేశాల మధ్య పోటీ తీవ్రమవుతుందని, దేశీయంగా ఉత్పాదకత పెంచుకునేందుకు వివిధ ప్రభుత్వాలు సప్లై సైడ్ సంస్కరణలకు పూనుకుంటాయని స్టార్మర్ అభిప్రాయపడ్డారు.
కాగా, బ్రిటన్ ప్రధానితో హెస్ఎస్‌బీసీ చీఫ్ సర్ మార్క్ టక్కర్ కూడా ఏకీభవించారు. గ్లోబలైజేషన్ శకం ముగిసినట్టేనని అన్నారు. గత నెలలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజీకయ ఉద్రిక్తతలు, ట్రంప్ దుందుడుకు వాణిజ్య విధానాల కారణంగా ప్రపంచం దేశాలు బలమైన వాణిజ్య సంబంధాలున్న ప్రాంతీయ కూటములుగా విడిపోతాయని తెలిపారు.
తమ ఉత్పత్తులపై భారీ సుంకాల విధించే దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు 10 శాతం కనీస సుంకాన్ని కూడా విధించారు. ‘‘మినహాయింపులు కోరుతూ నాకు ఫోన్ చేయబోయే విదేశీ ప్రధానులు, అధ్యక్షులు, రాయబారులకు నేను చెప్పేది ఒక్కటే.. ముందు మీరు మా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించండి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా పరిశ్రమలు పునరుజ్జీవనం చెందిన రోజుగా ఏప్రిల్ 2 చరిత్రలో నిలిచిపోతుందని కూడా వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ తీరుతో మండిపడ్డ ఐరోపా సమాఖ్య ప్రతీకార సుంకాలకు పూనుకోగా యూకే మాత్రం ప్రాప్తకాలజ్ఞతతో ముందుకెళుతోంది.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News