ఛీ నువ్వుసలు తల్లివేనా.. డబ్బుల కోసం ఇలాంటి పనా..
ABN , Publish Date - Apr 01 , 2025 | 07:53 AM
Brazilian news: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నెలల బిడ్డను అమ్మేసింది. కేవలం వంటల కోర్సు కోసం డబ్బులు లేవన్న కారణంతో ఆ పని చేసింది. ఐస్‌క్రీమ్ షాపు మహిళ ఆ బాబును కొంది.

దేవుడి సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదని అంటారు. అలాంటి తల్లి ప్రేమలే కొన్ని సార్లు కల్తీగా మారిపోతున్నాయి. తమ అవసరాల కోసం కొందరు తల్లులు బిడ్డల్ని బలి చేస్తున్నారు. తాజాగా, ఓ తల్లి తన నెలల బిడ్డను అమ్మకానికి పెట్టింది. వంటల కోర్సు నేర్చుకోవడానికి డబ్బులు లేకపోవటంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని గోయానియాలో ఆలస్యగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని గోయానియా సిటీకి చెందిన 27 ఏళ్ల మహిళ నెల రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. సదరు మహిళ కాన్పు తర్వాతినుంచి పోస్టుపార్టమ్ డిప్రెషన్‌తో బాధపడుతోంది.
పిల్లాడిని పెంచటం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. కుకింగ్ కోర్సు నేర్చుకోవడానికి డబ్బులు అవసరం అవ్వటంతో.. అడ్డుగా ఉన్న పిల్లాడిని అమ్మేయాలని అనుకుంది. తన ప్రియుడికి ఈ విషయం చెప్పింది. ఆ ప్రియుడు పిల్లాడి తండ్రికాకపోవడంతో అభ్యంతరం చెప్పలేదు. స్థానికంగా ఉండే మహిళతో అతడు డీల్ మాట్లాడాడు. ఆ మహిళకు ఐస్‌క్రీమ్ షాపు ఉంది. ఆమెకు పిల్లలు లేకపోవటంతో ఎవరినైనా దత్తత తీసుకుందామని అనుకుంటోంది. రెండు, మూడు సార్లు అనాథ పిల్లలను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. కానీ, లాభం లేకుండా పోయింది. దీంతో ఆమె చంటిబిడ్డను కొనడానికి ఒప్పుకుంది. వాట్సాప్ ద్వారా డీల్ మొత్తం ఫైనల్ అయింది.
‘మగ పిల్లవాడు అయితే బాగుంటుంది. అతడు నల్లజాతి వాడైతే ఇంకా బాగుంటుంది’ అని ఆ మహిళ అంది. ఒప్పందం ప్రకారం బిడ్డను ఆమెకు అమ్మేశారు. ఎలా తెలిసిందో కానీ, పోలీసులకు విషయం తెలిసింది. ఐస్‌క్రీమ్ షాపులో పిల్లాడు ఉండగా పోలీసులు అక్కడికి వెళ్లారు. పిల్లాడి గురించి ఆరా తీశారు. తాను తల్లిని కాదని, బేబీ సిట్టర్‌ను మాత్రమేనని ఆ మహిళ అబద్ధం చెప్పింది. పోలీసులు పిల్లాడిని స్వాధీనం చేసుకున్నారు. పిల్లాడి తల్లిని విచారించగా నిజం ఒప్పుకుంది. జరిగిందంతా చెప్పింది. డబ్బుల కోసమే బిడ్డను అమ్మేసినట్లు తెలిపింది. వచ్చిన డబ్బులతో కుకింగ్ కోర్సులో చేరదామని అనుకున్నట్లు పేర్కొంది. ఆమెకు పిల్లాడిని పెంచుకోవటం ఇష్టం లేకపోవటంతో ఎవరికైనా దత్తత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి:
Viral Video:ఎంత జలసీగా ఫీల్ అయితే మాత్రం.. కండలూడేలా కొరకాలా..
Chandrababu Model Village: ఇది నారా వారి ఊరు