Rekha Gupta: ఢిల్లీ సీఎం ఎవరో ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి.కామ్
ABN, Publish Date - Feb 19 , 2025 | 09:23 PM
ఢిల్లీ సీఎం ఎవరో ఆంధ్రజ్యోతి.కామ్ ముందే చెప్పింది. షాలీమర్ బాగ్ ఎమ్మెల్యే రేఖాగుప్తాను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన పలు కథనాలను ప్రచురించింది. బీజేపీ శాసనసభపక్షం సమావేశమై ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠ వీడింది. షాలీమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెను సీఎంగా ఎన్నుకోగా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ సింగ్ వర్మను ప్రతిపాదించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి8వ తేదీన విడుదలైనప్పటి నుంచి ఢిల్లీ సీఎం ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహిళను సీఎంగా చేయాలని బీజేపీ భావిస్తే సుష్మా స్వరాజ్ కుమార్తెను తెరపైకి తీసుకురావచ్చనే ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వైశ్య సామాజికవర్గానికి చెందిన రేఖాగుప్తాను బీజేపీ ఢిల్లీ సీఎంగా ఎంపికచేసింది. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడా మహిళా సీఎంలు లేరు. దీంతో బీజేపీ ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిని ఎంపికచేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ మహిళలకు పదవుల విషయంలో బీజేపీ వెనుకడుగు వేస్తుందంటూ విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. మహిళలపై బీజేపీకి ఎటువంటి ప్రేమ లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంగా మహిళను బీజేపీ ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది.
ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి.కామ్
ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తాను ఎంపిక చేస్తారంటూ ఆంధ్రజ్యోతి.కామ్ ముందుగానే అంచనా వేసింది. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి వరుస కథనాలను ప్రచురించింది. కార్పొరేటర్ టు సీఎం అంటూ రేఖాగుప్తా వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతుందంటూ ఆంధ్రజ్యోతి.కామ్ వెబ్‌సైట్‌లో కథనాన్ని ప్రచురించింది. రేఖాగుప్తాను సీఎంగా చేయడానికి గల కారణాలను కథనంలో పేర్కొంది. షాలీమార్ బాగ్‌నుంచి 2022లో కార్పొరేటర్‌గా గెలిచిన రేఖాగుప్తా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. మూడోసారి షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి.. రెండుసార్లు తనను ఓడించిన ఆప్ అభ్యర్థి బందనా కుమారిని 20వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
కామన్ మ్యాన్..
ఆప్ కామన్ మ్యాన్ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ ప్రజలను ఆకర్షించింది. దీంతో 2013 నుంచి 2025 వరకు ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఆశీర్వదించారు. తాజాగా ఢిల్లీ సీఎంగా బీజేపీ కామన్ మ్యాన్‌ను ప్రకటించింది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండటంతో పాటు ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘంలో పనిచేయడంతో పాటు విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో రేఖాగుప్తాకు సామాన్య ప్రజల కష్ట, సుఖాల గురించి బాగా తెలుసు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవంతో పాటు బీజేపీ అధిష్టానంతోనూ, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలతో మంచి సంబంధాలు ఉండటం ఆమెకు కలిసొచ్చింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Feb 19 , 2025 | 09:23 PM