AICC Convention: మతపరమైన విభజనలతో ప్రజా సమస్యలు బేఖాతరు.. బీజేపీపై ఏఐసీసీ సదస్సులో ఖర్గే
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:27 PM
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య ఉన్న సత్సంబంధాలను వక్రీకరించడంతో పాటు అనేక మంది జాతి హీరోలను కించపరచేలా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ (BJP)పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకు ''మతపరమైన విభజన''లకు బీజేపీ పాల్పడుతోందని అన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య ఉన్న సత్సంబంధాలను వక్రీకరించడంతో పాటు అనేక మంది జాతి హీరోలను కించపరచేలా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశం కోసం 140 ఏళ్లుగా పోరాటం సాగిస్తూ, సేవలందిస్తు్న్న విశిష్ట చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తప్పుపట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేనివారు, చెప్పుకునేందుకు ఎలాంటి విజయాలు సాధించని వారే ఈ పనులకు పాల్పడుతున్నారని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారంనాడు జరిగిన 84వ ఏఐసీసీ జాతీయ సదస్సు, సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే అన్నారు.
MK Stalin: గవర్నర్లపై సుప్రీం తీర్పు అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయం
నెహ్రూ, పటేల్ ఒకే నాణానికి రెండు ముఖాలు
సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూల మధ్య ఎంతో గొప్ప సత్సంబంధాలు ఉండేవని, ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివారని ఖర్గే చెప్పారు. అయితే ఈ ఇద్దరికీ పడేది కాదంటూ కొందరు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పటేల్, నెహ్రూ మధ్య ఉన్న సత్సంబంధాలను చాటే ఎన్నో ఘటనలు, డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. సర్దార్ పటేల్ 1937లో గుజరాత్ విద్యాపీఠ్‌లో చేసిన ప్రసంగం ఇందుకో ఉదాహరణ అని చెప్పారు. పటేల్ పట్ల నెహ్రూకు ఎంతో గౌరవం ఉండేదని, ఆయన సలహా తీసుకునేందుకు స్వయంగా పటేల్ ఇంటికి వెళ్లేవారి, పటేల్ సౌలభ్యం కోసం ఆయన ఇంట్లో సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించారని ఖర్గే చెప్పారు.
ఆర్ఎస్ఎస్‌కు పటేల్ వ్యతిరేకం
ఆర్ఎస్ఎస్‌పై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ, సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకమని, ఆ సంస్థపై ఆయన నిషేధం కూడా విధించారని గుర్తుచేశారు. పటేల్ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి పూర్తి విరుద్ధమని అన్నారు. అయితే ఇప్పుడు ఆ సంస్థకు చెందిన కొందరు పటేల్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడం నవ్వుపుట్టిస్తోందన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను రాజ్యంగ సభ సభ్యుని చేయడంలో గాంధీ, పటేల్ పాత్ర కీలకమని అన్నారు.
మహనీయుల గడ్డ గుజరాత్
గుజరాత్ పుట్టిన మహనీయులు ఎందరో కాంగ్రెస్ పేరును ప్రపంచానికి చాటారని ఖర్గే కొనియాడారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి ఈ ఏడాదితో వందేళ్లయిందని తెలిపారు. 1924 డిసెంబర్‌లో కర్ణాటకలో జరిగిన బెళగవి కాంగ్రెస్ సదస్సులో మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని చెప్పారు. గుజరాత్ నుంచే దాదాబాయ్ నౌరోజీ, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖులంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారని గుర్తుచేశారు. ఈ ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంత్సుత్సవాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుకోనుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుంటే రాజ్యాంగ రూపకల్పన జరిగి ఉండేది కాదని 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చేసిన చివరి ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారని ఖర్గే గుర్తుచేసారు. రాజ్యాంగం రూపొందించినప్పుడు గాంధీజీ, నెహ్రూ, డాక్టర్ అంబేడ్కర్‌ను ఆర్ఎస్ఎస్ విమర్శించిందని, వారి దిష్టిబొమ్మలను రామ్‌లీలా మైదాన్‌లో దగ్ధం చేసిందని అన్నారు. రాజ్యాంగం మనువాద సిద్ధాంతాల నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందలేదని స్పష్టం చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంటులోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను తరలించడం ద్వారా వారిని అమానపరిచిందని ఖర్గే విమర్శించారు. అంబేద్కర్ పేరును జపించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మలదాకా స్వర్గ ప్రాప్తి లభించేందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో అవమానకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని, రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసునని స్పష్టం చేశారు. పటేల్ ఆలోచనను, సిద్ధాంతాలను, వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ఆ ఆలోచనతోనే సర్దార్ పటేల్ మ్యూజియంలో సీడబ్ల్యూసీ సదస్సు ఏర్పాటు చేశామని, ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు
Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
For National News And Telugu News