Ayodhya: అయోధ్యలో అపురూప ఘట్టం
ABN, Publish Date - Jan 12 , 2025 | 05:33 AM
భారీగా తరలి వచ్చిన భక్తజనసందోహం మధ్య అయోధ్యలోని రామమందిరం తొలి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఘనంగా రామమందిరం తొలి వార్షికోత్సవాలు
ప్రారంభించిన యూపీ సీఎం
నేడు, రేపూ వేడుకలు.. భారీగా భక్తుల రాక
దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
అయోధ్య, జనవరి 11: భారీగా తరలి వచ్చిన భక్తజనసందోహం మధ్య అయోధ్యలోని రామమందిరం తొలి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకలను ప్రారంభించారు. బాలరాముడి విగ్రహానికి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యజుర్వేద పారాయణంతో వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పూలు, విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. తొలిరోజు ఆలయ సముదాయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామ మంత్ర జపంతో పాటు రామ రక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలి వస్తుండటంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను సాధారణ ప్రజలు తిలకించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. 110 మంది వీఐపీలను కూడా ఆహ్వానించారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న 2 లక్షల మందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఆలయాన్ని నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. కాగా అయోధ్య రామమందిరం తొలి వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
22కు బదులు 11నే ఎందుకంటే...
గతేడాది జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ కేలండర్ ప్రకారం పుష్య మాసంలో శుక్ల పక్ష ద్వాదశి నాడు (జనవరి 22) ఈ పవిత్రమైన కార్యక్రమం నిర్వహించారు. దీన్ని కూర్మ ద్వాదశిగా కూడా పిలుస్తారు. అయితే ఈ ఏడాది శుక్ల పక్ష ద్వాదశి ముందుగానే జనవరి 11న వచ్చింది. దీని ప్రకారం రామాలయం తొలి వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు.
Updated Date - Jan 12 , 2025 | 05:33 AM