Share News

మహానుభావుడు.. మండుటెండల్లో రగ్గులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 09 , 2025 | 02:40 PM

సాయం చేయాలనుకుంటే.. సమయం, సందర్భం, అవసరం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే మంచి పని చేసినా నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా బీజేపీ మినిస్టర్ ఒకరికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..

మహానుభావుడు.. మండుటెండల్లో రగ్గులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Surendra Mehta Rug Distribution

పట్నా: దేశంలో ఎండలు మండిపోతున్నాయి.. పలు నగరాల్లో 42 డిగ్రీలకు పైగా ఎండ కాస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు రాష్ట్రాలు, నగరాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేయడమే కాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం చాలా మంది చల్లని తాగు నీరు, అంబలి, మజ్జిగ వంటి వాటిని పంచుతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎమ్మెల్యే మాత్రం అందరికి భిన్నంగా ఉండాలని ఆలోచించి.. విమర్శల పాలయ్యాడు. ఆ వివరాలు..


40 డిగ్రీల మండుటెండల్లో.. రగ్గులు పంపణీ చేసి వార్తల్లో నిలిచాడు ఓ ఎమ్మెల్యే. ఇందుకు సంబంధంచిన వీడియో తెగ వైరల్ కావడంతో.. నెటిజనులు, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సురేంద్ర మెహతా.. మండుటెండల్లో.. పేదలకు రగ్గులు పంపిణీ చేసి వార్తల్లో నిలిచాడు. బఛ్వారా అసెంబ్లీ నియోజకవర్గంలోని అహియాపూర్ గ్రామంలోని సుమారు 500 మంది పేదలకు రగ్గులు పంచి వార్తల్లో నిలిచాడు.


బీజేపీ 46వ సంస్థాపన దినోత్సవం సందర్భంగా సురేంద్ర మెహతా ఈ కార్యక్రమం చేపట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. భారీ ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినట్లు తెలుస్తోంది. మీటింగ్‌కు వచ్చిన వందలాది మందికి మినిస్టర్ మెహతా, బీజేపీ కార్యకర్తలు రగ్గులు పంచారు.

అయితే వారు మంచి ఉద్దేశంతో చేసినా సరే.. ఇది సరైన సమయం కాకపోవడంతో.. నెటిజనులు విమర్శలు చేస్తున్నారు. మండుటెండల్లో రగ్గులు ఎవడు కప్పుకుంటారు సార్.. మీకి ఆలోచన ఎలా వచ్చింది.. మీ తెలివికి జోహార్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.


సురేంద్ర మెహతా చేసిన పనిపై విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఇది ఓ రాజకీయ స్టంట్ అని జనాలకు కూడా అర్థం అయ్యింది. ప్రజలను పిచ్చి వాళ్లని చేద్దామని భావించి.. మీరే ఫుల్స్ అయ్యారు. ఇంత లాజిక్‌లెస్‌గా ఎలా ఉన్నారంటూ సీపీఐ నేత ఒకరు దుమ్మెత్తి పోశాడు. సురేంద్ర మెహతా.. రగ్గుల పంపిణీ బదులు.. రాష్ట్రంలో ప్లేగ్రౌండ్స్, క్రీడా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తే బాగుండేది అంటూ విమర్శలు చేశాడు.


ఇవి కూడా చదవండి:

Mumbai Dubai in 2 hours: ముంబై టూ దుబాయ్.. 2 గంటల్లోనే.. ఎలా సాధ్యమంటే

Super Rat: అమాయక పౌరులను రక్షించి.. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఎలుక..

Updated Date - Apr 09 , 2025 | 02:43 PM