Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:24 AM

దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. గత 12 సంవత్సరాలుగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ మరోసారి రిక్త హస్తాలతో మిగిలిపోయింది.

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
Delhi CM

దాదాపు 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించింది (Delhi Elecion Results). తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) 48 సీట్లు గెలుచుకుంది. గత 12 సంవత్సరాలుగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ మరోసారి రిక్త హస్తాలతో మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అధికార పీఠం బీజేపీకి దక్కింది. 1991 రాజ్యాంగ సవరణ ప్రకారం ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధించింది (Delhi CM).


ఢిల్లీలో 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మదన్ లాల్ ఖురానా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఆయన ఢిల్లీకి తొలి ముఖ్యమంత్రి. అయితే 1995లో సంచలనం సృష్టించిన హవాలా కుంభకోణంలో ఖురానా పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. పార్టీ అధిష్టానం సూచన మేరకు 27 నెలల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మను బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. తాజా ఎన్నికల్లో కేజ్రివాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ తండ్రే ఈ సాహిబ్ సింగ్ వర్మ.


సాహిబ్ సింగ్ వర్మ 31 నెలల పాటు ఢిల్లీని పాలించారు. 1998లో ఉల్లిపాయల ధర కిలోకు రూ. 60కి పెరగడంతో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ మూడో ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ వచ్చారు. ఆమె ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి. ఆమె పదవి స్వీకరించిన 52 రోజల తర్వాత 1998లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. దీంతో సుష్మా స్వరాజ్ పదవీకాలం 52 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాతి నుంచి అధికారానికి బీజేపీ దూరంగా ఉండిపోయింది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 09 , 2025 | 11:24 AM