Madhya Pradesh: గొంతు కోసినా.. మేకులా బతికింది
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:25 AM
ఆడపిల్ల ఇంటికి భారమని పురుట్లోనే చంపేసే ఎన్నో ఘటనలు చూశాం. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌గడ్‌కు చెందిన ఓ తల్లి తన నెల వయస్సున్న పసిపాప గొంతుకోసింది.

నెల రోజులు శ్రమించి బాలికకు ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యులు
భోపాల్, ఫిబ్రవరి 15: ఆడపిల్ల ఇంటికి భారమని పురుట్లోనే చంపేసే ఎన్నో ఘటనలు చూశాం. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌గడ్‌కు చెందిన ఓ తల్లి తన నెల వయస్సున్న పసిపాప గొంతుకోసింది. రక్తం ధారగా కారుతున్న పసిగుడ్డును ఆ తర్వాత చెత్త కుండీలో పడేసింది. ఈ పాపంలో ఆ కఠినాత్మురాలి తల్లి కూడా పాలుపంచుకొంది. జనవరి 11న రక్తం మడుగులో ఉన్న ఆ పాపను చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను 100 కి.మీ.దూరంలోని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయానికి ఆమె గొంతు నుంచి రక్తం కారుతునే ఉంది.
ఆమెకు చుట్టిన బట్ట కూడా రక్తంతో తడిచి ఎర్రగా మారింది. సత్వర వైద్యం అందించిన వైద్యులు పలు ఆపరేషన్లు చేశారు. తెగిన శిరలు, ధమనులు, నరాలు, ఇతర భాగాలను తిరిగి అతికించి కాపాడారు. ప్రభుత్వం నిర్వహించే శరణాలయానికి అప్పగించారు. సీసీటీవీ కెమేరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు పసిపాప తల్లి, అమ్మమ్మలను గుర్తించి అరెస్టు చేశారు. కాగా, బాలికకు శరణాలయంలోనే ‘పిహు’ అని నామకరణం చేశారు.