LPG Price and Fuel Tax Hike: వంట గ్యాస్‌ మంట

ABN, Publish Date - Apr 08 , 2025 | 04:26 AM

కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. అలాగే, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచింది

LPG Price and Fuel Tax Hike: వంట గ్యాస్‌ మంట
LPG Price Hike

గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంపు

ఉజ్వల వినియోగదారులకూ వర్తింపు

నేటి నుంచి అమల్లోకి

హైదరాబాద్‌లో 905కి చేరనున్న ధర

లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై

రూ.2 చొప్పున ఎక్సైజ్‌ సుంకం పెంపు

వినియోగదారులపై భారం పడదు

ఎక్సైజ్‌ సుంకం పెంపుతో

సర్కారుకు రూ.32,000 కోట్లు

అంతర్జాతీయ మార్కెట్‌ ధరను బట్టి

గ్యాస్‌ ధర పెంచామన్న కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధ రను సోమవారం ఏకంగా రూ.50 మేర పెంచింది. ఈ పెంపు సాధారణ వినియోగదారులకేకాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుంది. కొత్త ధరలు మంగళవారం (8వ తేదీ) నుంచి అమల్లోకి వస్తాయని చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. తాజా పెంపుతో ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్‌కు రూ.853 చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం సాధారణ వినియోగదారులు సిలిండర్‌కు రూ.855 చెల్లిస్తుండగా.. పెరిగిన ధరతో ఇది రూ.905 అవుతుంది. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌లో 19 లక్షలు, ఉమ్మడి రంగారెడ్డిలో 12-13 లక్షల మంది గృహ ఎల్‌పీజీ వినియోగదారులున్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. అయితే ఈ పెంపు భారం వాహనదారులపై పడదని, ఇంధనాల రిటైల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఆయిల్‌ కంపెనీలు పేర్కొన్నాయి. మన దేశంలో వార్షికంగా 16,000 కోట్ల లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఈ ఇంధనాలపై రూ.2 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడం వల్ల కేంద్ర ఖజానాకు రూ.32,000 కోట్ల వరకు సమకూరనుంది. పెంచిన ఎక్సైజ్‌ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి.


ఎక్సైజ్‌ సుంకం పెంపుతో నష్టాల భర్తీ

ఎల్‌పీజీ ధరల నిర్ణయానికి వినియోగించే అంతర్జాతీయ బెంచ్‌ మార్క్‌ అయిన సౌదీ సీపీ సగటు 2023 జూలైలో టన్నుకు 385 డాలర్లు ఉండగా.. 2025 ఫిబ్రవరిలో 629 డాలర్లకు పెరిగిందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. 63 శాతం మేర పెరుగుదల నమోదైన ఫలితంగా ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధరను రూ.1,028.50గా నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడినట్టు చెప్పారు. కానీ ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలను సర్దుబాటు చేస్తున్నాయని తెలిపారు. ఎల్‌పీజీని తక్కువ ధరకు విక్రయించడం వల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు రూ.41,338 కోట్ల నష్టాన్ని చవిచూశాయని చెప్పారు. నష్టాలు కొండలా పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలను మోస్తరుగా పెంచినట్టు తెలిపారు. ప్రస్తుత ధరల వద్ద ఉజ్వల వినియోగదారుల వంటకు రోజుకు అయ్యే వ్యయం రూ.6.10 ఉండగా.. సాధారణ వినియోగదారులకైతే రూ.14.58 ఉంటోందని, ఇది సహేతుకమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెలా రేట్లను సమీక్షిస్తామని, తగ్గితే వినియోగదారులకు బదిలీ చేస్తామని తెలిపారు. సిలిండర్‌పై పెంచిన రూ.50 ఇంతకుముందటి, భావి వ్యయాలను మాత్రమే కవర్‌ చేస్తాయన్న ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఆయిల్‌ మంత్రిత్వ శాఖ బడ్జెటరీ మద్దతును కోరుతుందని ఆయన చెప్పారు. ఎక్సైజ్‌ సుంకం పెంపుతో సమకూరే అదనపు మొత్తాన్ని ఆయిల్‌ కంపెనీల నష్టాలను భర్తీ చేసేందుకు వినియోగించనున్నట్టు తెలిపారు.


15 నెలల్లో 9సార్లు పెంపు

11 ఏళ్ల మోదీ సర్కారు హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పుడల్లా ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచిన సందర్భాలున్నాయి. 2014 నవంబరు నుంచి 2016 జనవరి వరకు పెట్రోల్‌, డీజిల్‌పై తొమ్మిదిసార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు కలిగే ప్రయోజనాన్ని ప్రభుత్వమే పొందినట్టయింది. ఈ 15 నెలల్లో లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.11.77, డీజిల్‌పై రూ.13.47 పెంచారు. దీంతో 2014-15లో రూ.99,000 కోట్లుగా ఉన్న ఎక్సైజ్‌ ఆదాయం 2016-17లో ఏకంగా రెండింతలకు పైగా పెరిగి రూ.2,42,000 కోట్లకు చేరింది. అయితే కేంద్రం 2017 అక్టోబరులో ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.2, ఏడాది తర్వాత రూ.1.50మేర తగ్గించింది. కానీ 2019 జూలైలో లీటరుపై రూ.2 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. తర్వాత 2020 మార్చిలో లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచింది. 2020 మార్చి, 2020 మే మధ్య లీటరు పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 మేర పెంచింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం గత ఏడాదిలో లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.2 చొప్పున తగ్గించింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తాజాగా ముడిచమురు ధరలు దిగివస్తున్నా కేంద్రం మాత్రం ధరలను తగ్గించకపోవడంతో వాహనదారులకు ఊరట లభించడం లేదని పరిశీలకులు అంటున్నారు. కాగా, ఇంద్రప్రస్థా గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) సీఎన్‌జీ ధరలను పెంచింది. ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.1మేర పెరగడంతో రూ.76.09కి చేరుకుంది.


పుండు మీద కారం చల్లినట్టుగా..: ఖర్గే

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను కేంద్రం పెంచడం పట్ల కాంగ్రెస్‌ మండిపడింది. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలడంతో కలిగిన నష్టాలతో సంతృప్తి చెందకపోగా.. పుండు మీద కారం పూసినట్టుగా తాజా నిర్ణయం ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. ‘‘వాహ్‌ మోదీ వాహ్‌!! 2014 మేతో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్‌ ధరలు 41% మేర తగ్గాయి. ఇలాంటి తరుణంలో మీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించడానికి బదులు రూ.2 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. టారిఫ్‌ విధానంపై కుంభకర్ణుడి మాదిరిగా నిద్రపోవడం వల్ల ఒక్కసారిగా స్టాక్‌ మార్కెట్లో చిన్నా, పెద్దా ఇన్వెస్టర్లు రూ.19 లక్షల కోట్లు నష్టపోయినా సంతృప్తి చెందక.. మీ ప్రభుత్వం పుండుమీద కారం చల్లింది’’ అని మండిపడ్డారు. చివరకు ప్రధాని మోదీ ఎక్సైజ్‌ సుంకం పెంపుతో టారిఫ్ లకు తగిన సమాధానమిచ్చారని రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 07:42 AM