IndiGo Flight: ఇండిగో విమానంలో బంగారం చోరీ.. మహిళా సిబ్బందిపై అనుమానం
ABN , Publish Date - Apr 07 , 2025 | 08:02 AM
ఇండిగో విమాన సిబ్బందిపై దొంగతనం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇండిగో మహిళా సిబ్బంది ఒకరు ఐదేళ్ల వయసున్న చిన్నారి మెడలోంచి బంగారు నెక్లెస్ దొంగిలించదనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు: విమానయానానికి సంబంధించి ఎక్కువగా వినిపించే ఫిర్యాదులు.. సమయపాలన లేకపోవడం, సిబ్బంది తీరు సరిగా లేకపోవడం.. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులే సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించడం వంటి ఘటనలు చూస్తాం. కానీ తాజాగా ఇందుకు భిన్నమైన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. విమాన సిబ్బంది మీద దొంగతనం ఆరోపణలు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు..
తిరువనంతపురం నుంచి బెంగళూరు వస్తోన్న ఇండిగో విమానంలో ఈ దొంగతనం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారి మెడలో ఉన్న 2 తులాల బంగారు నెక్లెస్ మాయమయ్యింది. అయితే ఇండిగో మహిళా సిబ్బందే నెక్లెస్ దొంగతనం చేసిందంటూ బాలిక తల్లి ఆరోపించింది. ఆమె తెలిపిన దాని వివరాల ప్రకారం.. ప్రియాంక ముఖర్జీ అనే మహిళ.. తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని.. ఏప్రిల్ 1న ఇండిగో విమానం ఎక్కింది. ఆమె తిరువనంతపురం నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. ప్రయాణం మొదలైన కాపేటికే ప్రియాంక ఇద్దరు కుమార్తెలు గొడవపడటం మొదలు పెట్టారు.
ఐదేళ్లు, రెండేళ్ల వయసున్న చిన్నారులు కావడతో వారిని సమూదాయించడం ప్రియాంక వల్ల కాలేదు. చిన్నారుల గొడవ గమనించి క్యాబిన్ క్రూ మహిళా సిబ్బంది ఒకరు ప్రియాంక దగ్గరకు వచ్చి.. తాను గొడవ సద్దుమణిగేలా చూస్తానని చెప్పింది. అందుకోసం ప్రియాంక పెద్ద కుమార్తె(5)ను తీసుకుని.. విమానంలో ఓ పక్కకు వెళ్లి.. ఆ చిన్నారిని సముదాయించింది. ఈలోపు ప్రియాంక చిన్న బిడ్డను ఊరుకోబెట్టింది.
ఆతర్వాత ప్రియాంక పెద్ద కుమార్తె తల్లి దగ్గరకు వచ్చి కూర్చుంది. అనంతరం వారు బెంగళూరులో దిగారు. ఆసయమంలో తన పెద్ద బిడ్డ మెడలో ఉండాల్సిన రెండు తులాల బంగారు నెక్లెస్ మాయం అయినట్లు ప్రియాంక గమనించింది. దాంతో క్యాబిన్ క్రూ సిబ్బంది దగ్గరకు వెళ్లి నెక్లెస్ మిస్సింగ్ గురించి చెప్పి.. వారిని ప్రశ్నించింది. అయితే వారు తమకేం తెలియదన్నారు.
దాంతో ప్రియాంక ముఖర్జీ..కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ స్టేషన్‌లో నెక్లెస్ గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఇండిగో యాజమాన్యం స్పందిస్తూ.. మా ప్రయాణికులు ఒకరు తిరువనంతపురం నుంచి బెంగళూరు ప్రయాణిస్తున్న 6ఈ 661 విమాన సిబ్బందిపై బంగారం చోరిపై ఫిర్యాదు చేశారు. మేం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాము అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Fake Doctor: లండన్ డాక్టర్‌నన్నాడు..ఏడుగురి ప్రాణాలు తీశాడు
నిరాహార దీక్ష విరమించిన రైతు నేత దల్లేవాల్