Madyapradesh: దేశంలోనే మెుదటిసారి వింత ఘటన.. ఆ పని చేసి అరెస్టయిన భిక్షగాడు..
ABN, Publish Date - Jan 27 , 2025 | 11:32 AM
దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త కేసు నమోదు అయ్యింది. భిక్షాటన చేస్తున్న ఓ యాచకుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో భిక్షాటన చేయకూడదనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భిక్షగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

మధ్యప్రదేశ్: భిక్షాటన చేసినందుకు దేశంలోనే తొలిసారిగా ఓ యాచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో చోటు చేసుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "మధ్యప్రదేశ్ యాచక నిరోధక చట్టం" తీసుకువచ్చింది. ఈ చట్టం కింద రాష్ట్రంలో ఎవరూ భిక్షాటన చేయెుద్దంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు.
కాగా, ఇవాళ (సోమవారం) ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి భోపాల్‌లోని బోర్డ్ ఆఫీస్ సిగ్నల్ వద్ద ఆగాడు. అక్కడికి వచ్చిన యాచకుడు భిక్షం వేయాలంటూ సదరు వ్యక్తిని అడిగాడు. అయితే డబ్బులు అడగడం ఎందుకు.. ఏదైనా పని చేసుకుని బతకవచ్చు కదా అని బైకర్ చెప్పాడు. తాను కేవలం భిక్షమెత్తుకోవడం ద్వారానే జీవిస్తానని, సంపాదించేందుకు వేరేమార్గాలు తెలియవంటూ సమాధానం చెప్పాడు బెగ్గర్. ఈ నేపథ్యంలో వారి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. రోజూ భిక్షగాళ్లతో విసుగుచెందిన ఆ వ్యక్తి ఎంపీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీనిపై మధ్యప్రదేశ్ యాచక నిరోధక చట్టం కింద భిక్షగాడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జోన్-2 డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. నగరవ్యాప్తంగా ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్లలా కనిపించని వ్యక్తులు సైతం యాచిస్తున్నట్లు తమకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన తెలిపారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని అగర్వాల్ చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్ యాచక నిరోధక చట్టం కింద దేశంలో తొలిసారి అరెస్టయిన వ్యక్తిగా ఆ యాచకుడు నిలిచాడు.
Updated Date - Jan 27 , 2025 | 11:37 AM