Share News

ఈయన మామూలోడు కాదు.. లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో 10 కోట్లు కొట్టేశాడు..

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:29 AM

10 Crore Gold Loan Case: లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో ఓ బ్యాంకు మేనేజర్ కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఏకంగా 10 కోట్లు దోచేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. అతడితో పాటు అతడికి సాయం చేసిన ఓ మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈయన మామూలోడు కాదు.. లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో 10 కోట్లు కొట్టేశాడు..
10 Crore Gold Loan Case

దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో హీరో భాస్కర్.. ఫ్యామిలీని ఆర్థిక ఇబ్బందులనుంచి బయటపడేయడానికి బ్యాంకులో మోసానికి పాల్పడతాడు. పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసి, తన అవసరాలకు వాడుకుని మళ్లీ బ్యాంకులోనే పెట్టేస్తుంటాడు. ఇది సినిమా కాబట్టి.. హీరో దొరకకుండా తప్పించుకుని చివరకు కోటీశ్వరుడు అయిపోతాడు. తర్వాత అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవుతాడు. కానీ, నిజజీవితంలో అలా జరగదు కదా.. లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో బ్యాంకులో మోసానికి పాల్పడ్డ ఓ బ్యాంకు మేనేజర్ దాదాపు 10 కోట్ల రూపాయలు కొట్టేశాడు. అయితే, కథ అడ్డం తిరిగి అడ్డంగా బుక్ అయిపోయాడు.


ఈ సంఘటన కర్ణాటకలోని రాయచూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం, రాయచూరులోని మహారాష్ట్ర బ్యాంకులో మేనేజర్‌గా పని చేసేవాడు. ఏం బుద్ధిపుట్టిందో ఏమో తెలీదు కానీ, 2022 నుంచి 2025 వరకు బ్యాంకులో మోసాలకు పాల్పడ్డాడు. ఆ బ్యాంకులో ఏకంగా 105 ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు. నకిలీ బంగారం పెట్టి లోన్లు తీసుకున్నాడు. ఆ డబ్బుల్ని 29 అకౌంట్లకు పంపించుకున్నాడు. అంతటితో ఇతడి అరాచకాలు ఆగలేదు. నిజమైన బంగారం పెట్టి లోన్లు తీసుకున్న వారిని కూడా మోసం చేశాడు. వారి దగ్గరినుంచి ఏకంగా 10.9 కోట్ల రూపాయలు దోచేశాడు. అయితే, బ్యాంకు ఆడిట్ సమయంలో అసలు విషయం బయటపడి దొరికిపోయాడు.


అతడిపై బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. దీంతో పోలీసులు నరేంద్రను అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు కస్టమర్లను మోసం చేయడంలో మరో ఇద్దరు నరేంద్రకు సాయం చేసినట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ బ్యాంకులో పని చేస్తున్న అరుణ దేవికి కూడా ఇందులో సంబంధం ఉన్నట్లు తేలింది. గతంలో ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో కలిసి పని చేసేవారు. ఆ పరిచయం కొద్దీ మోసంలో భాగం అయ్యారు. అయితే, నరేంద్ర మోసం చేసి దోచుకున్న 10 కోట్ల రూపాయల్లో.. అతడి దగ్గరినుంచి కేవలం 78 వేల రూపాయలు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన డబ్బు ఎక్కడ దాచాడు? అసలు ఉంచాడా లేక ఖర్చు పెట్టాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Minister Satya Kumar: హత్యా రాజకీయాల కోసమే జగన్‌ పర్యటన

కేటీపెర్రీ ఎంట్రీ

Updated Date - Apr 09 , 2025 | 11:34 AM