Mayawati: క్షమాపణతో కూల్... మేనల్లుడిని పార్టీలోకి తీసుకున్న మాయావతి
ABN , Publish Date - Apr 13 , 2025 | 09:54 PM
ఆకాష్ ఆనంద్ క్షమాపణలను మాయావతి ఆమోదించారు. నాలుగు వరుస పోస్టుల్లో బహిరంగంగా తన తప్పులను ఆకాష్ ఒప్పుకున్నారని, తన అత్తమామల సలహాలను కాకుండా పార్టీ సీనియర్ల సలహాలను గౌరవిస్తానని, పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తానని వాగ్దానం చేశారని తెలిపారు.

లక్నో: ''తప్పులు చేశాను.. క్షమించండి'' అంటూ తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ (Akash Anand) బహిరంగంగా చేసిన విజ్ఞప్తితో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) మెత్తబడ్డారు. ఆకాష్ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే గతంలో తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబటి తన వారసుడిని ప్రకటించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
Akash Anand: నా తప్పులు మన్నించండి.. మాయావతిని కోరిన ఆకాష్ ఆనంద్
దీనికి ముందు ఆకాష్ ఆనంద్ వరుస ట్వీట్లలో తన తప్పిదాలను మాయావతి క్షమించాలని, తిరిగి పార్టీలోకి తీసుకోవాలని వేడుకున్నారు. మాయావతి తన రాజకీయ గురువని, ఇక నుంచి ఆమె మాట జవదాటనని, ఎవరి సలహాలు తీసుకోనని, పార్టీ సీనియర్లకు విధేయుడుగా ఉంటానని తెలిపారు. మరోసారి పార్టీలో తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
క్షమాపణను ఆమోదించిన అధినేత్రి
ఆకాష్ ఆనంద్ క్షమాపణలను మాయావతి ఆమోదించారు. ''నాలుగు వరుస పోస్టుల్లో బహిరంగంగా తన తప్పులను ఆకాష్ ఒప్పుకున్నారు. తన అత్తమామల సలహాలను కాకుండా పార్టీ సీనియర్ల సలహాలను గౌరవిస్తానని, పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తానని వాగ్దానం చేశారు" అని మాయావతి సైతం వరుస ట్వీట్లలో వెల్లడించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, తాను ఆరోగ్యం ఉన్నంత వరకూ కాన్షీరాం తరహాలోనే పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై కష్టపడి పనిచేస్తానని మాయావతి తెలిపారు. ఈ పరిస్థితుల్లో తన వారసుడిగా మరొకరిని నియమించడమనే ప్రశ్నే లేదని, అందుకు తాను బలంగా కట్టుబడి ఉన్నానని, ఇకముందు కూడా ఉంటానన చెప్పారు.
ఆకాష్ వివాదం ఏమిటి?
మాయావతి సోదరుడైన ఆనంద్ కుమార్ తనయుడే ఆకాష్ ఆనంద్. మాయావతి దగ్గరే పెరిగారు. 2017లో ఆకాష్‌ను తన రాజకీయ వారసుడిగా భావించి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. 2019లో పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా మాయావతి నియమించారు. 2023 డిసెంబర్‌లో ఆయనను తన రాజకీయ వారసుడిగా కూడా మాయావతి ప్రకటించారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఆకాష్ తన మామగారైన అశోక్ సిద్ధార్ధతో కలిసి పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం సాగించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార నిధుల సేకరణ, వ్యూహాలు రూపొందించడం చేశారు. ఈ క్రమంలో మాయావతికి అత్యంత విశ్వసనీయుడని పేరున్న రామ్జీ గౌతమ్ సహా పలువురు నేతలను ఆకాష్ ఆయన మామగారు కలిసి పక్కనపెట్టేశారు. పార్టీలో రెండు గ్రూపులు తయారయ్యాయి. ఒకటి మాయావతికి సన్నిహితులుగా ఉండేవారు, మరొకటి ఆకాశ్ ఆనంద్‌కు సన్నిహితులుగా ఉండేవారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ దారుణంగా చతికిలపడటంతో మాయావతి విధేయులు ఆకాష్ ఆనంద్, అశోక్ సిద్ధార్ధ పాత్ర, పార్టీ నిధుల దుర్వినియోగంపై ఆమెకు వివరించారు. గత ఫిబ్రవరిలో సమీక్షా సమావేశానంతరం పార్టీ నుంచి అశోక్ సిద్ధార్ధను బహిష్కరిస్తూ మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆకాష్ ఆనంద్‌ను సైతం పార్టీ నుంచి బహిష్కరించారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ మరో తనయుడు, మేనల్లుడు అయిన ఇషాన్ ఆనంద్‌ను గత జనవరి 15న తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీలోకి మాయావతి ఆహ్వానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన తప్పులు మన్నించి పార్టీలోకి తీసుకోవాలని, చేసిన తప్పులు తిరిగి చేయనంటూ ఆకాష్ ఆనంద్ ఆదివారంనాడు బహిరంగంగా పార్టీ అధినేత్రిని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి