Share News

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:24 AM

మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న నిందితులు తమకు డ్రగ్స్ కావాలంటూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఆహారం వద్దు.. డ్రగ్స్ కావాలని పట్టుబడుతూ జైలు అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు.

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్
Meerut Navy Employee Case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో.. పోలీసులు మృతుడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న వీరిద్దరూ చిత్రవిచిత్రమైన డిమాండ్లతో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తిండి తిప్పలు మానేసి.. డ్రగ్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నిందితులిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలు కావడంతో.. ప్రస్తుతం జైలులో డ్రగ్స్ లభ్యం కాకపోవడంతో వారు సమస్యలు ఎదుర్కుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు. నిందితులిద్దరిని మీరట్ జిల్లా జైలులో వేర్వేరు బరాక్స్‌లో ఉంచారు అధికారులు.


ఈ సందర్భంగా జైలు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ’నిందితులిద్దరూ మాదక ద్రవ్యాలకు పూర్తిగా అలవాటు పడ్డారు. జైలులో కూడా డ్రగ్స్ కావాలని పట్టుబడుతున్నారు. ఆహారం వద్దు.. డ్రగ్స్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ముస్కాన్ తనకు మార్ఫిన్ ఇంజక్షన్ ఇవ్వాలని కోరుతుండగా, శుక్లా.. తనకు గంజాయి కావాలని డిమాండ్ చేస్తున్నాడు. వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. నిందితులు తమకు తామే హాని చేసుకునే అవకాశం ఉన్నందున వారిని మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాము‘ అని చెప్పుకొచ్చారు.


ముస్కాన్ రస్తోగి, తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి.. భర్త సౌరభ్‌ను అత్యంత క్రూరంగా హత్య చేసింది. మార్చి 4న ఈ దారుణం చోటు చేసుకుంది. సౌరభ్‌ను చంపిన తర్వాత నిందితులు.. అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి.. ఒక డ్రమ్ములో పడేసి.. సిమెంట్‌తో కప్పి పెట్టారు. ఆతర్వాత లవర్స్ ఇద్దరు వెకేషన్ కోసం హిమాచల్ ప్రదేశ్ ట్రిప్పుకు వెళ్లారు. మార్చి 17న మీరట్‌కు తిరిగి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో వీరు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. హోలీ ఆడారు, కేక్ కట్ చేశారు, మంచు కురిసే ప్రాంతాల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు.


పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ముస్కాన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే జైలుకు తరలించిన రోజు రాత్రే ముస్కాన్ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ముస్కాన్ మత్తు పదర్థాలకు బానిసగా మారినట్లు గుర్తించారు. తక్షణమే ఆమెకు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముస్కాన్ తనకు ఆహారం వద్దని.. మార్ఫిన్ ఇంజక్షన్ కావాలని డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితులిద్దరిని జైలులో ఉన్న డీఅడిక్షన్ సెంటర్‌లో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. జైలు వైద్యాధికారులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Navy Officer: భర్తను చంపి, ప్రియుడితో కలిసి సంబరాలు..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 23 , 2025 | 12:10 PM