Share News

Inheritance law: షరియా వద్దు... లౌకిక చట్టం కావాలి

ABN , Publish Date - Jan 29 , 2025 | 02:06 AM

షరియా చట్టం కాకుండా, భారతీయ వారసత్వ చట్టాన్ని వర్తింపజేయాలని కోరుతూ ఓ ముస్లిం మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ముస్లిం అయినప్పటికీ షరియా చట్టంపై విశ్వాసం లేనందున లౌకికవాద చట్టాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

Inheritance law: షరియా వద్దు... లౌకిక చట్టం కావాలి

ముస్లిం చట్టం ప్రకారమైతే మహిళకు వారసత్వ ఆస్తిలో మూడో వంతుపైనే హక్కు

వారసత్వ చట్టమైతే మొత్తం పొందొచ్చు

‘మత విశ్వాసం’ లేకపోవడాన్ని కూడా హక్కుగా గుర్తించాలి

సుప్రీంలో ముస్లిం మహిళ పిటిషన్‌

న్యూఢిల్లీ, జనవరి 28: ముస్లిం పర్సనల్‌ లా విషయమై సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన కేసు నమోదయింది. తనకు షరియా చట్టం కాకుండా, భారతీయ వారసత్వ చట్టాన్ని వర్తింపజేయాలని కోరుతూ ఓ ముస్లిం మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ముస్లిం అయినప్పటికీ షరియా చట్టంపై విశ్వాసం లేనందున లౌకికవాద చట్టాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కేరళలోని అళప్పుజకు చెందిన ‘కేరళ మాజీ ముస్లింలు’ (ఎక్స్‌ ముస్లిం ఆఫ్‌ కేరళ) సంస్థ ప్రధాన కార్యదర్శి సఫియా పి.ఎం. ఈ పిటిషన్‌ వేశారు. మంగళవారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తాను అధికారికంగా ఇస్లాంను విడిచిపెట్టలేదని, కానీ విశ్వాసం లేదని సఫియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘విశ్వాసం లేకపోవడాన్ని’ కూడా మత స్వేచ్ఛగా గుర్తించాలని కోరారు. ముస్లిం పర్సనల్‌ లా అంటే ఇష్టం లేని వారికి భారతీయ వారసత్వ చట్టం-1925 వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. షరియా చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కేవలం మూడో వంతు మాత్రమే మహిళలకు వస్తుందని తెలిపారు.


అదే వారసత్వ చట్టం ప్రకారమయితే తన తండ్రి ఇంకా ఎక్కువ వాటా ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. షరియా చట్టం ప్రకారం ముస్లిం మతం నుంచి బయటకు వస్తే తండ్రి ఆస్తిలో ఎలాంటి వాటా కూడా రాదని తెలిపారు. ఒకవేళ తాను అధికారికంగా ముస్లిం మతం నుంచి బయటకు వస్తే తన ఏకైక కుమార్తెకు ఎలాంటి ఆస్తి దక్కదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఏమి చేయాలన్నదానిపై చట్టంలో నిబంధనలు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. తనకు ఎలాంటి మతం, కులం లేదంటూ అధికారిక ధ్రువ పత్రాలు తీసుకొచ్చినప్పటికీ తన కుమార్తెకు ఆస్తి సంక్రమించే అవకాశంలేదని తెలిపారు. దాంతో భారతీయ వారసత్వ చట్టంలో ముస్లింలకు మినహాయింపులు ఇస్తూ ఉన్న నిబంధనల చెల్లుబాటును సవాలు చేయాల్సిన పరిస్థితి ఎదురయింది. ఆ మేరకు పిటిషన్‌ను సవరించి సమర్పించేందుకు సఫియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేంద్రం తరఫున కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. మే 5తో ప్రారంభమయ్యే వారంలో తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది.


విడాకులు.. మళ్లీ పెళ్లి ఆస్తి చేజారకుండా ముస్లిం జంట ఉపాయం

షరియా చట్టాలను తప్పించుకునేందుకు ఓ ముస్లిం జంట తొలుత విడాకులు తీసుకొని, మళ్లీ వారే వివాహం చేసుకోవడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా జరిగింది. తమ కుమార్తెలకు ఆర్థిక భద్రత కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. న్యాయవాది, నటుడు సి.షుక్కూర్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ ప్రొ ఛాన్సలర్‌ షీనాకు 29 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ముగ్గురూ ఆడపిల్లలే. మగ సంతానం లేదు. షరియా చట్టం ప్రకారం కేవలం ఆడ సంతానమే ఉంటే తల్లిదండ్రుల ఆస్తి మొత్తం వారికి చెందదు. కొంత తండ్రి తమ్ముడి పిల్లలకు ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత కేసులో ఆ ముగ్గురు కుమార్తెలకు మూడింట రెండొంతుల ఆస్తి మాత్రమే దక్కుతుంది. ఇది ఇష్టంలేని ఆ జంట తొలుత ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం విడాకులు తీసుకున్నారు. మళ్లీ బుధవారం అన్ని మతాల వారికి వర్తించే ప్రత్యేక వివాహ చట్టం కింద కాసర్‌గోడ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పునర్వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ముగ్గురు కుమార్తెలు కూడా హాజరయ్యారు. ఆ చట్టం ప్రకారం మొత్తం ఆస్తిని ముగ్గురు కుమార్తెలకు పంచిపెట్టే అవకాశం కలిగింది. ఇది అనైతిక చర్య అని ఫత్వా మండలి ఖండించింది. సంపద మొత్తం అల్లాకే చెందుతుందని, ఇస్లాం నిబంధనలను కాదని ఇలా చేయడం తగదని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 02:06 AM