Delhi Victory: ఢిల్లీ విజయంలో ఒకే ఒక్కడు.. మోదీని మించి..
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:32 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుంది. బీజేపీ మెజార్టీ మార్క్ దాటడానికి అసలు కారణం ఏమిటి.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.

ప్రస్తుతం బీజేపీలో నరేంద్ర మోదీ, అమిత్ షా తిరుగులేని నాయకులు.. వీరి వ్యూహాలను తట్టుకుని నిలబడటం సాధ్యమయ్యే పనికాదు. ఎక్కడ ఎన్నిక జరిగినా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించడంలో వీరిని మించినవారు లేరని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దేశంలో బీజేపీ బలంగా లేని ప్రాంతాల్లో ఆ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతుందంటే దానికి ప్రధాన కారణం మోదీ, అమిత్ షా వ్యూహాలే. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఢిల్లీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే వీరిద్దరి ఆకాంక్ష నెరవేరలేదు. ఆప్ ముందు వీరి వ్యూహాలు రెండు సార్లు పనిచేయలేదు. మోదీ, అమిత్ షాలకు సాధ్యం కాని లక్ష్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీలో 48 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఢిల్లీలో ఎంతో బలమైన ఆప్ వంటి పార్టీని ఎదుర్కొని, బీజేపీకి ఘన విజయం అందించడంలో ఓ వ్యక్తి పాత్రను తప్పకుండా ప్రస్తావించాల్సిందే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. బీజేపీ విజయానికి ఎలా కారణమయ్యారో తెలుసుకుందాం.
ఒకే ఒక్కడు..
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గద్దెదించి.. తాము అధికారం చేపట్టాలనే బీజేపీ ప్రయత్నం రెండుసార్లు ఫలించలేదు. అయినప్పటికీ ఆప్‌పై బీజేపీ తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ సైతం కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. ఆప్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మరోవైపు సంక్షేమ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకోవడంతో.. ఆ వర్గాలు కేజ్రీవాల్‌కు బలమైన ఓటుబ్యాంకుగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆప్‌ను ఓడించడం బీజేపీకి ఈ జన్మలో సాధ్యం కాదని కేజ్రీవాల్ సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలన లక్ష్యంగా పార్టీ పెట్టి, సామాన్యుడి ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీలో అధికారం చేపట్టిన కేజ్రీవాల్ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం ఆరోపణలు రావడంతో వారి ప్రతిష్ట దిగజారుతూ వచ్చింది. ఆ మద్యం కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి పర్వేశ్ వర్మ. ఆయన ఆధారాలు సేకరించి అధిష్టానానికి చెప్పడంతో.. ప్రోసీడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పర్వేశ్ కేజ్రీవాల్ అవినీతిపై పోరాడారు. ఆప్ అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఓడిపోవడానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్ అనే చర్చ జరుగుతోంది.
మద్యం పాలసీపై అనుమానంతో..
ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయనే సమాచారంతో పర్వేశ్ వర్మ మొత్తం వివరాలు సేకరించే పనిలో పడ్డారు. లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మీరు అనుమతిస్తే దీనిని బయటపెడతానని చెప్పారు. ముందుగా ఆధారాలు సేకరించాలని పర్వేశ్‌కు బీజేపీ హైకమాండ్ సూచించింది. దీంతో హోటల్స్‌లో జరిగిన సమావేశాల వీడియోలను బయటకు తీశారు. మద్యం వ్యాపారంతో లింకులున్న వ్యక్తులు, పలువురు రాజకీయ ప్రముఖులు తరచూ సమావేశం కావడంపై అనుమానంతో అసలు ఏం జరుగుతుందనేదానిపై పూర్తిస్థాయి వివరాలు సేకరించడంతో ఢిల్లీ మద్యం కుంభకోణం అంశం వెలుగులోకి వచ్చింది. పర్వేశ్ సేకరించిన వీడియోల ద్వారానే ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చింది. అప్పటినుంచి కేజ్రీవాల్ అవినీతిపై బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రజల్లోకి బలంగా లిక్కర్ స్కామ్ అంశాన్ని తీసుకెళ్లగలిగింది. చివరకు ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్ని్కల్లో ఆప్‌ను ఓడించి బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషించారు పర్వేశ్ వర్మ. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు వినిపిస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More latest Telugu News Click Here