Share News

PM Modi Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీకి అరుదైన స్వాగతం.. కీలక ఒప్పందాలు

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:29 PM

మోదీ, దిస్సనాయకేలు ముఖాముఖి చర్చలు, ప్రతినిధి బృందం స్థాయి చర్చల ఫలితంగా రక్షణ సహకార ఒప్పందం, ఇంధన రంగంలో విస్తృత సహకారంతో సహా కనీసం 10 రంగాల్లో ప్రధానంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది.

PM Modi Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీకి అరుదైన స్వాగతం.. కీలక ఒప్పందాలు

శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం బ్రహ్మరథం పడుతోంది. కొలంబో ఇండిపెండెన్స్ స్క్వేర్ లో మోదీని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఘనంగా స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (శుక్రవారం) సాయంత్రం శ్రీలంకలోని కొలంబోలో దిగారు. బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి విజిత హెరాత్, ఆరోగ్య మంత్రి నలిందా జయతిస్స, మత్స్యకార మంత్రి రామలింగం చంద్రశేఖర్ సహా ఐదుగురు అగ్రశ్రేణి మంత్రులు మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఇంతకు ముందు శ్రీలంకలో 2019లో పర్యటించారు. మోదీ పర్యటన రెండు పొరుగు దేశాల మధ్య లోతైన సంబంధాలకు చారిత్రాత్మకమైనదని శ్రీలంక అభిప్రాయపడుతోంది.

ప్రధాన ఒప్పందాలు:

ప్రధాని నరేంద్ర మోడీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేల మధ్య జరిగిన చర్చల తర్వాత, భారతదేశం - శ్రీలంక శనివారం ప్రతిష్టాత్మక రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇదే సందర్భంలో ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఇరుదేశాలు ఒప్పందంపై సంతకం చేశారు. ఇరువురు నేతలు కలిసి సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు.

మోదీ, దిస్సనాయకేలు ముఖాముఖి చర్చలు, ప్రతినిధి బృందం స్థాయి చర్చల ఫలితంగా రక్షణ సహకార ఒప్పందం, ఇంధన రంగంలో విస్తృత సహకారంతో సహా కనీసం 10 రంగాల్లో ప్రధానంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది. రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా భారతదేశం-శ్రీలంక సంబంధాలలో కీలకమైన అభివృద్ధిగా పరిగణించొచ్చు. ఇది మూడు దశాబ్దాల క్రితం శ్రీలంక నుండి భారత శాంతి పరిరక్షక దళం (IPKF) వివాదాస్పదంగా ఉపసంహరించుకున్న తర్వాత రక్షణ సంబంధాలలో కొత్త దశను సూచిస్తుంది.

థాయిలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత శ్రీలంక చేరుకున్న ప్రధాని మోడీకి, భారత సంతతికి చెందిన వ్యక్తుల బృందం కూడా ఘన స్వాగతం పలికింది. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బస చేసినహోటల్ తాజ్ సముద్ర దగ్గర ఘన స్వాగతం పలికింది.

తన శ్రీలంక పర్యటన గురించి ప్రధాని మోదీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ పెట్టారు. తనకు ఘన స్వాగతం పలికిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, “కొలంబోలో అడుగుపెట్టాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించిన మంత్రులు, ప్రముఖులకు కృతజ్ఞతలు. శ్రీలంకలో కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Axis Power Deal: జగన్‌ బాటలోనే చంద్రబాబు

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 05 , 2025 | 02:29 PM