PM Modi: మోదీ.. మాటిస్తే తప్పడంతే!
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:39 AM
‘ఇక్కడ ఉన్నది మోదీ.. మాటిస్తే తప్పడంతే’ అని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూకశ్మీరుకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆ కేంద్రపాలిత ప్రాంతం సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వినతిపై ఆయన స్పందిస్తూ.. ప్రతి దానికీ ఓ సమయం ఉంటుందన్నారు.
జమ్మూకశ్మీరుకు రాష్ట్ర హోదాపై మోదీ
శ్రీనగర్-లేహ్ హైవేపై ‘జడ్ మోర్’ టన్నెల్ ప్రారంభం
శ్రీనగర్, జనవరి 13: ‘ఇక్కడ ఉన్నది మోదీ.. మాటిస్తే తప్పడంతే’ అని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూకశ్మీరుకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆ కేంద్రపాలిత ప్రాంతం సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వినతిపై ఆయన స్పందిస్తూ.. ప్రతి దానికీ ఓ సమయం ఉంటుందన్నారు. సరైన సమయంలో సరైనవే జరుగుతాయని స్పష్టం చేశారు. సోమవారం జమ్మూకశ్మీరులో పర్యటించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. శంకుస్థాపనలు కూడా చేశారు. ముఖ్యంగా గాందర్‌బల్ జిల్లా సోనామార్గ్‌లో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై 6.4 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ‘జడ్ మోర్’ సొరంగాన్ని ఆయన ప్రారంభించారు.
లోపలకు వెళ్లి పరిశీలించారు. సొరంగం నిర్మించిన కార్మికులతో సంభాషించారు. ఆ సందర్భంగా అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాగా, రూ.2,700 కోట్ల అంచనా వ్యయంతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై 12 కిలోమీటర్ల పొడవున తలపెట్టిన ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాల నిర్మాణం తలపెట్టారు. వీటిలో ఒకటి జోజిలా సొరంగం. 2028కల్లా ఇది పూర్తవుతుంది. రెండోది జడ్ మోర్. 6.4 కిమీ నిడివి గల ఈ సొరంగం శ్రీనగర్-లద్దాఖ్ నడుమ 49 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని 43 కిమీకు తగ్గిస్తుంది.
Updated Date - Jan 14 , 2025 | 04:39 AM