Share News

Gold Prices: పెళ్లి వేళ పసిడి వెలవెల

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:00 AM

భారతీయులు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఇళ్లలో జరిగే పెళ్లిల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి పెట్టే బంగారంపై ఆయా కుటుంబాల్లో పెద్ద చర్చ జరగాల్సిందే. కొన్ని ఇళ్లలో అయితే పెళ్లాయ్యాక ఫలానా పండుగకు అబ్బాయికి ఇంత బంగారం పెడతామని, అమ్మాయికి ఫలానా నగ చేయిస్తామనే ఒప్పందాలు కూడా జరుగుతాయి.

Gold Prices: పెళ్లి వేళ పసిడి వెలవెల

ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు

కొనుగోళ్లకు దూరంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు.. పెట్టిపోతల్లో తగ్గిపోతున్న బంగారం

వివాహాలు తదితర శుభకార్యాలప్పుడు నగదు, ఇతర కానుకలతో సరిపెడుతున్న ప్రజానీకం

ఇందుకు భిన్నంగా కిలోల కొద్దీ కొంటున్న సంపన్న వర్గాలు

‘ఏం వదిన గారు..!! పెళ్లికి మా అమ్మాయికి మీరు ఎన్ని తులాల బంగారం పెడతారు? ఏయే నగలు ఇస్తారు?..’ ‘ఆ సంగతి సరే కానీ.. మా అబ్బాయికి మీరెన్ని తులాలు పెడతారో ముందు అది చెప్పండి?’.. పెళ్లి ఖాయం చేసుకున్నాక పెట్టిపోతల అంశంలో జరిగే చర్చల్లో సర్వసాధారణంగా వినిపించే మాటలివి.. ఎన్ని తరాలైనా ఈ మాటలు మారలేదు కానీ..వధూవరులకు పెట్టే బంగారం బరువు మాత్రం తులాల నుంచి ప్రస్తుతం గ్రాములకు తగ్గిపోయింది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ఇళ్లలో జరిగే పెళ్లి సందడిలో పసిడి కాంతులు తగ్గిపోయాయి..!!

‘బంగారం ధరలు ఇలానే పెరుగుతూపోతే..

మంగళసూత్రాల ఫొటోను ఫోన్‌లో చూపించి

మెడలో పసుపుతాడు కట్టాల్సిందే..!!’

‘ఒకప్పుడు పెళ్లికి ఎంత ఖర్చవుతుందని లెక్కలేసుకుంటే ఆ బడ్జెట్‌ చూసి గుండెల్లో దడ పుట్టేది. కానీ, ఇప్పుడు పెళ్లి బడ్జెట్‌లో బంగారం లెక్క చూస్తేనే బీపీ, షుగర్‌ వచ్చేస్తున్నాయి..’ రోజురోజుకి పెరుగుతున్న పసిడి ధరలను, పెళ్లి ఖర్చులతో లింక్‌ చేస్తూ చక్కర్లు కొడుతున్న జోకులివి..

gtk.jpg

వ్వుకోవడానికి బాగానే ఉన్నా ప్రస్తుత పరిస్థితులు నిజంగా ఇలానే ఉన్నాయి. బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతుండడంతో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలు బంగారం పేరు చెబితేనే ‘అయ్య బాబోయ్‌’ అనేలా పరిస్థితులు మారాయి. భారతీయులు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఇళ్లలో జరిగే పెళ్లిల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి పెట్టే బంగారంపై ఆయా కుటుంబాల్లో పెద్ద చర్చ జరగాల్సిందే. కొన్ని ఇళ్లలో అయితే పెళ్లాయ్యాక ఫలానా పండుగకు అబ్బాయికి ఇంత బంగారం పెడతామని, అమ్మాయికి ఫలానా నగ చేయిస్తామనే ఒప్పందాలు కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేనేలేదు సరికదా.. తమ ఇంట్లో గతంలో జరిగిన వివాహాలప్పుడు ఎంత బంగారం పెట్టామనే విషయాన్ని పెళ్లి మాటల్లో బయటకు చెప్పడానికి కూడా కొందరు సాహసించడం లేదు. పండుగలు, ఇతర శుభకార్యాల అప్పుడు బంగారం పెట్టడం అనే మాటే చాలా ఇళ్లలో అసలు రావడం లేదు.


బంగారం బదులుగా డబ్బులు..!

పెరిగిన రేట్ల వల్ల సామాన్యులు తమ పిల్లల పెళ్లిళ్లకు నాలుగు నుంచి ఆరు తులాలు పెట్టడమే కష్టంగా భావిస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం ఎప్పట్నించో ప్రణాళికతో పొదుపు చేసిన వారిని మినహాయిస్తే.. చాలామంది బంగారం అంశంలో మమ అనిపిస్తున్నారు. బంగారం బదులు నగదు, ఇతర కానుకలు ఇస్తూ పెళ్లివారిని శాంతింపజేస్తున్నారు. మరికొందరు బంగారానికి సరిపడా ధర ఉండే భూములను ఇస్తున్నారు.

కరోనా తర్వాత నుంచి మొదలు..!

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.89,790 దాకా ఉంది. ఏదైనా ఆభరణాలు చేయించుకుంటే తయారీ చార్జీలు, తరుగు, పన్నులు అని ఇది రూ.లక్ష దాటేస్తోంది. నిజానికి, కరోనా రాకముందు బంగారం ధరలు అన్ని వర్గాలకు కాస్త అందుబాటులో ఉండేవి. 2019లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.35,220 (జీఎస్టీతో కలిపి) ఉండేది. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో, లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరేలా ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.


పడిపోయిన వ్యాపారం

పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో బంగారం దుకాణాల్లో వ్యాపారాలు భారీగా తగ్గిపోయాయి. ఒకప్పుడు రెండు, మూడు తులాలు కొనుగోలు చేసిన వారు కూడా ప్రస్తుతం మూడు, నాలుగు గ్రాములతో సరిపెడుతున్నారని చాలా మంది వ్యాపారులు వాపోతున్నారు. అక్షయ తృతీయ సమయంలో తప్పితే.. ఇతర సందర్భాల్లో మధ్య తరగతి కస్టమర్ల నుంచి గిరాకీ ఉండడంలేదని ముషీరాబాద్‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యాపారి తెలిపారు.

తగ్గేదేలే అంటున్న సంపన్నులు..

ముగ్గురు ఆడపిల్లల తండ్రైన సికింద్రాబాద్‌కు చెందిన వెంకటేశ్వర్లు అనే రైల్వే ఉద్యోగి.. ఎనిమిదేళ్ల క్రితం పెద్ద కూతురికి పెళ్లి చేసినప్పుడు 8తులాల బంగారం పెట్టాడు. నాలుగేళ్ల క్రితం రెండో కూతురి పెళ్లి చేసినప్పుడు కూడా 8తులాలు ఇచ్చాడు. గత నెల చిన్న కుమార్తెకు పెళ్లి చేసినప్పుడు 4తులాలు ఇచ్చాడు. ఇక, కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు అనే ఓ ప్రైవేటు ఉద్యోగి తన మనవడికి మొదటి పుట్టినరోజున బంగారు గొలుసు కానుకగా ఇద్దామని దుకాణానికి వెళ్లగా 10గ్రాముల గొలుసు ధర రూ.80,500 ఉండడం చూసి అవాక్కయ్యాడు. పెరుగుతున్న ధరలను చూసి వెంకటేశ్వర్లు, కృష్ణారావు వంటి సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం అంటేనే వామ్మో అంటుంటే.. సంపన్నులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తమ ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలప్పుడు కిలోల లెక్కన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆడవాళ్లు ఆపాదమస్తకం రకరకాల నగలు ధరిస్తుంటే.. మగవారు కూడా నగలు ధరించి హడావుడి చేస్తున్నారు. సంపన్నులు కదా మరీ..!!

-హైదరాబాద్‌ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి)


అమ్మకాలు సగానికి సగం తగ్గాయి..

బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. పెళ్లిళ్లలో పెళ్లి కూతురికి పెట్టే బంగారాన్ని సగం వరకు తగ్గిస్తున్నారు. ఒకప్పుడు పది తులాల బంగారు పుస్తెలను చాలా ఈజీగా పెట్టేవారు. ఇప్పుడు అతి కష్టం మీద 5 తులాలు పెడుతున్నారు. డబ్బు రూపంలో మాకు ఎక్కువ మొత్తం వస్తున్నప్పటికీ.. మేము ఇచ్చే బంగారం పరిమాణం చాలా తక్కువుగా ఉంటుంది. ఇదే సమస్యగా మారింది.

- ఆనంద్‌ పాటిల్‌, బంగారు, వెండి వర్తకుడు, సికింద్రాబాద్‌


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:00 AM