Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
ABN , Publish Date - Apr 09 , 2025 | 09:01 AM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనితో పాటుగా కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఇక ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ముంబై బాంద్రా పోలీసులు.. 1000 పేజీల ఛార్జ్‌షీట్‌తో పాటుగా కొన్ని ఆధారాలను కూడా బంద్రా కోర్టుకు సమర్పించినట్లుగా వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగింది. షెహ్జాద్ అనే వ్యక్తి.. సైఫ్ అలీఖాన్ బాంద్రా నివాసంలో చోరీకి ప్రయత్నించాడు. ఆ సయమంలోనే నటుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా బాంద్రా కోర్టులో వెయ్యి పేజీల ఛార్జ్‌షీట్‌తో పాటుగా మరి కొన్ని ఆధారాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. "ఈ ఛార్జ్‌షీట్‌లో నిందితుడికి వ్యతిరేకంగా సేకరించిన కొన్ని ఆధారాలు కూడ ఉన్నాయి. ఛార్జ్‌షీట్ 1000 పేజీలకు పైగా ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలను కూడా ఛార్జ్‌షీట్‌లో భాగం చేశాము. దీనిలో నేరం చోటు చేసుకున్న ప్రాంతంలో, సైఫ్ శరీరంలో, నిందితుడి వద్ద లభించిన కత్తి.. మూడు ఒక్కటే అని తేలింది" అని వివరించారు. అలానే ఫింగర్‌ప్రింట్ రిపోర్ట్‌ను కూడా దాఖలు చేశాం అని తెలిపారు.
సుమారు మూడు నెలల క్రితం జరిగిన ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి విషయం తెలిసిన వెంటనే నటుడిని ముంబై లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ చేశారు.
నిందితుడి విషయానికి వస్తే.. అతడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని.. ముంబై రావడానికి ముందు కోల్‌కతాలో పలు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై వచ్చిన నిందితుడు సైఫ్ ఇంట్లో దొంగతనానికి పాల్పడే సమయంలో నటుడిపై దాడి చేసి గాయపర్చాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి:
ఎంత మంచి మనసో.. పుట్టిన రోజు నాడు లక్షల రూపాయలు దానం
Train Track Stunt: ఏం పోయేకాలం రా నాయనా.. రీల్స్ కోసం ఇంత దిగజారాలా