Hajj 2025: భారత్ సహా 13 దేశాల వీసాలు తాత్కాలికంగా నిషేధం..కారణమిదే..
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:11 PM
ఈ ఏడాది 2025 హజ్ యాత్ర సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా భారత్ సహా 13 దేశాల వీసాలను తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే ఎందుకు నిషేధం విధించారు, కారణాలేంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సౌదీ అరేబియా హజ్ యాత్రకు వెళ్లే హజ్ యాత్రికులు, ఉమ్రా సందర్శకులకు 2025 సీజన్‌లో కీలకమైన మార్పులు ప్రకటించారు. ఈ ఏడాది హజ్ యాత్ర దగ్గరపడుతుండటంతో సౌదీ అరేబియా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర 11 దేశాల పౌరులపై వీసా నిషేధం విధించింది. ఈ నిర్ణయం 2025 జూన్ నెల మధ్య వరకు అమల్లో ఉంటుంది.
ప్రభావిత దేశాలు
హజ్ 2025 సీజన్ సందర్భంగా భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్, మొరాకో వంటి 14 దేశాలకు చెందిన పౌరులపై వీసా నిషేధం అమలులోకి వచ్చింది. దీంతో, ఈ దేశాలకు చెందిన వ్యక్తులు ఉమ్రా, వ్యాపార లేదా కుటుంబ సందర్శన వీసాలు పొందడానికి ఇప్పుడు తాత్కాలికంగా అవకాశం లేదు.
నిషేధానికి కారణాలు ఏంటి
ఈ నిషేధానికి ప్రధాన కారణం వీసాల వ్యవస్థలో పెరిగిన గందరగోళం, అక్రమ హజ్ యాత్రలు సహా పలు అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో చాలామంది విదేశీ పౌరులు ఉమ్రా లేదా కుటుంబ వీసాలపై సౌదీ అరేబియాలో ప్రవేశించి, అధికారిక అనుమతి లేకుండా హజ్ యాత్రలో పాల్గొన్నట్లు నివేదికలు వచ్చాయి.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చే పౌరులు పలు రకాల వీసాలు ఉపయోగించి సౌదీ అరేబియాలో ప్రవేశించి, అనధికారికంగా పనులు చేస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో, సౌదీ కార్మిక మార్కెట్, సమాజంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విధంగా అంగీకారం లేని హజ్ యాత్ర, రద్దీ, భద్రత సమస్యలు మరణాలకు దారితీసిన ఘటనలకు కారణమయ్యాయి. ఈ క్రమంలో వాటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోటా వ్యవస్థ అమలు
2024 హజ్ సీజన్లో దాదాపు 1,200 మంది యాత్రికులు మరణించారు. ఇదే సమయంలో, కొందరు విదేశీయులు వ్యాపార లేదా కుటుంబ వీసాలను ఉపయోగించి అనధికారికంగా దేశంలో పని చేయడానికి ప్రయత్నించారు. దీంతో సౌదీ కార్మిక మార్కెట్‌కు ఇబ్బంది ఏర్పడింది. సౌదీ అరేబియా హజ్ కోసం ఒక కోటా వ్యవస్థను అమలు చేసింది. దీంతో ప్రతీ దేశానికి నిర్దిష్ట సంఖ్యలో హజ్ స్లాట్‌లు కేటాయించబడతాయి. కోటా వ్యవస్థ ముఖ్యంగా హజ్ యాత్రికుల సంఖ్యను నియంత్రించడానికి, అన్ని హజ్ కార్యక్రమాలు సజావుగా సాగాలని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.
హజ్ 2025 సీజన్
హజ్ 2025 సీజన్ జూన్ 4 నుంచి 9 మధ్య నిర్వహించబడే అవకాశం ఉంది. ఈ వీసా నిషేధం ద్వారా, సౌదీ అరేబియా యాత్రికులకు మరింత సురక్షితమైన, సమర్ధవంతమైన హజ్ అనుభవాన్ని అందించాలని ఆశిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Stock Market: అసలు స్టాక్ మార్కెట్ నష్టాలు ఎందుకు..
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్..నిమిషాల్లోనే లక్షల కోట్ల నష్టం
YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News