New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:40 AM
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనకు.. రైళ్ల పేర్లలో చోటుచేసుకున్న గందరగోళమే కారణమని భావిస్తున్నారు. ప్లాట్‌ఫాంపైకి రైలు రాకపై మైకులో రైల్వే సిబ్బంది చేసిన ప్రకటనతో ప్రయాణికులు తికమక పడటం వల్లే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో

ఢిల్లీలో తొక్కిసలాటకు కారణమిదే!..
రైలు రాకపై ప్రకటనతో ప్రయాణికుల తికమక
14వ ప్లాట్‌ఫాం నుంచి 16వ ప్లాట్‌ఫాంకు..
ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట
18కి చేరిన మృతులు.. 12 మందికి గాయాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనకు.. రైళ్ల పేర్లలో చోటుచేసుకున్న గందరగోళమే కారణమని భావిస్తున్నారు. ప్లాట్‌ఫాంపైకి రైలు రాకపై మైకులో రైల్వే సిబ్బంది చేసిన ప్రకటనతో ప్రయాణికులు తికమక పడటం వల్లే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం, ఈ క్రమంలో శనివారం రాత్రి ప్లాట్ ఫామ్‌ల వద్ద తొక్కిసలాట జరగడం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18కి చేరింది. వీరిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 12 మంది గాయపడ్డారు. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా.. ప్రయాగ్‌రాజ్ స్పెషల్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ అనే రైళ్ల పేర్ల విషయంలో గందరగోళం తలెత్తడం వల్లే ఘటన జరిగిందని భావిస్తున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.. మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు 16వ నంబరు ప్లాట్‌ఫాంపైకి వస్తోందంటూ రైల్వే సిబ్బంది మైకులో ప్రకటించారు. అయితే అప్పటికే 14వ నంబరు ప్లాట్‌ఫాం పైకి ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ వచ్చి ఉంది. ఆ రైలు ఎక్కాల్సిన ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఆ ప్లాట్‌ఫాం వద్ద ఉన్నారు. కానీ, సిబ్బంది ప్రకటనతో.. తాము వెళ్లాల్సిన రైలు 16వ ప్లాట్‌ఫాంపైకి వచ్చిందని భావించి ఒక్కసారిగా అక్కడికి పరుగులు తీశారు. దీంతో గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాట జరిగింది. పైగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన నాలుగు రైళ్లలో మూడింటి రాక ఆలస్యం కావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే రైల్వేశాఖ అధికారులు మాత్రం దీనిని ఖండించారు. కొందరు ప్రయాణికులు 14వ, 15వ ప్లాట్‌ఫాంలపైకి వచ్చేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి దిగుతూ.. కాలుజారి ఇతరులపై పడ్డారని, తొక్కిసలాటకు ఇదే కారణమై ఉంటుందని భావిస్తున్నామని నార్తర్న్ రైల్వే సీపీఆర్‌వో హిమాన్షు ఉపాధ్యాయ్ తెలిపారు. కాగా, ఘటనపై విచారణకు రైల్వేశాఖ ఇద్దరు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తక్షణమే విచారణ ప్రారంభించిన కమిటీ.. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వారితోపాటు తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొక్కిసలాట జరిగిన ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిన ప్రయాణికుల వస్తువులతో హృదయ విదారకంగా మారింది. అక్కడ పడిపోయిన ప్రయాణికుల దుస్తులు, చెప్పులు, వాటర్ బాటిళ్లు, బ్యాగులను రైల్వే సిబ్బంది ఆదివారం తొలగించారు.
ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు
మృతుల కుటుంబీకులతో లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి తమవారి మృతదేహాలను గుర్తించారు. ఏడేళ్ల తన కూతురికి తలలో మేకు గుచ్చుకొని చనిపోయిందంటూ ఓ తండ్రి విలపించాడు. 12 ఏళ్ల తన కుమారుడి మృతదేహాన్ని చూసి మరో తండ్రి కుప్పకూలాడు. తొక్కిసలాట ఘటనను ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నాయి. ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటన రైల్వేశాఖ వైఫల్యాన్ని, ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని మరోసారి స్పష్టం చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నప్పుడు రైల్వేస్టేషన్‌లో సరైన సౌకర్యాలు కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు.