Supreme Court: కట్నం కేసులపై పార్లమెంటే చట్టం చేయాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:30 AM
సుప్రీంకోర్టు, వరకట్న వేధింపులు మరియు మెయింటెనెన్స్ చెల్లింపులకు సంబంధించిన చట్టాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కోర్టు చట్టాలు చేయలేమని, ఈ పని పార్లమెంట్ చేయాల్సిన బాధ్యత అని పేర్కొంది.

ఈ అంశంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: వరకట్న వేధింపులు, మెయింటెనెన్స్ చెల్లింపునకు సంబంధించిన చట్టాలు దుర్వినియోగం కాకుండా.. మహిళలు, పురుషులకు సమానంగా వర్తించేలా మార్గదర్శకాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. కోర్టులు చట్టాలు చేయలేవని, ఇది పార్లమెంటు బాధ్యత అని పేర్కొంది. జనశ్రుతి అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. చట్టంలో దుర్వినియోగం కాకుండా ఉన్న సెక్షన్లు ఏవో చెప్పండి అని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. మహిళల సాధికారత కోసం ఐపీసీ 498ఏ (బీఎన్‌ఎ్‌స 84), సీఆర్‌పీసీ 125 సెక్షన్లను పొందుపర్చారని, కొన్ని ఘటనల్లో దుర్వినియోగం అయ్యాయన్న సాకుతో వాటి స్ఫూర్తిని దెబ్బతీయలేమని స్పష్టం చేసింది. ఈ సెక్షన్ల దుర్వినియోగంతో బాధితులుగా మారిన ఎవరైనా కోర్టులను ఆశ్రయించవచ్చని, ఆయా కేసుల్లో మెరిట్‌ను బట్టి న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. అయితే పురుషులు కూడా భార్యలపై మెయింటెనెన్స్ కోసం కేసులు వేసే అవకాశం ఉండాలని స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది పేర్కొనగా.. కోర్టులు చట్టాలు చేయలేవని, పార్లమెంటు ఆ పని చేయాలని పేర్కొంది. ఈ మేరకు పిల్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.