Share News

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:47 AM

ముంబై ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడైన తహవూర్ రాణాని ఇండియాకు తీసుకువచ్చారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం అని ప్రశంసిస్తున్నారు. రాణాను ఇండియాకు తీసుకువచ్చిన నేపథ్యంలో మోదీ పాత ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్
Narendra Modi

న్యూఢిల్లీ: సుమారు 17 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న 26/11 ముంబై ఉగ్ర దాడి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ప్రధాన నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణాను.. తాజాగా ఇండియాకు తీసుకువచ్చారు. ఇన్నాళ్లు పాటు అమెరికాలో ఉన్న రాణాను భారతీయ అధికారుల బృందం గురువారం ఇండియాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రాణా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. రాణాను ఇండియాకు అప్పగించిన నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. 14 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


14 ఏళ్ల క్రితం మోదీ చేసిన ఆ ట్వీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను విమర్శించారు. అలానే అమెరికా వైఖరిని కూడా తప్పు పట్టారు. ఈ కేసుకు సంబంధించి 2011లో అమెరికా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ముంబై దాడుల్లో రాణాకు ప్రత్యక్ష పాత్ర లేదని.. అతడు అమాయకుడని స్పష్టం చేసింది. అయితే ముంబై ఉగ్రదాడికి ప్రధాన కారణమైన ఉగ్ర సంస్థకు రాణా అండగా నిలిచాడన్న ఆరోపణలపై అతడిని దోషిగా తేల్చింది.

అమెరికా తీర్పుపై నాడు అనగా 2011, జూన్ 10న ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్‌లో మోదీ "ముంబై దాడుల ఘటనలో తహవూర్ రాణాను అమాయకుడని అమెరికా ప్రకటించడం దారుణం. ఇది భారత ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని అవమానించడమే అవుతుంది. మన దేశ విదేశాంగ విధానానికి ఇది భారీ ఎదురుదెబ్బ" అంటూ ట్వీట్ చేశాడు.


ప్రస్తుతం రాణాను ఇండియాకు అప్పగించిన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజనులు ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తూ.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాణాను ఇండియాకు తీసుకురావడంల కేంద్ర ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించిందని ప్రశంసిస్తున్నారు. రాణా అప్పగింత.. మోదీ విదేశాంగ విధానం సాధించని భారీ విజయం అంటూ అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా

School Teacher: ఓ టీచరమ్మ.. నువ్వే నిద్రపోతే.. పిల్లలేం చేయాలి

Updated Date - Apr 11 , 2025 | 03:55 PM