Share News

Tamil Nadu: గవర్నర్‌ ఆమోదం లేకుండానే చట్టాలైన 10 బిల్లులు

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:44 AM

తమిళనాడు రాష్ట్రంలో, గవర్నర్ ఆమోదం లేకుండా పది బిల్లులు చట్టరూపం దాల్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లు పరిగణించాలన్న తీర్పు ఇచ్చింది. ఇందులో, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల చాన్సలర్‌ పదవిని ముఖ్యమంత్రి కోసం మార్చడం, వివిధ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణలు ఉన్నాయి

Tamil Nadu: గవర్నర్‌ ఆమోదం లేకుండానే చట్టాలైన 10 బిల్లులు

గెజిట్‌ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

  • సుప్రీం సంచలన తీర్పుతో నోటిఫికేషన్‌

  • దేశ చరిత్రలోనే తొలిసారిగా నిర్ణయం

చెన్నై, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌, రాష్ట్రపతి సంతకం లేకుండా దేశంలోనే తొలిసారిగా తమిళనాట పది బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ మేరకు స్టాలిన్‌ ప్రభుత్వం శనివారం గెజిట్‌ వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. సుదీర్ఘకాలంగా పది బిల్లులు పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక 2023 నవంబరు 18నే ఆ బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదించినట్లు పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు కాపీని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ 10 బిల్లులూ చట్టరూపం దాల్చినట్లు అందులో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఇకపై ముఖ్యమంత్రే చాన్సలర్‌గా వ్యవహరిస్తారు.


ఇదీ నేపథ్యం...

తమిళనాడు గవర్నర్‌గా 2021లో బాధ్యతలు స్వీకరించిన ఆర్‌ఎన్‌ రవికి స్టాలిన్‌ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారుకు మధ్య బిల్లుల విషయంలో మొదటినుంచీ ఘర్షణ కొనసాగుతోంది. తాము పంపిన 10 బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2023 నవంబరులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను ఆమోదించకపోగా, పునఃపరిశీలించాలని సూచిస్తూ వాటిని వెనక్కి కూడా పంపడం లేదని ఆరోపించింది. ఆ బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు గడువును నిర్దేశించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం గత మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వం ఆమోదించి పంపిన 10 బిల్లులపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఏ నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లపాటు తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. శాసనసభ తీర్మానించి పంపిన బిల్లును గవర్నర్లు గరిష్ఠంగా నెలరోజులకు మించి పెండింగ్‌లో ఉంచకూడదని, మంత్రివర్గ సిఫారసు మేరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే, నెల రోజుల్లోనే పంపాలని తీర్పు చెప్పింది. ఒకవేళ మంత్రివర్గ సలహాలు, సూచనలకు విరుద్ధంగా.. సమ్మతిని నిలుపుదల చేయాలని గవర్నర్‌ భావిస్తే.. ఆ విషయాన్ని తెలుపుతూ గరిష్ఠంగా 3 నెలల్లోపు బిల్లును తిప్పి పంపాలని పేర్కొంది. ప్రస్తుత బిల్లుల విషయంలో గవర్నర్‌ సదుద్దేశంతో వ్యవహరించలేదని, రాష్ట్రపతి ఆమోదం కోసం 10 బిల్లులను పెండింగ్‌లో పెట్టడం ఏకపక్ష చర్యగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023 నవంబరు 18నే ఆ బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదించినట్లు పరిగణించాలని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఆ బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ఏవైనా చర్యలు తీసుకున్నా, అవి చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని ధర్మాసనం నిర్ణయించింది.


ఆ 10 బిల్లులు ఇవే...

1) తమిళనాడు వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (సవరణ) బిల్లు

2) తమిళనాడు ఫిషరీస్‌ వర్సిటీ (సవరణ) బిల్లు

3) మద్రాసు విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు 2022 ఏప్రిల్‌లో డీఎంకే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును వీసీల నియామకంతో పాటు గవర్నర్‌ను చాన్సలర్‌ పదవి నుంచి తొలగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు.

4) తమిళనాడు వ్యవసాయ వర్సిటీ(సవరణ) బిల్లు

5) తమిళనాడు డాక్టర్‌ అంబేడ్కర్‌ లా యూనివర్సిటీ (సవరణ) బిల్లు

6) తమిళనాడు డాక్టర్‌ ఎంజీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు

7) తమిళనాడు విశ్వవిద్యాలయం(సవరణ) బిల్లు

8) తమిళనాడు వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ వర్సిటీ (తదుపరి సవరణ) బిల్లు

9) సిద్ద వైద్య విశ్వవిద్యాలయ బిల్లు

10) అన్నా విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

Updated Date - Apr 13 , 2025 | 04:44 AM