Women Powered Plant: అక్కడ సిబ్బంది అందరూ మహిళలే
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:07 AM
మహబూబ్‌నగర్ దివిటిపల్లిలో ఉన్న అమర్‌రాజా గిగా ప్లాంట్‌లో 350 మంది గ్రామీణ మహిళలు ఉద్యోగాలు పొందుతూ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటున్నారు

గ్రామీణ మహిళల ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది వారు పొలం పనులకే పరిమితం అనుకుంటారు. కానీ అవకాశాలు లభిస్తే వారు కూడా ఎవరికీ తీసిపోరు. దీనికి ఉదాహరణ మహబూబ్‌నగర్ దివిటిపల్లిలో ఉన్న అమర్‌రాజా గిగా ప్లాంట్‌లో పని చేసే మహిళలు. అక్కడ సుమారు 430మంది సిబ్బంది ఉంటే వారిలో 350 మంది గ్రామీణ యువతులే! వారిలో కొందరిని ‘నవ్య’ పలకరించింది.
మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే పెద్ద పరిశ్రమలు తక్కువ. పరిశ్రమలు తక్కువ కావటం వల్ల ఇంటర్ దాకా చదువుకున్న అమ్మాయిలు కూడా కూలి పనులకే వెళ్తూ ఉంటారు. కూలి పనికి వెళ్లటం వల్ల ఆదాయం తక్కువగానే వస్తుంది. వారు కుటుంబానికి చేసే సాయం కూడా తక్కువే.. పైగా వారికి పెళ్లి అయి పిల్లలు పుడితే మరిన్ని సమస్యలు పెరుగుతాయి. ఇదంతా ఒక విషవలయంలా తయారవుతుంది. దీని నుంచి వీలైనంత మందిని బయటపడేయాలనే ఉద్దేశంతో అమర్‌రాజా సంస్థ పేదరికం ఎక్కువగా ఉండే మహబూబ్‌నగర్‌లో విడిభాగాలను బిగించి.. బ్యాటరీలను తయారుచేసే గిగా ప్లాంట్‌ను నెలకొల్పింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా ప్లాంట్‌లను నెలకొల్పినప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ‘‘మేము ఈ ప్లాంట్‌ను ప్రారంభించినప్పుడు- చుట్టుపక్కల ప్రాంతాలలో చదువుకున్న యువతులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నాం. అందులో ఎక్కువ మంది పదోక్లాసు, ఇంటర్ దాకా చదువుకున్నవారే. వారికి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండదు. ముందు వారికి శిక్షణ ఇచ్చాం..’’ అని కంపెనీ ప్రతినిధి వివరించారు. ఈ శిక్షణ ఇవ్వటానికి కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటారు ఆమె. ‘‘మొదట్లో ఇక్కడ ఉన్న కుటుంబాలలో అనేక అనుమానాలు ఉండేవి.
కంపెనీకి పంపించటానికి సంశయించేవారు. ముందు కొద్ది మంది చేరారు. ఆ తర్వాత వారిని చూసి ఇతరులు వచ్చారు. మా దగ్గర చాలా సురక్షితమైన వాతావరణం ఉంటుందనే విషయాన్ని తెలియజేయటానికి వీరందరినీ చిత్తూరులో ఉన్న మా ప్లాంట్‌కు తీసుకువెళ్లాం. అక్కడ కూడా అందరూ మహిళలే పనిచేస్తూ ఉంటారు. దానితో వీరందరికీ నమ్మకం వచ్చింది. ఇప్పుడు కంపెనీపై పూర్తి భరోసా వచ్చింది’’ అంటారు ఆ ప్రతినిధి.
జీవన ప్రమాణాలు మెరుగ్గా..
సాధారణంగా పెళ్లి అయ్యి.. పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో అదనపు సంపాదన మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న సౌజన్యది కూడా ఇదే కథ. ‘‘నేను ఇంటర్ దాకా చదివా. తర్వాత పెళ్లి అయిపోయింది. నేను గృహిణి పాత్రకు పరిమితయిపోయా. ఇంటర్ దాకా చదువుకున్నా మంచి ఉద్యోగాలు ఏమి రాలేదు. పొలం పనికి వెళ్తే రోజుకు మూడొందలే వచ్చేది. పైగా అన్ని సీజన్లలోను పని దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్లాంట్‌లో చేరా. ప్రస్తుతం స్థిరమైన ఆదాయం వస్తోంది. పిల్లల చదువుకు భరోసా వచ్చింది..’’ అంటారు ఆమె. ప్లాంట్‌లో చేరి ఆదాయం పెరిగిన తర్వాత కూడా రకరకాల అపోహలు వెంటాడుతూ ఉంటాయి. ఇవి తప్పని ఎవరో ఒకరు ఉదాహరణగా నిలిస్తే మిగిలిన వారిలో సైర్థ్యం పెరుగుతుంది. ఈ ప్లాంట్‌లో పనిచేసే మల్లీశ్వరి అలాంటి ఉదాహరణే. ‘‘సాధారణంగా బ్యాటరీలు తయారీ ప్లాంట్ అంటే కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయనే అపోహలు ఉండేది. నేను ఉద్యోగంలో చేరటానికి చాలా భయపడ్డా. చేరిన తర్వాత ముడిపదార్థాల నాణ్యతను పరిశీలించి ప్లాంట్‌కు ఇచ్చే బాధ్యతను నాకు అప్పగించారు. పైగా షిప్టులు కూడా ఉంటాయి. మొదట్లో ఇబ్బంది అనిపించేది. కానీ నా కుటుంబ సభ్యులు సహకరిస్తూ ఉండటంతో ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతోంది’’ అంటారు మల్లీశ్వరి.
చేయి చేయి కలిపి...
ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో చుట్టు పక్కల ఉన్న గ్రామ ప్రజల దృక్పథంలో మార్పు వచ్చింది. ఇదే సమయంలో ప్లాంట్‌లో పని చేసే మహిళలకు బస్సు సౌకర్యం, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ సరైన ఉపాధి అవకాశాలు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. వాటిలో కూడా ఈ తరహా ప్లాంట్స్ నెలకొల్పితే గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
-గోగుమళ్ల కవిత
బ్యాటరీలు బిగించేటప్పుడు చేతులతో చేసే పనులు కొన్ని ఉంటాయి. కొన్ని యంత్రాలు మాత్రమే చేయగలుగు తాయి. ఈ పనులు మగవాళ్లే కాదు. మహిళలు కూడా సులభంగా చేయవచ్చు.
- శైలజ
వ్యాపారవేత్త రామచంద్ర గల్లా 1985లో అమర రాజా గ్రూపును స్థాపించారు. 1990లలో ఎలకా్ట్రనిక్ వస్తువుల తయారీ ప్లాంటును ప్రారంభించినప్పుడు, స్థానిక మహిళలకు ప్రాథాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం చిత్తూరులోని ఫ్యాక్టరీలో 85ు మహిళలు పని చేస్తున్నారు. ఇదే వారసత్వాన్ని కొనసాగించాలనే ధృక్పథంతో దివిటిపల్లిలో గిగా ప్లాంట్‌ను నెలకొల్పారు.
ఇవి కూడా చదవండి..