Beauty Tips: ఈ పండు ఒక్కటి చాలు.. ఏ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు..
ABN, Publish Date - Jan 04 , 2025 | 03:37 PM
ముఖం మెరుపు కోసం అమ్మాయిలు రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. కొంత మంది ఫేస్‌కు ఎన్ని రాసుకున్నా కూడా అందంగా కనబడటం లేదంటూ బాధపడుతుంటారు. అయితే, అలాంటి వారు ఈ పండుతో ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోని ముఖంపై వాడితే పార్లర్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Banana Face Pack: అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాకుండా ఈ పండు చర్మానికి కూడా మంచి చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చర్మాన్ని మెరుసేలా చేస్తుంది. చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి.. ముఖంలోని జిడ్డును తొలగిస్తుంది. అలాగే, మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను ఈ అరటిపండు చంపుతుంది.
చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించే బదులుగా ఇంట్లోనే అరటిపండుతో ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. దీని తయారు చేసే విధానం కూడా చాలా ఈజీ. వారానికి ఒకసారి అరటిపండు మాస్క్ మీ ముఖానికి వేసుకోవడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. అయితే ఏ చర్మ రకానికి అరటిపండు ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
పొడి చర్మం ..
పొడి చర్మం ఉన్నవారు రెండు అరటిపండ్ల తొక్క తీసి దానిని మెత్తని ముద్దగా చేయాలి. దీనికి ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసుకుని 15-20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
జిడ్డు చర్మం ..
అరటిపండు, దోసకాయ, కొన్ని బొప్పాయి పండు ముక్కలను మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేసుకోని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. చర్మానికి అవసరమైన తేమను కూడా ఈ ప్యాక్ అందిస్తుంది.
మొటిమలను వదిలించుకోవడానికి..
పండిన అరటిపండులో కొన్ని వేప పువ్వులను వేసి పేస్ట్ లా చేసుకోవాలి. దానికి చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఫేస్‌ను కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ దాని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. వారానికి ఇలా రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
టాన్ తొలగించుకోవడానికి..
టాన్ తొలగించుకోవడానికి అరటిపండును మెత్తగా చేసుకుని అందులో ఒక చెంచా శనగ పిండి, కొన్ని చుక్కల నిమ్మరసం కలపుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించుకున్న 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు పోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్యాక్ వేసుకుని ముఖం కడుక్కుంటే ట్యాన్ తగ్గుతుంది.
(Note: ఈ కథనం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)
Updated Date - Jan 04 , 2025 | 03:38 PM